ఉచితాలతో ఒరిగేదేం లేదు

ABN , First Publish Date - 2021-10-31T08:34:45+05:30 IST

ఉచితాలతో ఒరిగేదేం లేదు

ఉచితాలతో ఒరిగేదేం లేదు

ఉచిత విద్యుత్‌ కాదు.. 10 గంటలపాటు నాణ్యమైనది ఇస్తే చాలు

ప్రభుత్వాలు రైతులకు దీర్ఘకాలికంగా చేయూతనందించాలి

వ్యవసాయం రైతుల వృత్తి కాదు.. వారి జీవితం

రైతు నేస్తం అవార్డుల ప్రదానోత్సవంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య


ఉంగుటూరు, అక్టోబరు 30: ఉచిత పథకాలు, తాత్కాలిక జనాకర్షక పథకాల వల్ల ప్రజలకు, రైతులకు మేలు జరగదని, దీర్ఘకాలికంగా చేయూతనందించే పథకాలకు రూపకల్పన జరగాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. రైతులకు ఉచితవిద్యుత్‌తో పనిలేదని, నిరాటంకంగా 10గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ అందిస్తే చాలన్నారు. ‘రైతునేస్తం’ మాసపత్రిక 17వ వార్షికోత్పవం సందర్భంగా ముప్పవరపు ఫౌండేషన్‌, రైతునేస్తం ఆధ్వర్యంలో కృష్ణాజిల్లా ఆత్కూరు స్వర్ణభారత్‌ ట్రస్ట్‌లో పద్మశ్రీ ఐ.వి.సుబ్బారావు రైతునేస్తం పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని శనివారం వెంకయ్య జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులకు అన్ని విషయాల్లో వెన్నుదన్నుగా నిలిచి, చేయూతనందించేందుకు ప్రభుత్వాలు ముందుకు రావాలన్నారు. మట్టిలోని సారాన్ని మానవజాతి మనుగడకు ఉపయోగపడే ఆహారంగా మార్చే పవిత్ర యజ్ఞమే వ్యవసాయమన్న ఆయన పట్టభద్రులైన యువత వ్యవసాయ రంగం వైపు మళ్లాలన్నారు. వ్యవసాయమంటే పంటలు పండించడంకాదని, పర్యావరణాన్ని కాపాడుకోవాలని సూచించారు. రైతుల దృష్టిలో వ్యవసాయం అంటే వృత్తికాదని, వారి జీవితమన్న ఆయన, కరోనా వేళ ఆహారధాన్యాల ఉత్పత్తిలో రైతుల కృషి మరువలేనిదన్నారు. రసాయన ఎరువుల వాడకాన్ని క్రమంగా తగ్గించి పర్యావరణహిత వ్యవసాయ విధానాలపై రైతులు దృష్టి కేంద్రీకరించాలన్నారు. సేంద్రియ పంట ఉత్పత్తులకు ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉందని, ప్రతి రైతు తమ కమతాల్లో కొంతభాగాన్ని ఆర్గానిక్‌ వ్యవసాయ పంటలు పండించేందుకు కేటాయించాలని సూచించారు. వ్యవసాయరంగంలో ఆధునిక, సాంకేతికత అభివృద్ధి, వాణిజ్య, మౌలిక సౌకర్యాల కల్పన కోసం ప్రభుత్వంతోపాటు, ప్రైవేటు సంస్థలూ ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ వ్యవసాయరంగ అభివృద్ధికి రాష్ట్రంలో ద్విముఖవ్యూహాలతో ముం దుకు వెళుతున్నామన్నారు.మాజీ మంత్రి, స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ కామినేని శ్రీనివాస్‌, నాబార్డ్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ సుధాకర్‌, రైతునేస్తం ఎడిటర్‌ యడ్లపల్లి వెంకటేశ్వరరావు, కలెక్టర్‌ జె.నివాస్‌, ట్రస్ట్‌ సభ్యులు పాల్గొన్నారు.


ఉపరాష్ట్రపతికి ఘనస్వాగతం 

గన్నవరం: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు గన్నవరం ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతం లభించింది. రాష్ట్రంలో నాలుగు రోజుల పర్యటన కోసం గోవా నుంచి ఇండియన్‌ ఎయిర్‌పోర్స్‌ ప్రత్యేక విమానంలో శనివారం ఉదయం ఆయన ఇక్కడికి విచ్చేశారు. గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌, మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌, అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.


42 మందికి రైతునేస్తం పురస్కారాలు

2020-21లో వ్యవసాయం, అనుబంధ రంగాలలో విశేష ప్రతిభ కనబర్చిన తెలుగు రాష్ట్రాలకు చెందిన 42మందిని వెంకయ్యనాయుడు, కన్నబాబు రైతునేస్తం అవార్డులతో సత్కరించారు. ఏఐకేఎస్‌ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డికి జీవిత సాఫల్య పురస్కారం, రాష్ట్ర రైతాంగ సమాఖ్య అధ్యక్షుడు ఎర్నేని నాగేంద్రనాథ్‌కు కృషిరత్న బిరుదును ప్రదానం చేశారు. అగ్రిజర్నలిజంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఐదుగురు జర్నలిస్టులలో ‘ఆంధ్రజ్యోతి’ ప్రకాశం జిల్లా స్టాఫ్‌ రిపోర్టర్‌ సూర్యదేవర నవీన్‌బాబు ఉపరాష్ట్రపతి చేతులమీదుగా పురస్కారం అందుకున్నారు. 





Updated Date - 2021-10-31T08:34:45+05:30 IST