ఆర్థిక ఉగ్రవాదానికి ఆజ్యం పోస్తోంది

ABN , First Publish Date - 2021-10-31T09:44:40+05:30 IST

ఆర్థిక ఉగ్రవాదానికి ఆజ్యం పోస్తోంది

ఆర్థిక ఉగ్రవాదానికి ఆజ్యం పోస్తోంది

కార్పొరేట్లు దేశాన్ని శాసించే స్థాయికి చేరారు

సంపదను కొందరి వద్దే కేంద్రీకృతం చేసే ప్రయత్నం: మేధా పాట్కర్‌


గాజువాక (విశాఖపట్నం), అక్టోబరు 30: ‘‘దేశ సంపదను కొందరి చేతుల్లో కేంద్రీకృతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం యత్నిస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడంతో కార్పొరేట్‌ వ్యవస్థలు దేశ ఆర్థిక వ్యవస్థను శాసించే స్థితికి చేరాయి. కార్పొరేట్లను ప్రోత్సహించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ఉగ్రవాదానికి ఆజ్యం పోస్తోంది’’ అని జాతీయ ప్రజా ఉద్యమాల వేదిక ప్రతినిధి, పర్యావరణ ఉద్యమకారిణి మేధా పట్కర్‌ అన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఐఎ్‌ఫటీయూ, ఏఐకేఎంఎస్‌, పీవోడబ్ల్యూ, పీడీఎ్‌సయూ, ఎంఎన్‌ఎ్‌సఎస్‌, అరుణోదయ... ప్రజా సంఘాలు సంయుక్తంగా శనివారంనిర్వహించిన బహిరంగ సభలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేధాపట్కర్‌ మాట్లాడారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను పోస్కో, అదానీ, అంబానీ వంటి సంస్థలకు విక్రయించాలని ప్రభుత్వం చూస్తే రాష్ట్రంలోని కార్మిక వర్గం తిరుగుబాటు చేస్తుందని హెచ్చరించారు. దేశ సంపదను కాపాడుకునేందుకు ప్రజలంతా సంఘటితంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. టెలికాం, రైల్వే వంటి సంస్థల ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తున్నారని, ఇలా ఒక్కొక్కటిగా ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముకుంటూపోతే దేశ ఆర్థిక వ్యవస్థ సమతుల్యత దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. పారిశ్రామికీకరణకు ఎవరూ వ్యతిరేకం కాదన్నారు. ప్రభుత్వ రంగంలో పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారానే ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసుకోవడంతో పాటు ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కల్పించవచ్చునని మేధా పట్కర్‌ స్పష్టం చేశారు. భారీ పరిశ్రమలను ప్రైవేటీకరించడం వల్ల ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయని, రిజర్వేషన్‌లు తొలగిపోయి సమాజంలో అసమానతలు తలెత్తుతాయని వివరించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ద్వారా ప్రస్తుతం ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు రెండు లక్షల మంది ఉపాధి పొందుతున్నారన్నారు. ప్రైవేటీకరణను ఎదుర్కొనేందుకు రాష్ట్ర స్థాయిలో బలమైన ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలని మేధా పట్కర్‌ పిలుపునిచ్చారు. ప్రభుత్వ రంగ సంస్థలను దశల వారీగా అమ్మాలని కేంద్ర ప్రభుత్వం ఎజెండాగా పెట్టుకుందని ఐఎ్‌ఫటీయూ జాతీయ అధ్యక్షురాలు అపర్ణ ఆరోపించారు. ఐఎ్‌ఫటీయూ రాష్ట్ర అధ్యక్షుడు పి.ప్రసాద్‌ కార్యక్రమానికి అధ్యక్షత వహించి మాట్లాడారు. గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, ఏఐకేఎంఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఇండ్ల ప్రభాకర్‌, పీవోడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.లక్ష్మి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్టీల్‌ప్లాంట్‌ కోసం ప్రాణత్యాగం చేసిన 32 మంది అమరవీరులకు స్మత్యాంజలి ఘటిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. సభకు ముందు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిరసిస్తూ గాజువాకలో భారీ ప్రజా ప్రదర్శన జరిగింది. 

Updated Date - 2021-10-31T09:44:40+05:30 IST