రైతన్నపై ‘వీలింగ్‌’ పిడుగు!

ABN , First Publish Date - 2021-10-31T08:02:56+05:30 IST

రైతన్నపై ‘వీలింగ్‌’ పిడుగు!

రైతన్నపై ‘వీలింగ్‌’ పిడుగు!

ఉచితమంటూనే 17 లక్షల మందిపై భారం

‘ఎలక్ట్రిసిటీ డ్యూటీ’ పేరిట బాదుడుకు సిద్ధం.. వ్యవసాయ విద్యుత్తు కోసం ప్రత్యేక డిస్కమ్‌

మంత్రివర్గ సమావేశంలో ఆమోదముద్ర.. ఇప్పటికే మూడు విద్యుత్తు పంపిణీ సంస్థలు

ఆర్థిక భారం పడేలా కొత్తగా ఇంకోటి ఏర్పాటు.. ఏపీ రాస్కామ్‌గా రాష్ట్ర గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌

ఈ కంపెనీకి సరఫరా చేసే విద్యుత్తుకు చార్జీలు.. విధివిధానాలు బహిర్గతం చేయని సర్కారు


ఉచిత విద్యుత్‌ మాటున రైతులపై అదనపు భారం మోపేందుకు వైసీపీ సర్కారు సిద్ధమైంది. ఇప్పటికే రాష్ట్రంలో ట్రూఅప్‌ చార్జీల మోత మోగుతుండగా, ఇప్పుడు కొత్తగా వీలింగ్‌ చార్జీల పేరిట మరో వడ్డనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనికోసం ఇప్పటికే ఉన్న మూడు డిస్కంలకు అదనంగా మరోదాన్ని కొత్తగా ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో దాదాపు 17లక్షల మంది రైతన్నలపై భారం పడనుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. 


(అమరావతి-ఆంధ్రజ్యోతి) 

రాష్ట్రంలోని రైతులపై వీలింగ్‌ చార్జీల పిడుగు పడనుంది. ట్రూఅప్‌ చార్జీలకు అదనంగా ‘ఎలక్ట్రిసిటీ డ్యూటీ’ పేరిట దీన్ని వసూలు చేసేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. వ్యవసాయ విద్యుత్తు సరఫరా కోసం సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సెకీ)తో 7వేల మెగావాట్ల సోలార్‌ విద్యుత్తు కొనుగోలు ఒప్పందం చేసుకునేందుకు సిద్ధమైన ఇంధన శాఖ... రాష్ట్ర గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ను ఆంధ్రప్రదేశ్‌ రూరల్‌ అగ్రికల్చరల్‌ సప్లయ్‌ కంపెనీ(ఏపీ రాస్కామ్‌)గా మార్పు చేసింది. పాటు వ్యవసాయ విద్యుత్తు పంపిణీ బాధ్యతలను ఈ సంస్థకు అప్పగించింది. రాష్ట్రంలోని 17లక్షల వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లకు రాస్కామ్‌ ద్వారా 9గంటల పాటు పగటి పూట విద్యుత్తును అందించాలని ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధంచేసింది. ఈ కంపెనీ ఏర్పాటుకు మంత్రివర్గ సమావేశంలో ఆమోదించారు. సెకీతో విద్యుత్తు కొనుగోలు ఒప్పందం చేసుకున్నట్లుగా ఇటీవల పేర్కొన్న మంత్రి పేర్ని నాని.. డిస్కమ్‌ల నుంచి విద్యుత్తు తీసుకుని వినియోగదారులపై వీలింగ్‌ చార్జీలు ఎలా వేస్తారో వెల్లడించలేదు. దీంతో ప్రభుత్వ విధానంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 


వ్యవసాయ ఫీడర్‌ స్వాధీనం 

రాష్ట్రంలో ఇప్పటికే విశాఖలో తూర్పు ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ(ఈపీడీసీఎల్‌), తిరుపతిలో దక్షిణ ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ (ఎస్‌పీడీసీఎల్‌), విజయవాడలో కేంద్రీయ విద్యుత్తు పంపిణీ సంస్థ(సీపీడీసీఎల్‌) ఉన్నాయి. ఇవి వినియోగదారులకు నేరుగా కరెంటును సరఫరా చేస్తూ, నెలవారీ బిల్లులు వసూలు చేస్తున్నాయి. కొత్తగా ఏర్పడిన ఏపీ రాస్కామ్‌ పూర్తిగా గ్రామీణ విద్యుత్తు లైన్ల(వ్యవసాయ ఫీడర్‌)ను తన ఆధీనంలోకి తీసుకుంటుంది. సబ్‌స్టేషన్లు, విద్యుత్తు సరఫరా లైన్లను వాడుకుంటున్నందుకు గాను వీలింగ్‌ చార్జీలతో పాటు విద్యుత్తు ట్రాన్స్‌మిషన్‌ చార్జీలను సంబంధిత డిస్కంలకు చెల్లిస్తుంది. ఈ మొత్తాన్ని వ్యవసాయ విద్యుత్తు చార్జీల తరహాలోనే భరించనున్నట్లు ప్రభుత్వం హామీ ఇస్తోంది. అయితే భవిష్యత్‌లో ఈ వీలింగ్‌ చార్జీల భారాన్ని రైతులపైనో, సాధారణ వినియోగదారులపైనో వేస్తారన్న ఆందోళన వ్యక్తమవుతోంది. 


కొత్తగా రాస్కామ్‌ ఎందుకు? 

రాష్ట్రంలోని మూడు డిస్కంలు ఇప్పటికే దాదాపు రూ.11వేల కోట్ల మేర నష్టాల్లో ఉన్నాయి. ఈ పరిస్థితిలో కొత్తగా రాస్కామ్‌ ఏర్పాటు ఎందుకని విద్యుత్తు రంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. సెకీ నుంచి యూనిట్‌ రూ.2.45 చొప్పున సౌర విద్యుత్తు కొనుగోలు చేస్తున్నందున వ్యవసాయానికి పగటి పూట 9గంటల విద్యుత్తును ఇచ్చేందుకే ఈ కొత్త కంపెనీని ఏర్పాటు చేశామని ఇంధనశాఖ చెబుతోంది. అయితే విద్యుదుత్పత్తి సంస్థలతో రాస్కామ్‌ కొనుగోలు ఒప్పందాలు చేసుకోలేదు. సెకీతో ఒప్పందం చేసుకున్నా సౌర విద్యుదుత్పత్తి జరిగి, పంపిణీ కావాలంటే కనీసం ఏడాదైనా పడుతుందని ఇంధన శాఖ వర్గాలు చెబుతున్నాయి. 


వీలింగ్‌ చార్జీలంటే....? 

ఉత్పత్తి అయిన విద్యుత్తును వినియోగదారులకు సరఫరా చేయాలంటే సబ్‌ స్టేషన్లు, 11 కేవీ, 220 కేవీ ఫీడర్లు, ట్రాన్స్‌కో విద్యుత్తు లైన్లను వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఇందుకుగాను డిస్కంలకు చెల్లింపులు చేయాలి. విద్యుదుత్పత్తికి యూనిట్‌కు రూ.2.45 అయిందనుకుంటే.. విద్యుత్తు పంపిణీ, సరఫరా కోసం మరో రూ.1.05 వరకూ అవుతుంది. అంటే.. మొత్తంగా ఒక యూనిట్‌కు రూ.3.50 వ్యయం అవుతుంది. రాష్ట్రంలోని ఇతర విద్యుత్తు వినియోగదారులందరికీ వీలింగ్‌ చార్జీలు కలుపుకునే బిల్లులు వస్తుంటాయి. కానీ కొత్త కంపెనీ రాస్కామ్‌... డిస్కమ్‌ల నుంచి విద్యుత్తు తీసుకుని, రైతులకు సరఫరా చేయాలి. అంటే విద్యుత్తు చట్టం ప్రకారం రాస్కామ్‌ యూనిట్‌కు రూ.1.05 దాకా అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు 5హెచ్‌పీ పంప్‌సెట్‌  గంటకు 3.75 కిలోవాట్ల విద్యుత్తును తీసుకుంటుంది. ఈ లెక్కన 9గంటలకు 33.75 యూనిట్లు, అదే 30రోజులకు 1,012.5 యూనిట్ల విద్యుత్తు వినియోగం జరుగుతుంది. ఈ లెక్కన రాష్ట్రంలోని 17లక్షల వ్యవసాయ కనెక్షన్లకూ ప్రభుత్వం ప్రతినెలా రూ.172.50 కోట్లు చెల్లించాలి. ప్రభుత్వం ఈ మొత్తాన్ని చెల్లించగలదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.


ఒక్కో రైతుపై రూ.1,063 భారం 

ఒకవైళ వీలింగ్‌ చార్జీల భారం రైతులపై వేస్తే ప్రతినెలా ఒక్కొక్కరు రూ.1,063 వరకూ చెల్లించాల్సి ఉంటుంది. ఉచిత విద్యుత్తు మాటున రైతుల నుంచి ఎలక్ర్టిసిటీ డ్యూటీ కింద వసూలు చేసే మొత్తం భారీగా ఉంటుందని రైతు సంఘాలు, రాజకీయ పక్షాలూ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఏ కేటగిరీ వినియోగదారుడి నుంచి ఎంత చొప్పున వసూలు చేస్తారో ప్రభుత్వం స్పష్టం చేయలేదు. ఈ డ్యూటీని వ్యవసాయేతర విద్యుత్తు వినియోగదారుల నుంచి వసూలు చేస్తే ఇప్పటికే ట్రూఅప్‌ చార్జీలు భరిస్తోన్న వారిపై మరింత భారం పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవల బొగ్గు సంక్షోభం పేరిట ఎక్చేంజీ నుంచి విద్యుత్తు సంస్థలు యూనిట్‌కు రూ.20 వరకూ కొనుగోలు చేశాయి. ఈ భారంతో పాటు, వ్యవసాయ విద్యుత్తు వీలింగ్‌, ట్రాన్స్‌మిషన్‌ చార్జీల భారాన్ని వినియోగదారులపై భారీగా వేసే ప్రతిపాదనలు ఉన్నాయని ఇంధన రంగ నిపుణులు పేర్కొంటున్నారు. వీలింగ్‌ చార్జీల భారంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు.Updated Date - 2021-10-31T08:02:56+05:30 IST