మరుగుదొడ్డికి పన్నా.. సిగ్గుండాలి!

ABN , First Publish Date - 2021-10-31T09:01:14+05:30 IST

మరుగుదొడ్డికి పన్నా.. సిగ్గుండాలి!

మరుగుదొడ్డికి పన్నా.. సిగ్గుండాలి!

పన్ను వేసిన జగన్‌ను పిలిచి మరుగుదొడ్లను కడగమని చెప్పండి

జగన్‌ తుగ్లక్‌ కాదు.. పెద్ద జగ్లక్‌

మా టైంలో అభివృద్ధి.. నేడు దోపిడీ

ఎంతోమంది రౌడీలను అణిచేశా

ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం

కుప్పంలో ముగిసిన 2 రోజుల పర్యటన

రోడ్‌షో.. రైతులకు పరామర్శ

పొలాల్లోకి వెళ్లి ధాన్యం పరిశీలన

టీడీపీ నేతలు, ప్రజల నుంచి విశేష స్పందన


‘‘ఒకప్పుడు తుగ్లక్‌ ఉండేవాడట. అతని ఆగడాల గురించి పుస్తకాల్లో చదివే ఉంటారు. ఇప్పటి కాలంలో ‘జగన్‌ తుగ్లక్‌’ ఉన్నాడు. ఆయన్ను తుగ్లక్‌ అనడం కంటే పెద్ద ‘జగ్లక్‌’ అనడం మంచిది’’

- కుప్పం రోడ్‌ షోలో చంద్రబాబు


‘‘మనం అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే.. ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చి దోపిడీ చేస్తోంది. ఈ ప్రభుత్వంలో ప్రజలు కాదు.. దొంగలు బాగా లాభపడ్డారు. వైసీపీ నాయకులకు అక్రమ డబ్బుతో కొవ్వు పెరిగింది’’ - చంద్రబాబు


చిత్తూరు, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): ‘‘చెత్తపై పన్ను వేస్తున్న ఈ చెత్త ముఖ్యమంత్రి.. మరుగుదొడ్లకు కూడా పన్ను వేస్తున్నాడు. మరుగుదొడ్డికి రూ.40 చొప్పున ఇంట్లో ఎన్ని ఉంటే అన్ని మరుగు దొడ్లకు పన్ను వసూలు చేయనున్నారు. మరుగుదొడ్డికి పన్ను వేయడానికి సిగ్గుండాలి’’ అని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సీఎం జగన్‌పై విరుచుకుపడ్డారు. చిత్తూరు జిల్లాలోని తన సొంత నియోజకవర్గం కుప్పం పట్టణ ప్రాంతాల్లో రెండో రోజు శనివారం చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో ‘చైతన్య రథం’ ఎక్కి రోడ్‌షో నిర్వహించారు. ఆయా సందర్భాల్లో చంద్రబాబు మాట్లాడుతూ.. ‘‘మీ ఇంట్లో మరుగు దొడ్డికి కూడా పన్ను వేస్తున్న జగన్‌ని పిలిచి మరుగుదొడ్డి కడగమని చెప్పండి’’ అని ప్రజలనుద్దేశించి అన్నారు. ఈ క్రమంలోనే కుప్పం సమీపంలోని పొలాలకు వెళ్లి రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా ధాన్యాన్ని పరిశీలించి.. మద్దతు ధరలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో వలంటీర్లు పెద్ద న్యూసెన్స్‌గా మారారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘బ్రిటిషర్లకు ఏజెంట్లు ఉన్నట్లు, ప్రభుత్వానికి వలంటీర్లు ఏజెంట్లుగా మారారు. రాష్ట్రంలో ఎక్కడైనా ఎన్నికలొస్తే చాలు.. పథకాలు కట్‌ చేస్తామని ఓటర్లను బెదిరిస్తున్నారు. మనం అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే.. ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చి దోపిడీ చేస్తోంది. ఈ ప్రభుత్వంలో ప్రజలు కాదు.. దొంగలు బాగా లాభపడ్డారు. నా మీదే బాంబులు వేస్తామంటున్న వారు.. ఎన్నికల్లో గెలిపిస్తే మిమ్మల్ని వదులుతారా? ఒకప్పుడు తుగ్లక్‌ ఉండేవాడట, అతని ఆగడాల గురించి పుస్తకాల్లో చదివే ఉంటారు. ఇప్పటి కాలంలో ‘జగన్‌ తుగ్లక్‌’ ఉన్నాడు. ఆయన్ను తుగ్లక్‌ అనడం కంటే పెద్ద ‘జగ్లక్‌’ అనడం మంచిది’’ అని చంద్రబాబు అన్నారు.


భయపడే రకం కాదు!

గంజాయిపై పోరాటం చేస్తే టీడీపీ కార్యాలయాల మీద దాడి చేశారని చంద్రబాబు నిప్పులు చెరిగారు. రౌడీరాజ్యంలో ప్రాణాలకు, మానాలకు, ఆస్తులకు రక్షణ ఉండదన్నారు. ‘‘నా రాజకీయ జీవితంలో చాలామంది రౌడీలను చూశాను. అందర్నీ అణచివేశాను. నేను భయపడేరకం కాదు’’ అని నొక్కి చెప్పారు. ‘‘కుప్పం మునిసిపల్‌ ఎన్నికల్లో వైసీపీ నాయకులు తమ అవినీతి సొమ్మును ఓటుకు రూ.5వేల చొప్పున పంచేందుకు సిద్ధంగా ఉన్నారు. కొత్త బిచ్చగాళ్లు వస్తారు. బెదిరిస్తారు. ప్రలోభాలకు లొంగితే భవిష్యత్తు నాశనం చేస్తారు. కుప్పానికి నీతి నిజాయితీ ప్రాంతమని పేరుంది. ఎన్నికల్లో ఆ నీతికి, నిజాయితీకి పట్టంకట్టండి’’ అని బాబు పిలుపునిచ్చారు. 


సీఐలతో ప్రత్యేక సమావేశం

కుప్పం టౌన్‌, రూరల్‌ సీఐలు సాదిక్‌అలీ, యతీంద్రలతో చంద్రబాబు ప్రత్యేకంగా మాట్లాడారు. మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో ఓ వర్గానికి అనుకూలంగా కాకుండా నిక్కచ్చిగా పనిచేయాలని కోరారు. ఇటీవల చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేతల మీద టీడీపీ ఫిర్యాదు చేసేందుకు స్టేషన్‌కు వెళ్లగా.. ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. సీఐ సాదిక్‌అలీపై వైసీపీ నేతలు దురుసుగా ప్రవర్తించారు. నిజాయితీగా విధులు నిర్వర్తిస్తున్న సీఐ సాదిక్‌ అలీని చంద్రబాబు అభినందించినట్లు సమాచారం.


పర్యటనకు విశేష స్పందన

కుప్పంలో చంద్రబాబు రెండురోజుల పర్యటనకు విశేష స్పందన లభించింది. జిల్లా నుంచే కాకుండా పొరుగు జిల్లాల నుంచి కూడా వచ్చిన నాయకులు బాబును కలిశారు. తొలిరోజు అర్ధరాత్రి 12.30గంటల వరకు కుప్పం వీధుల్లో పర్యటించిన చంద్రబాబు రెండోరోజూ అదే జోష్‌ను కొనసాగించారు. సుమారు వంద వాహనాలతో ఆయన కాన్వాయ్‌ ముందుకుసాగింది. తొలి రోజు పోలీసుల భద్రత సరిగా లేదని చంద్రబాబు చెప్పడంతో శనివారం వంద మందికి పైగా పోలీసులతో భద్రత కల్పించారు. 


బీసీ నాయకుల్ని దెబ్బతీసే కుట్ర

బీసీ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారని, తద్వారా బీసీ నాయకత్వాన్ని దెబ్బ తీసేలా కుట్రలు జరుగుతున్నాయని చంద్రబాబు అన్నారు. శనివారం చిత్తూరు జిల్లా బీసీ నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీసీ నాయకుల్ని ఇబ్బంది పెడుతున్న సీఎం జగన్‌ భవిష్యత్తులో మూల్యం చెల్లించక తప్పదన్నారు. బీసీలు టీడీపీ వెంట ఉండి పార్టీ పూర్వ వైభవానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీసీ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, టీడీపీ బీసీ సెల్‌ ఉపాధ్యక్షుడు షణ్ముగం, అశోక్‌ ఆనంద్‌ యాదవ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.


రెండు రోజులూ బస్సులోనే బస

చంద్రబాబు ఈ ఏడాది ఫిబ్రవరిలో కుప్పం పర్యటనకు వచ్చినప్పుడు ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌ్‌సలో బస చేశారు. ఆ సమయంలో తెల్లవారుజామున రెండుసార్లు విద్యుత్‌కు అంతరాయం కలిగింది. ఈ కారణంగా తాజా పర్యటనలో చంద్రబాబు రెండు రోజులూ గెస్టు హౌస్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన బస్సులోనే బస చేశారు.

Updated Date - 2021-10-31T09:01:14+05:30 IST