జైలు నుంచి రిమ్స్‌కు దేవిరెడ్డి శంకర్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-12-07T08:00:03+05:30 IST

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో అరెస్ట్‌ అయిన వైసీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శంకర్‌రెడ్డిని.....

జైలు నుంచి రిమ్స్‌కు దేవిరెడ్డి శంకర్‌రెడ్డి

 కోర్టు అనుమతి లేకుండానే తరలింపు

 జైలు సూపరింటెండెంట్‌కు నోటీసులు

కడప, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో అరెస్ట్‌ అయిన వైసీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శంకర్‌రెడ్డిని కోర్టు అనుమతి లేకుండా రిమ్స్‌కు తరలించడంపై పులివెందుల కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో జైలు అధికారులు కోర్టుకు హాజరై సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. వివేకా హత్య కేసులో శంకర్‌రెడ్డిని నవంబరు 17న హైదరాబాద్‌లో అరెస్టు చేసి 18న పులివెందుల కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్‌కు ఆదేశించారు. కోర్టు అనుమతితో అదే నెల 26వ తేదీన శంకర్‌రెడ్డిని సీబీఐ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. విచారించి కస్టడీ సమయం మరో 4రోజులు ఉండగానే తిరిగి కోర్టులో హాజరుపరిచారు. అక్కడి నుంచి సెంట్రల్‌ జైలుకు రిమాండ్‌కు పంపించారు. అయితే ఆర్థోపెడిక్‌ సమస్య అంటూ శంకర్‌రెడ్డిని మూడు రోజుల క్రితం వైద్యం కోసం జైలు అధికారులు కడప రిమ్స్‌కు తరలించారు. ఈ విషయాన్ని పులివెందుల కోర్టు దృష్టికి తీసుకెళ్లలేదు. దీనిపై జడ్జి నోటీసులు జారీ చేయడంతో సోమవారం జైలు సూపరింటెండెంట్‌ కోర్టుకు హాజరై సంజాయిషీ ఇచ్చుకున్నట్లు సమాచారం. దీనిపై జైలు అధికారులను ప్రశ్నించగా, ఆర్థోపెడిక్‌ సమస్య వల్ల రిమాండ్‌లో ఉన్న శంకర్‌రెడ్డిని రిమ్స్‌కు తరలించిన మాట నిజమేనని, ఆ విషయాన్ని కోర్టుకు తెలపడంలో ఆలస్యమైందని వివరించారు. 

Updated Date - 2021-12-07T08:00:03+05:30 IST