దేశంలో నిరంకుశ ప్రభుత్వం

ABN , First Publish Date - 2021-12-28T08:36:51+05:30 IST

‘‘పెట్టుబడిదారీ దేశాలతో పాటు మన దేశంలోనూ నిరంకుశ ప్రభుత్వం నడుస్తోంది. దానికి తోడు మతోన్మాద రాజకీయాలు పెరిగాయి.

దేశంలో నిరంకుశ ప్రభుత్వం

  • మతోన్మాద రాజకీయాలు పెరిగాయి
  • దేశంలోని పార్టీలన్నింటినీ ఎన్టీఆర్‌ ఏకం చేసిన పరిస్థితి మళ్లీ రావాలి: సీతారాం 
  • రాజకీయ కేంద్రాలుగా హిందూ ఆలయాలు: మధు


అమరావతి, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): ‘‘పెట్టుబడిదారీ దేశాలతో పాటు మన దేశంలోనూ నిరంకుశ ప్రభుత్వం నడుస్తోంది. దానికి తోడు మతోన్మాద రాజకీయాలు పెరిగాయి. కొవిడ్‌ సంక్షోభం నుంచి కోలుకునేందుకు కేంద్రం తెచ్చిన ఉద్దీపన ప్యాకేజీతో కంపెనీల లాభాలు పెరగడం తప్ప సామాన్యులకు ఒరిగిందేమీ లేదు’’ అని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. సోమవారం సీపీఎం 26వ రాష్ట్ర మహాసభలు తాడేపల్లిలో ప్రారంభమయ్యాయి. పార్టీ రాష్ట్రకార్యదర్శి పి.మధు అధ్యక్షతన ఆరంభమైన సభల్లో ఏచూరి ప్రారంభోపన్యాసం చేశారు. మోదీ ప్రభుత్వ విధానాలు భవిష్యత్తులో చాలా ఇబ్బందులు సృష్టించే అవకాశముందన్నారు. 2019 తర్వాత ఆర్‌ఎ్‌సఎస్‌ ఎజెండా పెద్దఎత్తున అమలు చేస్తున్నారని, మత ఘర్షణలు పెంచి నియంతృత్వ ధోరణి తెచ్చేందుకు యత్నిస్తున్నారన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేవారిపై వేధింపులు పెరిగాయని, చివరకు మీడియా ప్రతినిధులను కూడా వదలడం లేదన్నారు. 


మహిళలు, దళితుల పై దాడులు, దౌర్జన్యాలు పెరిగాయని, దేశ సంపదను, ఆస్తిని ప్రైవేటీకరణ పేరుతో దోచేస్తున్నారన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్రం మోసం చేస్తోందన్నారు. ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కుని ప్రైవేటీకరిస్తున్నారని మండిపడ్డారు. గతంలో ఎన్టీఆర్‌ ఉన్నప్పుడు దేశంలోని ఇతర పార్టీలను ఏకం చేశారని, అలాంటి పరిస్థితి మళ్లీ రావాలన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని గద్దెదించేలా మన కార్యాచరణ ఉండాలన్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై గట్టి పోరాటం చేయాలన్నారు. రైతులు, కార్మికులు, కర్షక వర్గాలను ఐక్యం చేసి పోరాడాలన్నారు. మతోన్మాద శక్తులనుంచి దేశాన్ని కాపాడాలని సీతారాం ఏచూరి పేర్కొన్నారు. ‘‘వైసీపీ, టీడీపీ, జనసేన.. బీజేపీని బలపరుస్తున్నాయి. రాష్ట్ర ప్రయోజనాల కోసం కమ్యూనిస్టులు ఐక్య పోరాటాలు చేయాలి. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా పోరాటా లు చేయలేని స్థితిలో వైసీపీ, టీడీపీ, జనసేన ఉన్నాయి’’ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు. 


వైసీపీ, టీఆర్‌ఎస్‌ ఒక్కటే: తమ్మినేని వీరభద్రం 

‘‘రాష్ట్రాలు వేరయినా తెలుగువారంతా ఒక్కటే. వైసీపీ, టీఆర్‌ఎస్‌ ఒక తానులోని గుడ్డలే’’ అని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌, నీళ్లు తదితర అంశాలపై తగాదాపడే ఇరురాష్ట్రాల సీఎంలు రాత్రిపూట మాత్రం కలిసి విందులు చేసుకుంటున్నారని విమర్శించారు. అంతకుముందు సీనియర్‌ నేత బీఆర్‌ తులసీరావు జెండా ఆవిష్కరణ చేశా రు. సభ అమరవీరులకు నివాళులర్పించింది. సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్‌ కరత్‌, కేంద్ర కమిటీ సభ్యులు పుణ్యవతి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-28T08:36:51+05:30 IST