ఏపీలో పోలీసు సంస్కరణలు చేపట్టాలి: కేశినేని

ABN , First Publish Date - 2021-12-07T08:26:40+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు సంస్కరణలు చేపట్టాలని టీడీపీ ఎంపీ కేశినేని నాని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ...

ఏపీలో పోలీసు సంస్కరణలు చేపట్టాలి: కేశినేని


న్యూఢిల్లీ, విజయవాడ, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు సంస్కరణలు చేపట్టాలని టీడీపీ ఎంపీ కేశినేని నాని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడటంలో పోలీసు వ్యవస్థ పట్టు కోల్పోతోందనేందుకు మాదక ద్రవ్యాల ముప్పు, పెరుగుతున్న గుండాయిజమే నిదర్శనమని తెలిపారు. సోమవారం లోక్‌సభ జీరో అవర్‌లో ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తుంటే రాష్ట్ర పోలీసుల సంక్షేమం ఆందోళనకరంగా ఉందన్నారు.  పోలీసింగ్‌ ఇన్‌ ఇండియా నివేదిక ప్రకారం సగటున పోలీసులు రోజుకు 16 గంటలు పనిచేస్తున్నారని, మోడల్‌ పోలీసు చట్టం ప్రకారం నిర్దేశించిన 8 గంటల పనిని కేవలం 8 శాతం మంది పోలీసులు మాత్రమే చేస్తున్నారని వివరించారు. అదనపు పనిభారం వల్ల రాష్ట్రంలో 78 శాతం పోలీసులు మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. అలాగే, పోలీసుశాఖలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించినా, రాష్ట్రంలోని పోలీసు బలగాలలో మహిళలు 6 శాతం మాత్రమే ఉన్నారని తెలిపారు. పోలీసుశాఖలో తగినంత ఆధునికీకరణ లేకపోవడం, ప్రస్తుతం ఖాళీగా ఉన్న 14 వేల పోస్టులను భర్తీ చేయకపోవడమే ఈ సమస్యలన్నింటికీ మూలమని వివరించారు. ఈ విషయాలన్నింటినీ పరిశీలించి ప్రాధాన్య క్రమంలో అవసరమైన సంస్కరణలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో పోలీసుశాఖలో ఉన్న 14 వేల ఖాళీలను భర్తీ చేయాలన్నారు. పోలీసు వ్యవస్థను సంస్కరించి, ఆధునికీకరించడంలో సహాయపడేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా వారితో సంప్రదింపుల ప్రక్రియను ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2021-12-07T08:26:40+05:30 IST