అవినాశ్ ‘కుటుంబం’ పరువు తీస్తున్నారు
ABN , First Publish Date - 2021-10-21T10:08:37+05:30 IST
వైసీపీలో చేరిన అవినాశ్, దేవినేని కుటుంబం పరువు తీస్తున్నారని తెలుగు యువత కృష్ణా జిల్లా నేత దేవినేని చంద్రశేఖర్ ఆరోపించారు.
మా ఎదుగుదల టీడీపీ పెట్టిన భిక్ష: దేవినేని చంద్రశేఖర్
అమరావతి, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): వైసీపీలో చేరిన అవినాశ్, దేవినేని కుటుంబం పరువు తీస్తున్నారని తెలుగు యువత కృష్ణా జిల్లా నేత దేవినేని చంద్రశేఖర్ ఆరోపించారు. దివంగత మాజీ మంత్రి దేవినేని నెహ్రూ తమ్ముడు బాజీ... కుమారుడైన చంద్రశేఖర్ బుధవారం ఆయన టీడీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘టీడీపీ కేంద్ర కార్యాలయంపైనా, పట్టాభి ఇంటిపైనా జరిగిన దాడుల్లో అవినాశ్ మిత్ర బృందం అందరికీ కనిపించింది. ఆ వారిని ఈ దాడికి అవినాశే పంపించాడు. టీడీపీ ఆవిర్భావం నుంచి దేవినేని కుటుంబం ఆ పార్టీకి అంటిపెట్టుకొని ఉంది. పార్టీ వల్లే మా కుటుంబానికి ఇంత గుర్తింపు వచ్చింది. మా ఎదుగుదల టీడీపీ పెట్టిన భిక్ష. నెహ్రూ చనిపోయే ముందు టీడీపీకి కట్టుబడి ఉండాలని చెప్పారు. ఆయన చనిపోయిన సమయంలో చంద్రబాబు రెండుసార్లు వచ్చి పరామర్శించారు. ఆయన పార్థివ దేహం పై టీడీపీ పతాకాన్ని కప్పారు. ఎన్టీ రామారావు తన తొడపై అవినాశ్‌ను కూర్చోబెట్టుకొని ఉన్న ఫొటో ఇప్పటికీ అవినాశ్ బెడ్‌రూంలో ఉంటుంది. నెహ్రూ చనిపోయిన తర్వాత అవినాశ్‌ను టీడీపీ నాయకత్వం ఎంతో ప్రోత్సహించింది. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్ష పదవిని, గుడివాడ టిక్కెట్టును ఇచ్చింది. అయినా అధికార దాహంతో ఆయన పార్టీ మారా రు. జగన్ ఏం ప్రలోభాలు చూపించారో తెలియదుగాని తన మనుషులను పంపి అమ్మలాంటి పార్టీ కార్యాలయంపై అవినాశ్ దాడి చేయించి భ్రష్టు పట్టాడు’’ అని అన్నారు.