సినిమా టికెట్లమ్మే ఆలోచన మానుకోవాలి

ABN , First Publish Date - 2021-11-26T08:39:41+05:30 IST

సినిమా టికెట్లమ్మే ఆలోచన మానుకోవాలి

సినిమా టికెట్లమ్మే ఆలోచన మానుకోవాలి

పెద్ద పరిశ్రమను దెబ్బ కొట్టొద్దు: బీజేపీ ఎమ్మెల్సీలు

అమరావతి, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): ఇప్పటికే మద్యం ఆదాయాన్ని చూపి అప్పులు తెచ్చిన ప్రభుత్వం, సినిమా టికెట్ల అమ్మకం వల్ల వచ్చే ఆదాయంపైనా కొత్తగా అప్పులు తీసుకురావాలని ప్రయత్నిస్తోందని బీజేపీ ఎమ్మెల్సీలు మాధవ్‌, వాకాటి నారాయణరెడ్డి మండిపడ్డారు. సినిమా టికెట్లు విక్రయించాలన్న ఆలోచనను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. గురువారం శాసనమండలిలో ఆంధ్రప్రదేశ్‌ సినిమా రెగ్యులరైజేషన్‌ చట్టానికి సవరణ బిల్లును సమాచార మంత్రి పేర్ని నాని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా బీజేపీ సభ్యుడు మాధవ్‌  మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికే రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో ప్రభుత్వం అనేక విషయాల్లో చేతులు కాల్చుకుందని, ప్రజలకు ఇసుక దొరకకుండా చేసిందని విమర్శించారు. వ్యవస్థలో లోపాలు ఉంటే సరిచేయాలి కానీ, వ్యవస్థనే మార్చేస్తామనడం దారుణమన్నారు. వాకాటి నారాయణరెడ్డి మాట్లాడుతూ పెద్ద ఇండస్త్రీని ప్రభుత్వం దెబ్బకొట్టడం సరికాదన్నారు. నాలుగు షోలే వేయాలని ప్రభుత్వం చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. రోజుకు 6 షోలకు అనుమతులివ్వాలని డిమాండ్‌ చేశారు. బిల్లులో దురుద్దేశాలు ఉన్నట్టు అర్థమవుతోందన్నారు. దీనిపై మంత్రి పేర్ని స్పందిస్తూ... సినిమా టికెట్లపై బీజేపీ సభ్యులు సొంతంగా మాట్లాడినట్లు కనపడడంలేదన్నారు. వారే మాట్లాడారో? ఎవరైనా వారితో మాట్లాడించారో? తమకు అనవసరమన్నారు. తెలుగు ఫిలిం ఛాంబరే సినిమా టికెట్లను ఆన్‌లైన్‌ చేయమని కోరిందని చెప్పారు. స్టేక్‌ హోల్డర్లందరితో మాట్లాడిన తర్వాతే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని, బీజేపీ సభ్యులు అవగాహనలేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. టికెట్ల సొమ్మును మరుసటి రోజు ఉదయం రిజర్వ్‌బ్యాంక్‌ తెరిచిన మొదటి గంటలోనే థియేటర్ల యాజమాన్యాల ఖాతాల్లో జమ చేస్తామన్నారు. ‘బ్లాక్‌బస్టర్‌ సినిమాలకు కోట్లాది రూపాయలు వసూలు కాగా, ఆ స్థాయిలో జీఎస్టీ చెల్లింపులు ఎందుకు పెరగలేదు? నేల టికెట్‌ రూ.30 ఉంటే.. వెయ్యి, రూ.1,500కు అమ్ముకోవడం తగునా? బీజేపీ సభ్యులకు జగన్‌ ప్రభుత్వంలోనే రివర్స్‌ కనిపిస్తోందా? మరి మోదీని ఏం అనుకుందాం? మూడు వ్యవసాయ చట్టాల రద్దు రివర్స్‌ కాదా?’ అని మంత్రి ప్రశ్నించారు.

Updated Date - 2021-11-26T08:39:41+05:30 IST