లోకేశ్‌ కాన్వాయ్‌లో ఉన్న నేతల అరెస్టు

ABN , First Publish Date - 2021-10-21T10:12:30+05:30 IST

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ కాన్వాయ్‌లో ఉన్న పార్టీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు.

లోకేశ్‌ కాన్వాయ్‌లో ఉన్న నేతల అరెస్టు

  • మహిళలని చూడకుండా దుర్భాషలు..
  • తన చీర చింపేశారన్న మహిళా నేత

అమరావతి/గుంటూరు, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ కాన్వాయ్‌లో ఉన్న పార్టీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం, తెలుగు మహిళ నాయకురాళ్లు కంభంపాటి శిరీష, వేగుంట రాణి, ఆశ, వినీల తదితరులు ఉన్నారు. లోకేశ్‌తో కలిసి మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి బయలుదేరారు. ఈ క్రమంలో లోకేశ్‌ కారును వెళ్లనిచ్చిన పోలీసులు, వెనుక ఉన్న వాహనాలను ఉండవల్లి దగ్గర నిలిపివేశారు. ఆ వాహనాల్లో ఉన్న నాదెండ్ల బ్రహ్మం చౌదరి, మహిళా నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఈ దశలో తమపై మేడికొండూరు సీఐ దారుణమైన మాటలతో దూషించారని కన్నీటిపర్యంతమయ్యారు. తమను ఆటోలో కుక్కి, చీరలు చించి ఎక్కడపడితే అక్కడ గిచ్చి ఇబ్బందులకు గురి చేశారని వాపోయారు. కాగా, టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం చౌదరిని పోలీసులు అరెస్టు చేయడాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రంగా ఖండించారు. బ్రహ్మంచౌదరి ఎక్కడున్నాడో ఆచూకీ తెలపకపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. బ్రహ్మం చౌదరికి ఏదైనా జరిగితే.. సీఎం, డీజీపీలదే బాధ్యతని హెచ్చరించారు.  

Updated Date - 2021-10-21T10:12:30+05:30 IST