బాబుకు జరిగిన అవమానాన్ని ఖండిస్తున్న

ABN , First Publish Date - 2021-11-21T08:01:14+05:30 IST

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కన్నీరు పెట్టుకోవడం చూసి విలువలు పాటించే చాలామంది నాయకులకు ఇబ్బందిగా అనిపించిందని./..

బాబుకు జరిగిన అవమానాన్ని ఖండిస్తున్న

జగన్‌నో, కొడాలినో దూషిస్తే ఎలా ఉంటుంది? 

ఇలా వ్యక్తిగత దూషణలు తెలంగాణ సభలో లేవు

బాబు కన్నీరు ఇబ్బందిగా అనిపించింది: జగ్గారెడ్డి


హైదరాబాద్‌, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కన్నీరు పెట్టుకోవడం చూసి విలువలు పాటించే చాలామంది నాయకులకు ఇబ్బందిగా అనిపించిందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబుపై వ్యక్తిగత దూషణలు చేయడం సరికాదన్నారు. వైఎస్‌ జగన్‌ టీం.. చంద్రబాబుకు చేసిన అవమానాన్ని ఖండిస్తున్నానని పేర్కొన్నారు. తెలంగాణ శాసనసభలో సీఎం కేసీఆర్‌ తమ గొంతు నొక్కేస్తున్నా.. ఏపీ తరహాలో వ్యక్తిగత దూషణలు ఉండవని చెప్పారు. రాజకీయాల్లో కుట్రలు, కుతంత్రాలు ఉంటాయి కానీ.. వయసు రీత్యా అయినా చంద్రబాబుకు గౌరవం ఇవ్వాల్సి ఉండేదన్నారు.


చంద్రబాబును ఏమని దూషించారన్నది చెప్పలేము కానీ.. అదే దూషణ జగన్‌నో, ఏపీ మంత్రి కొడాలి నానినో అంటే ఎలా ఉంటుందో ఆలోచన చేయాలన్నారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని, కాంగ్రెస్‌ కు సంబంధం లేదన్నారు. శనివారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేత భార్య, కుటుంబంపై దూషణలు చేస్తుంటే ఆపకుండా చూస్తున్న తమ్మినేని సీతారాంకు స్పీకర్‌గా కొనసాగే అర్హత లేదన్నారు. చంద్రబాబును కొడాలి నాని తిట్టే తిట్లు టీవీ చానళ్లలో వస్తుంటే.. వినలేక టీవీ బంద్‌ చేయాలంటూ చాలాసార్లు తన కుటుంబ సభ్యులకు చెప్పానని తెలిపారు. వైసీపీ ఎమ్మెల్యే రోజా కూడా ఎక్కువ మాట్లాడుతున్నారన్నారు. ఉమ్మడి ఏపీలో రెండు ప్రాంతాల వాళ్లం కలిసి పనిచేసేవాళ్లమని, ప్రతిపక్ష సభ్యులు సమస్యలు లేవనెత్తితే హుందాతనంతో సమాధానం చెప్పేవారన్నారు. ఓసారి చంద్రబాబును వైఎ్‌సఆర్‌ ఒక మాట అంటే.. రికార్డుల నుంచి ఆ మాటను తొలగించాలంటూ మళ్లీ వైఎ్‌సఆరే చెప్పారని గుర్తు చేశారు. 


బాబు గెలిస్తే.. జగన్‌ పరిస్థితి ఏంటి?

చంద్రబాబును వైసీపీ ఎమ్మెల్యేలు తిట్టేటప్పుడు వైఎస్‌ జగన్‌ నవ్వే నవ్వు దేనికి సంకేతమని జగ్గారెడ్డి ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబును గెలిపిస్తే జగన్‌ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. చంద్రబాబు తనను గుర్తు పట్టేంత పరిచయం కూడా ఆయనతో తనకు లేదన్నారు. కానీ ఓ సీనియర్‌ నాయకుడిని అలా అవమానించడం సరికాదన్నారు. ‘‘వైఎస్‌ జగన్‌ ఇవాళ సీఎం.. తోపు కావచ్చు.. ఇలానే పాలన కొనసాగిస్తే ఆయనకు రివర్స్‌ తప్పదన్నారు. కుటుంబ సభ్యులపై విమర్శలు వస్తే ఎవరూ కంట్రోల్‌ చేసుకోలేరని ఆయన అన్నారు. 

ఆంధ్రా రాజకీయాలు ప్రశాంతంగా ఉండాలి

తనకూ ఏపీతో అనుబంధం ఉంది కాబట్టి మాట్లాడుతున్నానని జగ్గారెడ్డి అన్నారు. పేర్ని నాని కూడా చంద్రబాబుపై ఎన్నో విమర్శలు చేస్తుంటారని, కానీ విధాన పరమైన విమర్శలే ఆయన చేస్తుంటారని.. పద్ధతంటే అదని అన్నారు.  ఇప్పటికైనా వైఎస్‌ జగన్‌ చొరవ తీసుకొని పగలు, ప్రతీకారాల దాకా వెళ్లకుండా ఆంధ్రా రాజకీయాలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని పేర్కొన్నారు. బాబు హయాంలో రోజాను వ్యక్తిగతంగా అని ఉంటే అదీ తప్పేనన్నారు. ‘‘ఇప్పుడు నేను మర్యాదగా మాట్లాడుతున్న. నామీద మీరు ఏదైనా మాట్లాడినా, తేడాగా స్పందించినా.. మీ అందరి గురించి నాకు తెలుసు’’ అని జగ్గారెడ్డి హెచ్చరించారు. 

Updated Date - 2021-11-21T08:01:14+05:30 IST