రీ సర్వే ఆర్‌ఎ్‌ఫపీకి న్యాయ కమిషన్‌ ఆమోదం

ABN , First Publish Date - 2021-12-19T08:59:00+05:30 IST

రీ సర్వే ఆర్‌ఎ్‌ఫపీకి న్యాయ కమిషన్‌ ఆమోదం

రీ సర్వే ఆర్‌ఎ్‌ఫపీకి న్యాయ కమిషన్‌ ఆమోదం

బిడ్డర్ల అభ్యంతరాలు తోసివేత

అందరికీ సమాన అవకాశాలున్నాయి

కంపెనీ ఆర్థిక సామర్థ్యమూ ముఖ్యమే

పారదర్శకతకు నష్టమేమీ లేదు

ఇష్టం లేనివాళ్లు టెండర్‌కు రానవసరం లేదు

స్పష్టం చేసిన న్యాయ కమిషన్‌ చైర్మన్‌


అమరావతి, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో తొమ్మిది జిల్లాల పరిధిలో  సర్వేశాఖ సమర్పించిన ‘డ్రోన్‌ సర్వే’ టెండర్‌ డాక్యుమెంట్‌కు న్యాయ కమిషన్‌ సూత్రబద్ధంగా ఆమోదం తెలిపింది. ఆర్‌ఎ్‌ఫపీ(రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రాజెక్ట్‌)కి ఒకే ఒక సవరణను సూచించింది. ఆమేరకు సరిచేసి తిరిగి తమకు సమర్పించి ఆమోదం పొందాలని కమిషన్‌ చైౖర్మన్‌ జస్టిస్‌ బి.శివశంకర్‌రావు ఆదేశాలిచ్చారు. న్యాయపరమైన చిక్కులు తొలగడంతో ఈనెల 1న పిలిచిన టెండర్‌ డాక్యుమెంట్‌లో స్వల్ప మార్పులు చేసి మళ్లీ టెండర్లను నిర్వహించనున్నారు. తొలి దశలో 10 వేల చదరపు కిలోమీటర్ల లోపు విస్తీర్ణం ఉన్న రెవెన్యూ డివిజన్‌లను ఎంపిక చేసి 9 ప్యాకేజీలుగా విభజించి టెండర్లు నిర్వహిస్తారు. ఈ ప్రక్రియ ముగిశాక మిగతా 4 జిల్లాల పరిధిలో రెవెన్యూ డివిజన్‌లకు కూడా టెండర్లు పిలవనున్నట్లు న్యాయకమిషన్‌కు సర్వేశాఖ నివేదించింది. ఇదిలా ఉంటే, ఈనెల 1న న్యాయకమిషన్‌ పరిశీలన కోసం పంపించిన టెండర్‌ డాక్యుమెంట్‌పై బిడ్డర్‌లు, ఔత్సాహిక కంపెనీలు అనేక అభ్యంతరాలు లేవనెత్తాయి. అనేక సూచనలు, విన్నపాలు చేశాయి. 


పెద్దల కోసమే టెండర్‌ రూల్స్‌ రూపొందించారా? 

రీ సర్వే టెండర్‌ డాక్యుమెంట్‌పై అనేక ఫిర్యాదులు, అభ్యంతరాలు వచ్చాయి. ‘రాష్ట్ర ప్రభుత్వం అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తామని చెబుతోంది... కానీ సర్వే శాఖ మాత్రం పెద్ద కంపెనీల ప్రతినిధుల కోసమే బిడ్‌ను డిజైన్‌ చేసినట్లుగా ఉంది. పోటీలో నెగ్గిన బిడ్డర్‌ పనిచేస్తారా? లేదా? అన్నది చూసుకోవాలి గానీ వారి ఆర్థిక పరిస్థితి గురించి సర్వే శాఖకు ఎందుకు?’’ అంటూ పలువురు అభ్యంతరాలు లేవనెత్తారు. టెండర్‌ మేరకు పనులు పూర్తిచేయడానికి అనేక షరతులను పెట్టిన సర్వేశాఖ తమకు చెల్లించే బిల్లుల విషయంలోనూ స్పష్టత ఇవ్వాలని, పనిపూర్తయిన 45 రోజుల్లోనే బిల్లులు అందించాలని, లేనిపక్షంలో వడ్డీతో సహా చెల్లించాలని కోరారు. ‘‘రీసర్వే అనేది రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమం. కానీ స్వమిత్వ అనేది కేంద్ర కార్యక్రమం. రెండింటినీ ఒకే డాక్యుమెంట్‌లో ఎలా చేరుస్తారు? సమస్యలొస్తే ఎవరు తీరుస్తారు?’’అంటూ కొందరు బిడ్డర్లు ప్రశ్నించారు. 


అభ్యంతరాల తిరస్కరణ

మధ్యరకం వర్క్‌స్టేషన్ల రామ్‌ కెపాసిటీ 256 జీబీ ఉండాలన్న ఆర్‌ఎ్‌ఫపీ క్లాజుపై వచ్చిన అనేకానేక అభ్యంతరాలపై సర్వేశాఖ తగ్గింది. 128 జీబీ రామ్‌ ఉంటే ఒకే అని చెప్పింది. ఇందుకు న్యాయకమిషన్‌ ఆమోదం తెలిపింది. కాగా, డ్రోన్‌ పైలెట్లు, శిక్షణ, ఈఎండీ, బిడ్డింగ్‌ డాక్యుమెంట్‌ ఫీజులు తగ్గించాలన్న విజ్ఞప్తులు, టెండర్‌ కండిషన్‌లు మార్చాలన్న అభ్యంతరాలను అటు సర్వేశాఖ, ఇటు న్యాయ కమిషన్‌ తిరస్కరించాయి. అర్హత ఉన్న వారందరికీ సమాన అవకాశాలు ఉన్నాయనీ, సాంకేతిక అంశంతో పాటు బిడ్డర్‌ ఆర్థిక సామర్థ్యమూ ముఖ్యమేనని, దీని వల్ల పారదర్శకతకు వచ్చిన నష్టం లేదని, ఇష్టం లేని వాళ్లు టెండర్లలో పాల్గొనాల్సిన అవసరం లేదని కమిషన్‌ స్పష్టం చేసింది.

Updated Date - 2021-12-19T08:59:00+05:30 IST