దానమా.. ఉదారమా?

ABN , First Publish Date - 2021-08-25T08:47:12+05:30 IST

‘దేశంలో ఎక్కడా లేని విధంగా మన ప్రభుత్వం మానవత్వాన్ని చూపుతూ.. ఒక ప్రైవేటు కంపెనీ మోసం చేసి ఎగ్గొట్టిన సొమ్మును.. బాధ్యత తీసుకుని పేద ప్రజలు నష్టపోకుండా చెల్లిస్తోంది’ అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మంగళవారం చేసిన వ్యాఖ్యలు అధికార వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.

దానమా.. ఉదారమా?

అగ్రి ఆస్తుల వేలంతో ఆ సొమ్ము తిరిగి సర్కారుకు!

సీఎం ‘మానవత్వం’ వ్యాఖ్యలపై అధికార వర్గాల్లో విస్మయం

డిపాజిటర్ల సంఖ్యలో కోత.. 20 వేలలోపు మదుపు చేసినవారు 14 లక్షల మంది

కానీ 10.40 లక్షల మందికే చెల్లింపు.. రూ.1,182 కోట్లు ఇస్తామన్నారు

905 కోట్లతోనే సరిపెట్టారు.. గద్దెనెక్కిన వారంలోనే ఇస్తామన్నారు

111 వారాల తర్వాత చెల్లించారు

పది లక్షల పరిహారం ఊసేదీ?

సర్కారు తీరుపై బాధితుల్లో అసంతృప్తి


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

‘దేశంలో ఎక్కడా లేని విధంగా మన ప్రభుత్వం మానవత్వాన్ని చూపుతూ.. ఒక ప్రైవేటు కంపెనీ మోసం చేసి ఎగ్గొట్టిన సొమ్మును.. బాధ్యత తీసుకుని పేద ప్రజలు నష్టపోకుండా చెల్లిస్తోంది’ అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మంగళవారం చేసిన వ్యాఖ్యలు అధికార వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. రూ.20 వేలలోపు డిపాజిట్‌ చేసిన 7 లక్షల మంది అగ్రిగోల్డ్‌ డిపాజిటర్ల ఖాతాల్లో  రూ.666.84 కోట్లను జమచేస్తూ.. తన ప్రభుత్వం సొంతంగా ఈ నిధులు చెల్లిస్తున్నట్లుగా ఆయన మాట్లాడారు (2019 నవంబరులో 3.40 లక్షల మంది రూ.10 వేల లోపు డిపాజిటర్లకు రూ.238.73 కోట్లు చెల్లించారు. మొత్తం కలిపితే రూ.905.57 కోట్లు). నిజానికి అగ్రిగోల్డ్‌ ఆస్తులను త్వరలో వేలం వేయనున్నారు. ఆ సందర్భంగా వచ్చే మొత్తంలో నుంచి సర్కారు తాను చెల్లించింది మినహాయించుకోనుంది. కానీ వెనక్కి తీసుకోబోయే సొమ్మును ఉదారంగా ఇచ్చినట్లు మభ్యపెట్టేలా మాట్లాడడం విస్మయపరుస్తోంది. అవ్వా సోదరులు 1995లో విజయవాడలో ఏర్పాటు చేసిన అగ్రిగోల్డ్‌ సంస్థ.. కలెక్టివ్‌ ఇన్వె్‌స్టమెంట్‌ స్కీమ్‌ పేరుతో ఏడు రాష్ట్రాల్లోని 32 లక్షల మంది నుంచి రూ.6,700 కోట్ల డిపాజిట్లు సేకరించింది.


రూ.పది నుంచి రూ.లక్ష దాకా పెట్టుబడి పెట్టినవారు ఉన్నారు. డిపాజిట్లపై వడ్డీ, ఫ్లాట్లు, ఇళ్లు, భూములు.. ఇలా ఏదో రూపంలో తిరిగిస్తామని హామీ ఇచ్చి.. కస్టమర్లనే ఏజెంట్లుగా చేసుకుని ఈ సంస్థ దినదినాభివృద్ధి చెందింది. ఆ సొమ్ముతో ఏడు రాష్ట్రాల్లో పవర్‌, టూరిజం, ఇన్‌ఫ్రా, అగ్రికల్చర్‌, సీడ్స్‌, ఫుడ్స్‌ లాంటి వ్యాపారాలు చేసింది. ఈ సంస్థకు ఒక్క మన రాష్ట్రంలోనే 16 వేల ఎకరాల వ్యవసాయ భూములతో పాటు నివాస, వాణిజ్య స్థలాలు ఉన్నాయి. 2014లో చెక్కుల బౌన్స్‌తో పరిస్థితి తారుమారై పోలీసులకు ఫిర్యాదులు అందడంతో సీఐడీ దర్యాప్తు చేసింది. అగ్రిగోల్డ్‌ యజమానులను అరెస్టుచేసింది. వేలాది ఎకరాల స్థిరాస్తులను గుర్తించి జప్తు చేసింది. హైకోర్టు ఆదేశాలతో వీటిని ఎప్పుడు వేలం వేసినా ఇప్పటి వరకూ చెల్లించిన రూ.905 కోట్లనూ రాష్ట్రప్రభుత్వం తీసుకుంటుంది. ఈ విషయాన్ని జగన్‌ పత్రికలో ఇచ్చి ప్రకటనలోనే స్పష్టంగా వెల్లడించారు.  పైగా డిపాజిటర్ల సంఖ్యలోను, ఇస్తానన్న మొత్తంలోను సర్కారు భారీగా కోతపెట్టడం గమనార్హం.


ఉద్యమంతో దిగివచ్చి..

అది 2017 మార్చి 23.. విజయవాడలోని దాసరి భవన్‌.. న్యాయం కోసం అగ్రిగోల్డ్‌ డిపాజిటర్లు నిరాహార దీక్ష చేస్తున్నారు.. అప్పటి ప్రతిపక్ష నేత జగన్‌ అక్కడకు వచ్చారు. అధికారంలోకి వస్తే వారం రోజుల్లో డిపాజిటర్ల డబ్బులు ఇచ్చేస్తానన్నారు. మన ప్రభుత్వమే రాబోతోంది.. ఇక పోరాటం అవసరం లేదంటూ దీక్ష చేస్తున్న వారికి నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. 2019 మే 30న ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన జగన్‌.. వంద వారాలు వేచిచూసినా అగ్రిగోల్డ్‌ బాధితులకు సాయం అందించలేదు. దీంతో 107 వారాల తర్వాత డిపాజిటర్లు, ఏజెంట్లు మరోసారి ఉద్యమించారు. విజయవాడలో ప్రతిపక్ష నేత హోదాలో ఆయన మాటిచ్చిన చోటే ఈ ఏడాది జూలై 24న నిరాహార దీక్షకు దిగారు. ఇచ్చిన మాట మరిచారని విమర్శించారు. ముఖ్యమంత్రికి మెయిల్‌ ద్వారా యాభై వేలకు పైగా వినతులు పంపారు. జూలై 31న ప్రతి నియోజకవర్గానికీ ఇద్దరి చొప్పున 350 మందితో వినతిపత్రం ఇచ్చి తీరతామని ప్రకటించారు. దీంతో ప్రభుత్వం దిగివచ్చింది.


ఆగస్టులో డబ్బులు చెల్లిస్తామని జగన్‌ ప్రకటించారు. ఆ ప్రకారం రూ.20వేల లోపు డిపాజిటర్ల ఖాతాల్లో సొమ్ము జమచేశారు. కానీ వారి సంఖ్యలో కోతపెట్టారు. అగ్రిగోల్డ్‌ డిపాజిటర్లు రాష్ట్రంలో 19 లక్షల మంది ఉన్నట్లు సీఐడీ తేల్చింది. అయితే రూ.20వేల లోపు ఉన్న 14 లక్షల మందికి రూ.1,182 కోట్లను వారం రోజుల్లో చెల్లించి 80 శాతం మందికి ఉపశమనం కల్పిస్తానని జగన్‌ గతంలో మాటిచ్చారు. కానీ విడతల వారీగా 10.40 లక్షల మందికి రూ.905.57 కోట్లు మాత్రమే చెల్లించారు. అంటే 3.60 లక్షల మందికి ఇవ్వలేదు. రూ.277 కోట్లు కోత పెట్టారు. వాస్తవానికి 2019-20 రాష్ట్ర బడ్జెట్‌లో రూ.1,182 కోట్లు ఇందుకు కేటాయించారు. కానీ 2019 అక్టోబరు 25న జీవో ద్వారా మొదటి దశలో పది వేల రూపాయల లోపు డిపాజిటర్లకు రూ.264 కోట్లు విడుదల చేశారు. పోనీ ఇదైనా చెల్లించారా అంటే అదేం లేదు. పాత జాబితాను నిబంధనలతో కుదించి రూ.25 కోట్లు తగ్గించి ఆ ఏడాది నవంబరులో రూ.238.73 కోట్లు ఇచ్చారు. రాష్ట్రంలోని 19 లక్షల మంది డిపాజిటర్లకు సుమారు రూ.4 వేల కోట్లు రావలసి ఉందని.. ఏటా ఇంత చిన్న మొత్తాలిస్తే పదిహేనేళ్లయినా బాధితులకు అందవని డిపాజిటర్ల సంఘం నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. అవేవీ పట్టించుకోని జగన్‌ ప్రభుత్వం.. 2020-21 బడ్జెట్‌లో రూ.200 కోట్లు మాత్రమే కేటాయించింది. కానీ పైసా కూడా విడుదల చేయలేదు. మూడో బడ్జెట్‌లోనూ అంతే మొత్తాన్ని కేటాయించడంతో డిపాజిటర్లు ఉద్యమానికి సిద్ధమయ్యారు. దీంతో ప్రభుత్వం తాజా చెల్లింపులు ప్రకటించింది. 


అధికారంలోకి వస్తే రూ.10 లక్షలిస్తా..

చంద్రబాబు ప్రభుత్వం అగ్రిగోల్డ్‌ డిపాజిటర్లకు రూ.250 కోట్లు చెల్లించేందుకు 2019 ఫిబ్రవరి 25నే పచ్చ జెండా ఊపింది. అలాగే బాధితుల్లో ఆత్మహత్యలకు పాల్పడిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున (102 మందికి) రూ.5 కోట్లకు పైగా పరిహారం ప్రకటించింది. చంద్రబాబు చేతుల మీదుగా చెక్కులు కూడా అందజేసింది. పదివేల లోపు డిపాజిటర్లకు చెల్లించాల్సిన సొమ్ము ఉన్నా జాబితా సిద్ధమయ్యేలోపు మార్చి రెండో వారంలో ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కావడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. అయితే చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల పరిహారం సరిపోదని.. తాను అధికారంలోకి వస్తే పది లక్షలు సాయం చేస్తానని జగన్‌ అప్పట్లో హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు ఆ ఊసే ఎత్తడం లేదు.

Updated Date - 2021-08-25T08:47:12+05:30 IST