ఊపిరి ఆగిన ఉపాధి
ABN , First Publish Date - 2021-11-21T07:13:06+05:30 IST
ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధి హామీ పథకం పనులకు నీళ్లొదిలేయడమేనా? కేంద్రం ఇచ్చిన బడ్జెట్‌కు మించి ఇప్పటికే వ్యయం పూర్తికావడం..

ఆర్థిక సంవత్సరంలో మిగిలిన కాలానికి
ఉపాధి హామీ పథకం పనులు లేనట్లే!
గత ఏడాది కంటే
39.5% పనులు తక్కువ
బడ్జెట్‌కు మించి
ఇప్పటికే ఉపాధిపై ఖర్చు
కూలీలకు వేతన
బకాయిలు 801.50 కోట్లు
బయటపెట్టిన
లిబ్‌టెక్ ఇండియా సర్వే
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధి హామీ పథకం పనులకు నీళ్లొదిలేయడమేనా? కేంద్రం ఇచ్చిన బడ్జెట్‌కు మించి ఇప్పటికే వ్యయం పూర్తికావడం, మిగిలిన ఆర్థిక సంవత్సరంలో కొత్తగా నిధులు విడుదలయ్యే అవకాశం లేకపోవడంతో ఉపాధి హామీ వర్గాల్లోనే రేగుతున్న సందేహం ఇది. ఈ ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన లేబర్ బడ్జెట్ మొదటి ఏడు నెలల్లోనే పూర్తి కాగా... అదనంగా కేంద్రం నిధులు కేటాయించే పరిస్థితి కనిపించడం లేదు. వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు కూలీలకు పనులు కల్పించే పరిస్థితి ఉండకపోవచ్చని ఈ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంతేకాకుండా గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది 39.5 శాతం తక్కువగానే పనులు చేపట్టినట్లు లిబ్‌టెక్ ఇండియా అనే సంస్థ చేసిన సర్వేలో వెలికివచ్చింది.
ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబరు 15 వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధి హామీ పథకం ద్వారా చేసిన వ్యయానికి సంబంధించి సమగ్రంగా సర్వే చేసి ఓ రిపోర్టును ఈ సంస్థ తయారుచేసింది. ఆ నివేదికను అనుసరించి.. రాష్ట్రంలో 2020-21 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.10,365.50 కోట్ల నిధులను ఉపాధి హామీ పనులపై ఖర్చు చేశారు. అయితే, 2021-22లో రాష్ట్రానికి కేంద్రం నిధులు తగ్గించింది. రూ.6,271.70 కోట్లు మాత్రమే కేటాయించింది. అయితే మన రాష్ట్ర అధికారులు ఈ ఏడాదికి కేటాయించిన బడ్జెట్‌కు మించి మొత్తం రూ.7,379 కోట్లు ఖర్చు చేశారు. అంటే కేటాయించిన బడ్జెట్ ఇప్పటికే పూర్తయింది. ఇక ఈ ఆర్థిక సంవత్సరంలో నాలుగన్నర నెలలు మిగిలిఉంది. ఈ కాలంలో పనులు చేసినా నిధులు వచ్చే పరిస్థితి లేదు. కేటాయించిన రూ.6,271.70 కోట్లకు గాను కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ.4,571.20 కోట్లు మాత్రమే విడుదల చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం రూ.5769.20 కోట్లు ఖర్చు చేయగా, గత ఏడాది బకాయిలు రూ.1610.70 కోట్లుతో కలిపి రూ.7379.90 కోట్లు విలువ కలిగిన పనులు చేయడంతో... ఇంకా రూ.2808.90 కోట్లు విలువైన పనులకు చెల్లింపులు జరపాల్సి ఉంది. వచ్చే నాలుగున్నర నెలల్లో గత ఏడాది మాదిరిగా పనులు చేపట్టాలంటే.... అదనంగా రూ.1782.09 కోట్లు రాష్ట్రానికి కేటాయించాలి. ఉపాధి హామీ చట్టం ప్రకారం ఒక్కో కుటుంబానికి 100 రోజుల పనిదినాలు కల్పించాలంటే వేతనాలు, మెటీరియల్, నిర్వహణ వ్యయ నిధులతో కలిపి రాష్ట్రానికి రూ.9,203 కోట్లు అవసరమని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఖజానా ఖాళీ కావడం, కేంద్రం నుంచి నిధులొచ్చే పరిస్థితి లేకపోవడంతో రానున్న కాలంలో పనులు చేసినా ఉపాధిలో వేతనాలు విడుదలయ్యే వీలు లేదంటున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో కూలీలు చేసిన పనులకు ఇంకా రూ.801.50 కోట్ల వేతన బకాయిలున్నాయి. అవి ఇప్పట్లో విడుదల అయ్యే అవకాశం కనబడటం లేదు.
వేతనాలకు రూ.4,773.50 కోట్లు...
వేతనాల కోసం రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.4773.50 కోట్లు ప్రభుత్వం ఖర్చు చే సింది. మెటీరియల్ నిధులు రూ.947.20 కోట్లు, పరిపాలనా వ్యయం రూ.48.50 కోట్లు దీనికి అ దనం. ఇక...గత ఏడాదికి సంబంధించి రూ. 1,610.70 కోట్లు బకాయిలు రాష్ట్రానికి రావాల్సి ఉంది. వెరసి మొత్తం రూ.7379.90 కోట్లు రాష్ట్రానికి రావాల్సి ఉంది. అయితే రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్‌లో రూ.6271.80 కోట్లు మాత్రమే కేటాయించి.. అందులో రూ.4571.20 కోట్లు చేసింది. ఇలా లోటుపడిన నిధులు కేంద్రం విడుదల అయితేనే రాష్ట్రంలో పనులు చేసిన వారి బకాయిలు చెల్లించే పరిస్థితులుంటాయి.