నామినేషన్‌ వేస్తే ఎర్రచందనం కేసులా?

ABN , First Publish Date - 2021-02-08T09:28:43+05:30 IST

‘‘పంచాయతీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారు.

నామినేషన్‌ వేస్తే  ఎర్రచందనం కేసులా?

‘పంచాయతీ’ల్లో.. ప్రజాస్వామ్యం అపహాస్యం 

పెద్దిరెడ్డి, పిన్నెల్లి హింసా రాజకీయాలు

టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం


అమరావతి, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): ‘‘పంచాయతీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారు. నామినేషన్లు వేసేందుకు ముందుకు వస్తున్నవారిని ఎర్ర చందనం దొంగతనం కేసులు పెడతామని తీవ్రంగా బెదిరిస్తున్నారు. ఇంతకన్నా దారుణం ఉంటుందా? సీఎం జగన్‌ ఫ్యాక్షన్‌ సిద్ధాంతంతో రాజ్యాంగ వ్యవస్థలను అపహాస్యం చేస్తున్నారు’’ అని టీడీపీ అధినేత చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఆదివారం చిత్తూరు జిల్లా పుంగనూరు, గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గాల టీడీపీ నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు.


మాచర్లలో సీఐ భక్తవత్సలరెడ్డి, పుంగనూరులో సీఐ మధుసూదన్‌రెడ్డి, ఎస్‌ఐలు ధరణీధర్‌, లక్ష్మీకాంతంలు వేధిస్తున్నారంటూ ఈ సందర్భంగా పార్టీ నేతలు చంద్రబాబు దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. జగన్‌ ప్రోద్బలంతోనే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిలు రాజ్యాంగ వ్యతిరేక శక్తులుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. హింసా రాజకీయాలకు తెరలేపుతున్నారని మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్‌ వేయడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులకు రక్షణ కల్పించి ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్‌, ఎస్పీ, ఎన్నికల సంఘంపై ఉందన్నారు. 


నామినేషన్లు తీసుకోకుండా అడ్డుపడితే ‘ఈ-మెయిల్‌’ ద్వారా జిల్లా కలెక్టర్‌, ఎన్నికల కమిషన్‌, టీడీపీ కేంద్ర కార్యాలయానికి పంపించాలని సూచించారు. మంత్రిగా ఉండి నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధీ చేయకుండా పంచాయతీ ఎన్నికల్లో పోటీచేయడానికి ముందుకొచ్చిన వారిని పెద్దిరెడ్డి వేధిస్తున్నారని విమర్శించారు. నామినేషన్లు వేస్తే ఎర్రచందనం కేసులు పెడతామని పోలీసులు బెదిరించడం అక్రమాలకు పరాకాష్టగా చంద్రబాబు మండిపడ్డారు. పెద్దిరెడ్డి సొంత మండలంలో జరుగుతున్న దాడులను సాక్ష్యాధారాలతో సహా ఫిర్యాదు చేస్తున్నా పోలీసులు, ఈసీ చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనకాడుతున్నారని ప్రశ్నించారు. ‘‘గ్రామస్వరాజ్యం కంటే జగన్‌ కలలు కన్న ఫ్యాక్షన్‌ సామ్రాజ్యాన్ని స్థాపించేందుకు వైసీపీ నేతలు పనిచేస్తున్నారు. వైసీపీ నేతల రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు ప్రజలు బుద్ధి చెప్పాలి’’ అని పిలుపునిచ్చారు. నామినేషన్లకు సోమవారం చివరి రోజని, మాచర్ల, పుంగనూరుల్లో సజావుగా ఆ ప్రక్రియ జరిగేలా చూడాలని సూచించారు. 24 గంటలు పార్టీ కేంద్ర కార్యాలయం అందుబాటులో ఉంటుందని, ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా తెలియచేయాలన్నారు. గ్రామస్థులందరూ సంఘటితంగా ఉండి రాజ్యాంగమిచ్చిన హక్కులను కాపాడుకోవాలని చంద్రబాబు సూచించారు.

Updated Date - 2021-02-08T09:28:43+05:30 IST