కూలిన మూడంతస్తుల భవనం

ABN , First Publish Date - 2021-11-21T07:32:53+05:30 IST

అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో శనివారం అర్ధరాత్రి మూడంతస్తుల భవనం కూలి, పక్కనే ఉన్న రెండు ఇళ్లపై పడింది...

కూలిన మూడంతస్తుల భవనం

రెండు ఇళ్లపై పడి.. ఆరుగురి దుర్మరణం

కదిరి, నవంబరు 20: అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో శనివారం అర్ధరాత్రి మూడంతస్తుల భవనం కూలి, పక్కనే ఉన్న రెండు ఇళ్లపై పడింది. ప్రమాదంలో మొత్తంగా ఆరుగురు మృతి చెందగా.. 9 మంది ప్రాణాలతో బయటపడ్డారు. చనిపోయిన వారిలో సైదున్నీషా (2), పరున్నీషా (8 నెలలు), భాను (30), యాషికా (3), ఫాతిమాబీ (65), ఫైరోజా (65) ఉన్నారు. పోలీసుల కథనం ప్రకారం.. జిలాన్‌ అనే వ్యక్తి పాత చైర్మన్‌ వీధిలో మూడంతస్తుల భవనం నిర్మిస్తున్నాడు. ఇందులో గ్రౌండ్‌ఫ్లోర్‌ 20 ఏళ్ల క్రితం నిర్మించాడు. అది మట్టితో కట్టినట్లు తెలిసింది. దానిపై మరో రెండు అంతస్తులు వేశారు. వాటిపైన ప్రస్తుతం మరో గది నిర్మిస్తున్నారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఈ భవనం కుప్పకూలింది. జిలాన్‌ తల్లి ఫైరోజా, ఓ చానల్‌ విలేకరి భార్య భాను, కూతురు యాషికా, అత్త ఫాతిమాబీ చనిపోయారు. శిథిలాల్లో మరో 9 మంది చిక్కుకుపోగా, అందులో ఉదయ్‌నాయక్‌ అనే వ్యక్తి 100కు డయల్‌ చేయడంతో పోలీసులు వచ్చి శిథిలాలను తొలగించారు. మరో భవనంలో కరీముల్లాతో పాటు ఆయన ఇద్దరు కుమారులు, కోడలు, ఇద్దరు మనమరాళ్లు ఉన్నారు. వారందరినీ పోలీసులు రక్షించి బయటకు తీసుకొచ్చారు. అదే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు సైదున్నీషా, పరున్నీషా మృతిచెందారు.  ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, స్థానిక పోలీసులు 12 గంటలు కష్టపడి శిథిలాల్లో చిక్కుకున్న వారిని బయటకు తీశారు

Updated Date - 2021-11-21T07:32:53+05:30 IST