ఆంధ్రుల హక్కుని కాలరాయడమే..

ABN , First Publish Date - 2021-02-08T09:33:38+05:30 IST

అమరావతి రాజధాని, విశాఖ ఉక్కు.. ఐదు కోట్ల మంది ఆంధ్రుల హక్కు అని రాజధానికి 33వేల ఎకరాలు త్యాగం చేసిన రైతులు స్పష్టం చేశారు.

ఆంధ్రుల హక్కుని కాలరాయడమే..

418వ రోజుకు చేరిన రాజధాని రైతుల ఆందోళనలు

తుళ్లూరు, ఫిబ్రవరి 7: అమరావతి రాజధాని, విశాఖ ఉక్కు.. ఐదు కోట్ల మంది ఆంధ్రుల హక్కు అని రాజధానికి 33వేల ఎకరాలు త్యాగం చేసిన రైతులు స్పష్టం చేశారు. అమరావతిని రాష్ట్ర ఏకైక రాజధానిగా కొనసాగించాలని కోరుతూ వారు చేస్తున్న ఆందోళనలు ఆదివారం 418వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రాజధాని రైతులు మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయడమంటే ఆంధ్రుల హక్కును కాలరాయటమేనన్నారు. ప్రైవేటు సంస్థలకు రాని నష్టం ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న విశాఖ ఉక్కుకు ఎలా వస్తుందని ప్రశ్నించారు. రాజధానికి భూములు త్యాగం చేసిన రైతులను నడిబజారులో నిలబెట్టిన పాలకులకు ఐదు కోట్ల మంది ప్రజలు బుద్ధి చెప్పాలని కోరారు. మూడు రాజధానులతో ప్రయోజనం లేదని తెలిసినా మొండిగా ముందుకు వెళుతున్న సీఎం జగన్‌కు మంచి బుద్ధి ప్రసాదించాలని దేవున్ని వేడుకుంటున్నామని చెప్పారు.


వాటర్‌ ట్యాంక్‌ ఎక్కిన రైతు

అమరావతి అభివృద్ధి కొనసాగాలని కోరుతూ గుంటూరు జిల్లా దొండపాడు గ్రామంలో రాజధానికి భూములిచ్చిన రైతు నన్నపనేని నాగమల్లేశ్వరావు వాటర్‌ ట్యాంకు ఎక్కాడు. అక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించాడు. ఆదివారం ఉదయం జెండా చేతపట్టుకుని వాటర్‌ ట్యాంకు ఎక్కిన నాగమల్లేశ్వరావు జై అమరావతి నినాదాలు చేశాడు. ‘ఆంధ్రుల హక్కు-విశాఖ ఉక్కు’, అమరావతి అభివృద్ధి కొనసాగాలని అన్నాడు. పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు, స్థానికులు నచ్చజెప్పడంతో నాగమల్లేశ్వరావు కిందకి దిగొచ్చాడు.

Updated Date - 2021-02-08T09:33:38+05:30 IST