‘అసైన్డ్‌’ జీవోకు..కేబినెట్‌ ఆమోదం లేదు!

ABN , First Publish Date - 2021-05-08T08:41:28+05:30 IST

రాజధాని అమరావతి అసైన్డ్‌ భూముల వ్యవహారంపై సీఐడీ హైకోర్టులో కౌంటర్‌ దాఖలు చేసింది. చట్ట నిబంధనలకు విరుద్ధంగా 2016 ఫిబ్రవరిలో జీవో 41 తీసుకొచ్చారని పేర్కొంటూ దర్యాప్తు అధికారి ఎ.లక్ష్మీనారాయణరావు ఈ అఫిడబవిట్‌ దాఖలుచేశారు

‘అసైన్డ్‌’ జీవోకు..కేబినెట్‌ ఆమోదం లేదు!

దురుద్దేశంతోనే తీసుకొచ్చారు.. ఆక్రమణదారులకు అయాచిత లబ్ధి

ఆ ఉత్తర్వులు చట్టవిరుద్ధమని.. కొందరు అధికారుల వాంగ్మూలం

బాబు, నారాయణ పాత్రపై దర్యాప్తు చేయాల్సిన అవసరముంది

మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేయండి.. బాబు వ్యాజ్యంలో సీఐడీ కౌంటర్‌


అమరావతి, మే 7 (ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతి అసైన్డ్‌ భూముల వ్యవహారంపై సీఐడీ హైకోర్టులో కౌంటర్‌ దాఖలు చేసింది. చట్ట నిబంధనలకు విరుద్ధంగా 2016 ఫిబ్రవరిలో జీవో 41 తీసుకొచ్చారని పేర్కొంటూ దర్యాప్తు అధికారి ఎ.లక్ష్మీనారాయణరావు ఈ అఫిడబవిట్‌ దాఖలుచేశారు. సంబంధిత జీవో రాష్ట్ర అసైన్డ్‌ భూముల బదిలీ నిషేధిత చట్టం, ఏపీసీఆర్డీఏ నిబంధనలకు విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విషయంలో ఈ ఏడాది మార్చి 19న ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేయాలని కోరారు. రాజధాని అసైన్డ్‌ భూముల వ్యవహారంలో వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీఐడీ పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ వేర్వేరుగా వ్యాజ్యాలు దాఖలు చేయడం, వాటిపై విచారణ జరిపిన హైకోర్టు.. ఈ కేసులో తదుపరి చర్యలన్నిటినీ నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు సీఐడీ తాజాగా కౌంటర్‌ దాఖలు చేసింది. పేద అసైన్డ్‌ రైతుల భూములు ఆక్రమించేందుకు, తమ వారికి లబ్ధి చేకూర్చేందుకు దురుద్దేశంతో జీవో 41ని తీసుకొచ్చారని తమ విచారణలో తేలినట్లు తెలిపింది. 


‘చట్ట నిబంధనలు ఉల్లంఘించేందుకు జీవోను అస్త్రంగా ఉపయోగించారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగింది. నోట్‌ ఫైల్‌ను పరిశీలిస్తే జీవో జారీకి ముందు గానీ, ఆ తర్వాత గానీ మంత్రిమండలి ముందు పెట్టలేదు. జీవో అమల్లోకి వచ్చాక నాటి ముఖ్యమంత్రి, ఇన్‌చార్జి మంత్రి అప్రూవల్‌ ఇచ్చారు. జీవో జారీకి సంబంధించి కొంత మంది అధికారులను ప్రశ్నించగా.. అది అసైన్డ్‌ భూముల చట్టానికి విరుద్ధంగా ఉందని వాంగ్మూలం ఇచ్చారు.  నిబంధనలకు విరుద్ధంగా పిటిషనర్లు జీవో జారీకి సిఫారసు చేశారు. రాష్ట్ర అసైన్డ్‌ భూముల నిరోధక చట్టం-1977.. భూ బదలాయింపును నిరోధిస్తోంది. ఎమ్మెల్యే ఇచ్చిన ఫిర్యాదును పరిశీలిస్తే.. పిటిషనర్లు పబ్లిక్‌ సర్వెంట్‌ చట్ట నిబంధనలను విస్మరించినట్లు అర్థమవుతోంది. జీవో జారీలో వారి పాత్రపై దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది’ అని పేర్కొంది.


వారు ఆక్రమణదారులు..

రెవెన్యూ రికార్డుల ప్రకారం ఆక్రమణదారులకు అసైన్డ్‌ పట్టాలు లేవని.. నిబంధనల ప్రకారం వారి స్వాధీనంలో ఉన్న భూములు ప్రభుత్వానివేనని సీఐడీ తెలిపింది. ‘ఎలాంటి అసైన్డ్‌ పట్టాలు లేకుండా చాలా ఏళ్లుగా సాగు చేసుకుంటున్నారు. జీవో 41 ప్రకారం అభ్యంతరకర భూమిలో వారు ఆక్రమణ దారుల కిందకు వస్తారు. జీవో 41 ప్రకారం భూసమీకరణ కింద కొందరి భూములు తీసుకుని వారికి వార్షిక  చెల్లింపులు చేశారు. ఆక్రమణదారులకు అయాచిత లబ్ధి చేకూర్చారు. దీనివల్ల సీఆర్డీఏకు నష్టం చేకూరింది. జీవో 41ని ఆధారంగా అసైన్డ్‌ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని, ఎలాంటి ప్రయోజనాలూ కల్పించదని ప్రజల్లో అపోహలు కలిగించారు. తక్కువ ధరకు భూములు కొనుగోలు చేసి భూసమీకరణ పథకానికి ఇచ్చి లబ్ధిపొందారు. సీఆర్డీఏ చట్టంలోని సెక్షన్‌ 146 పిటిషనర్‌ను విచారించకుండా రక్షణ కల్పించలేదు. కేసును కొట్టివేయాలని పిటిషన్‌ దాఖలు చేయడం న్యాయవిచారణ ప్రక్రియను దుర్వినియోగం చేయడమే. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయండి’ అని హైకోర్టును అభ్యర్థించింది.

Updated Date - 2021-05-08T08:41:28+05:30 IST