పూలకెంత? నైవేద్యానికెంత?
ABN , First Publish Date - 2021-10-20T09:07:38+05:30 IST
దేవాలయాల్లో నిత్యం ఎంతమంది భక్తులకు ప్రసాదం పంపిణీ చేస్తున్నారు? దేవుడి అలంకరణకు వాడే పూల ఖర్చు ఎంత? పండుగలు, ఉత్సవాల సమయంలో ఎన్ని టెంట్లు వేస్తున్నారు? ఎన్ని కార్పెట్లు పరుస్తున్నారు?... ఇలా దేనికీ సరైన లెక్కే లేదు.

- ఆలయాల్లో ఆడిట్ లెక్కలు తేల్చండి
- 23లక్షలకు పైగా అభ్యంతరాలు పెండింగ్
- వాటి విలువ రూ.951 కోట్లుగా నిర్ధారణ
- దేవదాయశాఖ ఉన్నతాధికారుల విస్మయం
- పరిష్కరించాలని ఆడిట్ శాఖకు లేఖ
- ఎవరి హయాంలో అభ్యంతరాలొస్తే వారిదే బాధ్యత
- ఆ అధికారులు రిటైరయితే ‘నో డ్యూస్’ ఇవ్వొద్దు
- ‘పెండింగ్’ పరిష్కారానికి ప్రత్యేక ఫార్మాట్
- శాశ్వత పద్దులు రూపొందించాలని ఆదేశం
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
దేవాలయాల్లో నిత్యం ఎంతమంది భక్తులకు ప్రసాదం పంపిణీ చేస్తున్నారు? దేవుడి అలంకరణకు వాడే పూల ఖర్చు ఎంత? పండుగలు, ఉత్సవాల సమయంలో ఎన్ని టెంట్లు వేస్తున్నారు? ఎన్ని కార్పెట్లు పరుస్తున్నారు?... ఇలా దేనికీ సరైన లెక్కే లేదు. ఆలయాల్లోని లెక్కలన్నీ తప్పుల తడకలు. దేవుడికి పెట్టే నైవేద్యం నుంచి గుడి ముందు వేసే పందిరి వరకూ ప్రతి అంశంపైనా అభ్యంతరాలే. అదీ వందలు, వేలల్లో కాదు. ఏకంగా 23లక్షలకు పైగా అభ్యంతరాలు. రాష్ట్రవ్యాప్తంగా దేవదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో ఆడిట్ అభ్యంతరాల లెక్క కళ్లు తిరిగేలా ఉంది. ‘అవి 23లక్షలు కాదేమో. 23 వేలు అయ్యుంటాయి. ఒకసారి మళ్లీ చూడండి’ అని ఇటీవల నిర్వహించిన ఓ సమీక్షలో ఆ శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారే ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘లేదండీ... అవి 23లక్షలే’ అంటూ ఆ శాఖ అధికారులు బదులివ్వడంతో ఉన్నతాధికారులంతా షాక్‌కు గురయ్యారు. దీనిబట్టే దేవుడి పేరుతో నడిచే దేవదాయ శాఖలో లెక్కలు ఎంత డొల్లతనంగా ఉన్నాయనేది అర్థం చేసుకోవచ్చు. ప్రతి ఖర్చుకూ తాత్కాలిక పద్దులు రాసి, వాటి తుది లెక్కలు లేకుండా కాలం వెళ్లదీస్తున్న తంతు ఆ శాఖలో సుదీర్ఘ కాలం నుంచి సాగుతోంది.
ఇప్పటివరకూ 23,56,300 ఆడిట్ అభ్యంతరాలు పెండింగ్‌లో ఉండగా వాటి విలువ రూ.951కోట్లు అని తేలింది. తాజాగా దీనిపై దేవదాయ శాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించారు. మొత్తం ఆడిట్ అభ్యంతరాలకు లెక్క చెప్పాలంటూ ఆలయాల్లోని ఆర్థిక వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగానే రాష్ట్ర ఆడిట్ శాఖకు దేవదాయ కమిషనర్ సోమవారం ఓ లేఖ రాశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పెండింగ్ ఆడిట్ అభ్యంతరాలను పరిష్కరించాలని కోరారు. దీంతో ఎండోమెంట్ అడ్మినిస్ర్టేషన్ ఫండ్, కామన్ గుడ్‌ఫండ్, ఇతర నిధుల విషయంలో అనేక అభ్యంతరాలున్నాయన్న విషయం వెలుగులోకి వచ్చింది.
పట్టించుకోని అసిస్టెంట్ కమిషనర్లు
దేవదాయ శాఖ ఆడిట్ అభ్యంతరాలు చాలాకాలం నుంచి ఉన్నాయి. ముఖ్యంగా ఆలయాల్లో రోజువారీ పూజలు, భక్తులకు అందించే సౌకర్యాలు, ఉత్సవాల సమయాల్లో ఖర్చులు, ఆలయాల జీర్ణోద్ధరణ పనులు అన్నిట్లోనూ ఖర్చుల విషయంలో భారీగా అభ్యంతరాలు పెండింగ్‌లో ఉన్నాయి. పెద్ద ఆలయాలతో పాటు 6(సీ) పరిధిలోకి వచ్చే చిన్న ఆలయాలను కూడా అసిస్టెంట్ కమిషనర్లు పట్టించుకోవడం లేదు. అసలు ఆలయాల్లో ఎంత ఖర్చవుతోంది? నిధులను సక్రమంగా వ్యయం చేశారా? లేదా? అనే విషయంలో వీరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. ప్రసాదాల పంపిణీ విషయంలోనూ ఈవోలు ఇష్టానుసారంగా సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారనే విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో ఇకపై ఎవరి హయాంలో ఆడిట్ అభ్యంతరాలు ఉంటే వారినే బాధ్యులను చేయాలని దేవదాయ శాఖ నిర్ణయించింది. ఆ సమయంలో పనిచేసిన అధికారులు రిటైర్ అయితే వారికి ‘నో డ్యూస్’ సర్టిఫికెట్లు ఇవ్వకూడదని, పెన్షన్లు కూడా తాత్కాలికంగా ఆపేయాలని ఆదేశించింది. పెండింగ్ అభ్యంతరాలను పరిష్కరించేందుకు దేవదాయ శాఖ ప్రత్యేక ఫార్మాట్‌ను కూడా రూపొందించింది. మొత్తం తాత్కాలిక పద్దులను పరిశీలించి శాశ్వత పద్దులు రూపొందించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది.
అధికారుల్లో హడల్
ఈ పరిణామాలతో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న అధికారులు హడలిపోతున్నారు. దేవదాయ శాఖలో ఖర్చుల విషయంలో తొలినుంచీ అనేక విమర్శలున్నాయి. ఎవరి ఇష్టానుసారం వారు ఖర్చులు రాసుకోవడం, వాటికి సరైన లెక్కలు లేకపోవడం, హుండీల లెక్కల్లో వ్యత్యాసాలు, భక్తులకు అందే సౌకర్యాలకు రాసిన పద్దులకు పొంతన లేకపోవడం సర్వసాధారణంగా మారింది. ఇందతా మొదటినుంచీ ఉన్న వ్యవహారం కావడంతో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు ఆ లెక్కలన్నీ తీయాలని ఆదేశించడంతో తేడాలున్న ఆలయాల్లోని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో పక్కదారి పట్టిన నిధుల విషయంలో బాధ్యులైన వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.