సరిగ్గా పనిచేయకపోతే చీరేస్తా.. !

ABN , First Publish Date - 2021-12-07T07:56:58+05:30 IST

తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి ఎంపీడీవో కేఆర్‌ విజయపై వైసీపీకి చెందిన మాజీ సర్పంచ్‌ వ్యక్తిగత దూషణలకు...

సరిగ్గా పనిచేయకపోతే చీరేస్తా.. !

 ఎంపీడీవోపై వైసీపీ నేత చిందులు

 ప్రొటోకాల్‌ పేరిట జడ్పీటీసీ వేధింపులు

అమలాపురం, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి ఎంపీడీవో కేఆర్‌ విజయపై వైసీపీకి చెందిన మాజీ సర్పంచ్‌  వ్యక్తిగత దూషణలకు దిగారు. సోమవారం ఎంపీడీవో చాంబర్‌లో ఉన్న విజయ వద్ద వెళ్లిన నేదునూరు పెదపాలెం మాజీ సర్పంచ్‌, వైసీపీ నేత వాసంశెట్టి తాతాజీ ఆమెను తీవ్ర పదజాలంతో దూషించారు. ’మేమూ వైసీపీ నాయకులమే. మా పార్టీ ఎమ్మెల్యే తరఫున ఒకవర్గం వారు చెప్పిన పనులే చేస్తారా? మేం చెప్పిన పనులు చేయరా?’ అని ప్రశ్నించారు. అయితే తనకు వర్గాలతో పనిలేదని, ఎంపీడీవోగా నచ్చకపోతే పంపించేయండి అని విజయ బదులివ్వగా.. తాతాజీ ఒక్కసారిగా ఆగ్రహించారు. మహిళా అధికారి అని కూడా చూడకుండా.. విధుల్లో సరిగ్గా పనిచేయకపోతే చీరేస్తానంటూ బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. దీంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురై ఎంపీడీవో సంఘ నాయకులతో కలసి అమలాపురం ఆర్డీవో వసంతరాయుడుకు ఫిర్యాదు చేశారు. వైసీపీ నాయకుల నుంచి తనకు ప్రాణరక్షణ కల్పించాలని కోరుతూ స్థానిక పోలీ్‌సస్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేసినట్టు ఆమె విలేకరులకు తెలిపారు. వైసీపీలోని ఓ వర్గానికి చెందినవారు తనను వేధిస్తున్నట్లు చెప్పారు. అయినవిల్లి జడ్పీటీసీ గన్నవరపు శ్రీనివాస్‌ ఫ్రొటోకాల్‌ పేరిట తనకు సంబంఽధం లేనప్పటికీ వేధిస్తున్నారని, సోమవారం మరో నాయకుడు తాతాజీ చీరేస్తానంటూ తనను బెదిరించారని వాపోయారు. ఎంపీడీవోపై జరిగిన దూషణల దాడిని నిరసిస్తూ మంగళవారం జిల్లావ్యాప్తంగా ఎంపీడీవోలంతా నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యేందుకు తీర్మానించినట్టు జిల్లా సంఘ అధ్యక్షుడు పి.నారాయణమూర్తి, కేసీహెచ్‌ అప్పారావు తెలిపారు. 

Updated Date - 2021-12-07T07:56:58+05:30 IST