విధిరాతను నమ్మను.. శ్రమను నమ్ముతా

ABN , First Publish Date - 2021-10-31T08:41:32+05:30 IST

విధిరాతను నమ్మను.. శ్రమను నమ్ముతా

విధిరాతను నమ్మను.. శ్రమను నమ్ముతా

విద్యార్థి దశ నుంచే శ్రమించాలి: సినీ దర్శకుడు రాజమౌళి


శ్రీకాకుళం, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): విధి రాతను, తలరాతను తాను నమ్మనని, కేవలం శ్రమను మాత్రమే నమ్ముతానని ప్రముఖ సినీదర్శకులు ఎస్‌ఎస్‌ రాజమౌళి పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా రాగోలు జెమ్స్‌ ఆసుపత్రి ప్రాంగణంలో గ్రాడ్యుయేషన్‌ డే సందర్భంగా వైద్య విద్యార్థులతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా రాజమౌళి కొన్ని ప్రశ్నలకు బదులిస్తూ.. ‘విద్యార్థి దశ నుంచే ఎవరైనా కష్టపడాల్సిందే. బాల్యం నుంచి ఉన్నత చదువుల వరకు శ్రమతో కూడిన చదువు వల్ల ఫలితం ఉంటుంది. అదే ఉన్నత స్థాయిలో నిలబెడుతుంది. నేను వ్యవసాయ కుటుంబం నుంచే వచ్చాను. ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. నాకు డ్రైవింగ్‌లో మంచి పట్టుంది. ఓ దశలో డ్రైవర్‌గా మారుతానేమో అనుకున్నా. ఇదంతా సినిమాల్లోకి రాకముందు. మా నాన్న, భార్య ప్రోత్సాహంతో రాఘవేంద్రరావు దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేరాను. అలా దర్శకత్వ విభాగంలో పట్టు సాధించి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాను. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు రెండు భాగాలుగా తీసే ఆలోచన లేదు. ఇంకొద్ది భాగం మాత్రమే షూటింగ్‌ మిగిలి ఉంది. ఇక నా డ్రీమ్‌ ప్రాజెక్టు మహాభారతం నాలుగు భాగాల్లో తీసే ఆలోచనలో ఉన్నాను’’ అని చెప్పారు. పవన్‌ కల్యాణ్‌తో సినిమా తీసేందుకు వేచి ఉన్నానని, ఆయనతో ఎలాంటి సినిమా అయినా చేసేందుకు తాను సిద్ధమేనని రాజమౌళి తెలిపారు. 

Updated Date - 2021-10-31T08:41:32+05:30 IST