అటెండరునూ ఇవ్వలేదు
ABN , First Publish Date - 2021-08-25T09:25:23+05:30 IST
గ్రూప్-1 ప్రధాన పరీక్ష జవాబుపత్రాలను డిజిటల్ విధానంలో దిద్దించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలలో ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ ) చైర్మన్ పి. ఉదయ్‌భాస్కర్ హైకోర్టులో

ఏపీపీఎస్సీ రాజ్యాంగబద్ధ సంస్థ అయినా, నాకు స్వతంత్రం లేదు
చైర్మన్‌కు చెప్పకుండానే కీలక నిర్ణయాలు
గ్రూప్-1 వ్యాజ్యాల్లో ఉదయభాస్కర్ కౌంటర్
అమరావతి, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి): గ్రూప్-1 ప్రధాన పరీక్ష జవాబుపత్రాలను డిజిటల్ విధానంలో దిద్దించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలలో ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ ) చైర్మన్ పి. ఉదయ్‌భాస్కర్ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. చైర్మన్‌గా తన ఆమోదం లేకుండానే నియమనిబంధలకు విరుద్ధంగా పరిపాలనాపరమైన పనులు నిర్వహించారని ఆ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ‘‘ఏపీపీఎస్సీ చైర్మన్‌గా 2015 నవంబరు 27న బాధ్యతలు స్వీకరించాను. ఈ ఏడాది నవంబరు 26తో నా పదవీకాలం ముగుస్తుంది. ఏపీపీఎస్సీ కార్యదర్శిని నా విధులు అడ్డుకోకుండా, కార్యాలయాన్ని వినియోగించుకునేందుకు వీలుగా ఆదేశాలు ఇవ్వాలని 2019లో హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన మాట వాస్తవమే.
ఏపీపీఎస్సీ రాజ్యాంగబద్ధ సంస్థ. అటువంటి సంస్థకు అధిపతి అయినప్పటికీ స్వతంత్రంగా వ్యవహరించడానికి నన్ను అనుమతివ్వలేదు. చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించడాన్ని అడ్డుకోవద్దని న్యాయస్థానం కార్యదర్శిని ఆదేశించినప్పటికీ... అధికార విధులు నిర్వహించకుండా అన్ని మార్గాల్లో అడ్డంకులు సృష్టించారు. చట్టబద్ధంగా పొందే అటెండర్, పేషీ సిబ్బందిని ఇవ్వాలని కార్యదర్శి, అదనపు కార్యదర్శిని కోరినప్పటికీ వారు నా అభ్యర్థనను నిరాకరించారు. చైర్మన్‌గా తిరిగి నియమించబడినప్పటి నుంచి క్రమం తప్పకుండా కమిషన్ కార్యాలయానికి వస్తున్నా. 2020 జనవరి నుంచి జరుగుతున్న ఏ కమిషన్ అధికారిక సమావేశాలకీ నన్ను ఆహ్వానించలేదు. చైర్మన్‌గా నా ఆమోదం లేకుండానే నియమ నిబంధలకు విరుద్ధంగా అన్ని పరిపాలనా పనులూ జరిగాయి. దీనివల్ల 2020 ఫిబ్రవరి నుంచి గ్రూప్ -1 పరీక్షతోపాటు పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్న సమావేశాలకు చైర్మన్‌గా నేను సారధ్యం వహించలేదు. సమావేశ నిర్వహణ క్రమం, నిబంధనలు ఉల్లంఘిస్తూ 2020 జనవరిలో కమిషన్ సమావేశం ఏర్పాటు చేశారు. ప్రొసీడింగ్స్ ప్రకారం సమావేశం అజెండా, మినిట్స్ సిద్ధం చేయలేదు.
వాటిని అందరికీ పంపలేదు. 2020 డిసెంబరు 14 నుంచి డిసెంబరు20 వరకు నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు ఎగ్జామినర్లను నియమించే విషయంలో నన్ను పక్కన పెట్టేశారు. నా అనుమతి లేకుండానే 2020 ఫిబ్రవరి 25న సమావేశం నిర్వహించారు. దీనివల్ల ఆ సమావేశానికి చట్టబద్ధత లేదు. నిర్వహణ క్రమం ప్రకారం ప్రొసీజర్ రూల్స్‌కు సవరణలు ప్రతిపాదించే అధికారం మాత్రమే కమిషన్‌కు ఉంటుంది. రూల్ 17 మేరకు ఆ ప్రతిపాదనలను చైర్మన్ నేతృత్వంలోని పూర్తిస్థాయి కమిషన్ మాత్రమే ఆమోదించాలి. కమిషన్ ప్రతిపాదనల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రొసీజర్ రూల్స్ సవరణకు జీవో జారీ చేస్తుంది. ఆ సవరణలను గవర్నర్ ప్రకటిస్తూ గెజిట్ జారీ చేస్తారు. అయితే, ఈ ప్రక్రియను అనుసరించనుందున.. సదరు సమావేశంలో కమిషన్ ఆమోదించిన సవరణలకు చట్టపరమైన విలువ ఉండదు. డిజిటల్ మూల్యాంకనం విధానంలో డేటా భధ్రత, సెక్యూరిటీ లాంటి సమస్యలు ఉన్నాయి. డిజిటల్ మూల్యాంకనం విధానం అమలు చేయడానికి ముందు ఆ ప్రక్రియ పై మదింపు చేసేందుకు 2019 నవంబరులో చైర్మన్ నేతృత్వంలో వర్క్ షాప్ ఏర్పాటు చేశాం. వర్క్ షాప్ నిర్వహణకు ప్రభుత్వం రూ.17.25 లక్షలు విడుదల చేస్తూ జీవో ఇచ్చింది. అయితే నా అనుమతి లేకుండానే ఈ కార్యక్రమాన్ని కార్యదర్శి రద్దు చేశారు’’ అని ఉదయ్‌భాస్కర్ పేర్కొన్నారు.