‘వేలం వెర్రి’కి ఓకే!

ABN , First Publish Date - 2021-10-31T07:59:17+05:30 IST

‘వేలం వెర్రి’కి ఓకే!

‘వేలం వెర్రి’కి ఓకే!

ఇక ఎడాపెడా ప్రభుత్వ భూముల వేలం

కీలక జీవోకు గుట్టుచప్పుడు కాకుండా సవరణ

నాడు ప్రభుత్వ భూముల రక్షణకు సమగ్ర విధానం

సుదీర్ఘ కసరత్తు అనంతరం జీవో 571 జారీ

డబ్బుల కోసం ప్రభుత్వ భూములు అమ్మొద్దనే నిబంధన

జగన్‌ సర్కారు కాసుల వేటకు అడ్డంకిగా నాటి జీవో

సెప్టెంబరులోనే పాత విధానానికి గుట్టుగా పాతర

ప్రభుత్వ భూముల భక్షణకు వీలుగా జీవో 243 జారీ

తాజాగా మంత్రివర్గ సమావేశంలో ఆమోదం

వెబ్‌సైట్‌లో జీవో, గెజిట్‌లు పెట్టకుండా ‘రహస్యం’


వ్యక్తులు శాశ్వతం కాదు. అధికారంలో ఉన్న వారు శాశ్వతం కాదు. కానీ... భూమి మాత్రం శాశ్వతం. అలాంటి భూమిని భవిష్యత్‌ అవసరాలకోసం భద్రంగా కాపాడుకునేందుకు తీసుకొచ్చిన సమగ్ర విధానాన్ని జగన్‌ సర్కారు తుంగలో తొక్కింది. ‘డబ్బుల కోసం భూములు అమ్మొద్దు’ అని ఉమ్మడి రాష్ట్రంలో జారీ అయిన జీవోను భూమిలోనే పాతేసింది. అది కూడా గుట్టుచప్పుడు కాకుండా!


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

అమ్ముతూ పోతే అంగుళం కూడా మిగలదు! వ్యక్తులకే కాదు... ప్రభుత్వానికీ ఇది వర్తిస్తుంది. ఈ ప్రభుత్వం మాత్రం అంగుళం కూడా మిగలకుండా అమ్మేయాలనే భావిస్తున్నట్లుంది. అందుకే... గతంలో భూముల రక్షణ కోసం జారీ చేసిన విధానాన్ని గుట్టుచప్పుడు కాకుండా మార్చేసింది. భూముల భక్షణకు రంగం సిద్ధం చేసింది. ప్రభుత్వ భూములను పరిరక్షించడం కోసం 2012  సెప్టెంబరు 14న తీసుకొచ్చిన ‘సమగ్ర భూకేటాయింపు విధానాన్ని’ సవరిస్తూ... ఎప్పుడు డబ్బులు అవసరమైతే అప్పుడు ప్రభుత్వ భూములను తెగనమ్ముకునే వెసులుబాటు కల్పించుకుంది. భూ విధానం జీవో 571ను సవరిస్తూ ఇటీవల జగన్‌ సర్కారు జీవో 243 జారీ చేసింది. జీవోలను జనం కళ్లలో పడకుండా దాచేస్తున్న ప్రభుత్వం... దీనినీ అలాగే పరమ రహస్యంగా దాచిపెట్టింది. కానీ, ఆ జీవోకు మంత్రివర్గం ఆమోదం తప్పనిసరి కావడంతో అది కాస్తా బట్టబయలైంది. సదరు సవరణ జీవోకు గురువారం జరిగిన కేబినెట్‌ భేటీలో ఆమోద ముద్ర వేశారు.


నాడు అన్నీ ఆలోచించి... 

కేవలం డబ్బులు సమకూర్చుకునేందుకు ఎడాపెడా ప్రభుత్వ భూములు విక్రయించడం, అడ్డగోలుగా భూములు కేటాయించడంపై తీవ్రస్థాయి విమర్శలు తలెత్తాయి. దీనిపై ఉమ్మడి రాష్ట్ర చివరి సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి స్పందించారు. ప్రభుత్వ భూముల పరిరక్షణ, ప్రైవేటు సంస్థలు, కంపెనీలు, పరిశ్రమలకు పారదర్శకంగా భూ కేటాయింపులు చేయడం వంటి అంశాలపై సమగ్ర అధ్యయనం జరపాలని నిర్ణయించారు. గతంలో జరిగిన భూ కేటాయింపులను సమీక్షించి, తప్పులను సరిదిద్ది,  పారదర్శకమైన కేటాయింపుల విధానం తీసుకువచ్చేందుకు కసరత్తుచేశారు.  2011 మార్చి 14న మొదలైన ఈ ప్రక్రియ ఆ ఏడాది డిసెంబరు 28 దాకా కొనసాగింది. ఈ పాలసీపై 2011 నవంబరు 28న కిరణ్‌ కుమార్‌రెడ్డి అఖిలపక్షం నిర్వహించారు. అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు, సూచనలు తీసుకున్నారు. అదే ఏడాది డిసెంబరు 15న  జిల్లా కలెక్టర్ల సదస్సు నిర్వహించి... అచ్చంగా ఈ పాలసీపైనే చర్చించారు. ఇలా సమగ్రమైన అధ్యయనం అనంతరం 2012 ఆగస్టులో భూ కేటాయింపు పాలసీని తీసుకొచ్చారు. అదే ఏడాది సెప్టెంబరు 14న దీనిపై  సర్కారు జీవో 571 విడుదల చేసింది. ఇక అప్పటి నుంచి భూ కేటాయింపులు, ప్రభుత్వ భూముల రక్షణలో ఈ ఉత్తర్వులనే ప్రామాణికంగా పరిగణిస్తున్నారు. దీని ప్రకారం... కేవలం నిధులు సమకూర్చుకునేందుకు ప్రభుత్వ భూములను విక్రయించకూడదు. 44 పేజీలున్న ఈ విధానంలో... 3వ క్లాజులోని 5వ సబ్‌క్లాజ్‌లో ఈ విషయం స్పష్టంగా చెప్పారు. ఈ నిబంధనల అమలు, పరిశీలన, పర్యవేక్షణ, పారదర్శక భూ కేటాయింపుల కోసం ఆంధ్రప్రదేశ్‌ ల్యాండ్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ (ఏపీఎల్‌ఎమ్‌ఏ)ను ఏర్పాటు చేశారు.


అయినా... అడ్డగోలు అమ్మకాలు

కిరణ్‌ హయాంలో తెచ్చిన జీవో... జగన్‌ సర్కారు అధికారంలోకి వచ్చేదాకా చక్కగానే అమలైంది. ఆ తర్వాతే సీన్‌ మారిపోయింది. ప్రభుత్వ భూములను పరిరక్షించే జీవో 571 అమలులో ఉన్నప్పటికీ... ఈ సర్కారు పట్టించుకోలేదు. నిధుల కోసం ప్రభుత్వ భూములను అమ్మాలని జగన్‌ నిర్ణయించుకున్నారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్‌బీసీసీని తెరపైకి తీసుకొచ్చారు. ఖాళీ ప్రభుత్వ భూములను ఆ సంస్థ ద్వారా వేలంలో అమ్మేందుకు అనుమతి ఇస్తూ 2019 నవంబరు 5న నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు ‘మిషన్‌ బిల్డ్‌  ఏపీ’ అనే సంస్థను ఏర్పాటు చేస్తూ, అమ్మాలనుకున్న ప్రభుత్వ భూములను ఆ సంస్థకు కట్టబెట్టాలని అదే రోజున జీవో 447ను జారీ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ‘వేలం వెర్రి’ కుదరదని జీవో 571 తెచ్చిన రెవెన్యూ శాఖే... నవ్యాంధ్రలో వేలం వెర్రికి దారులు తీసింది.  అయితే, భూముల వేలంపై  కోర్టుల్లో కేసులు దాఖలవ్వడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. జీవో 571లోని నిబంధనలకు విరుద్ధంగా భూములు అమ్మడం కుదరదని కోర్టు కూడా తేల్చిచెప్పింది. వెరసి... ఈ జీవో జగన్‌ ‘నిధుల వేట’కు పెద్ద అడ్డంకిగా మారిందన్న మాట!


గుట్టుగా జీవో 571కి సవరణ

ప్రభుత్వ భూముల రక్షణ కోసం సుదీర్ఘ కసరత్తు అనంతరం తీసుకొచ్చిన జీవో 571ను... జగన్‌ సర్కారు రాత్రికి రాత్రి సవరణ చేసేసింది. సెప్టెంబరు 13వ తేదీన 243 అనే సవరణ జీవో జారీ చేసింది. దీని ప్రకారం... ఇక ఇష్టానుసారంగా ప్రభుత్వ భూములను అమ్ముకోవ చ్చు. ఆ భూమి, ఈ భూమి అన్న తేడాలేకుండా, ఏది ఎక్కువకు అమ్ముడుపోతుందనుకుంటే దాన్ని వేలంలో అమ్ముకోవచ్చు. ఇంకా తనకు నచ్చిన పద్ధతుల్లో భూములను అమ్ముకునే వెసులుబాటు వచ్చింది. ఇంత కీలకమైన జీవోను జగన్‌ ప్రభుత్వం గుట్టుగా దాచేసింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం ఈ ఉత్తర్వును కూడా ఈ-గెజిట్‌లో అప్‌లోడ్‌ చేసి ప్రజల దృష్టికి తేవాల్సి ఉన్నా... ఆ పని చేయలేదు. గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆ జీవోకు ఆమోదముద్రవేశారు. ఆ తర్వాత కూడా దీనిని బహిర్గతం చేయలేదు. సమాచార హక్కు చట్టం ద్వారా ప్రజలు తెలుసుకోవాల్సిన కీలక విషయాలను ఈ-గజిట్‌లో అందుబాటులో ఉంచుతామన్న సర్కారు... ఈ జీవోను చీకట్లోనే ఉంచింది. 


కదిలించిన ‘ఆంధ్రజ్యోతి’ కథనాలు

ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ భూముల కేటాయింపులు, అమ్మకాలు, వేలం ప్రక్రియల్లో జరిగిన అనేక అక్రమాలు, అన్యాయాలను వెలుగులోకి తెస్తూ ‘ఆంధ్రజ్యోతి’ 2010 జూన్‌ 16 నుంచి 2011 డిసెంబరు వరకు అనేక కథనాలను ప్రచురించింది. హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, రాజమండ్రి వంటి నగరాల్లో ప్రభుత్వ భూములను పరాధీనం చేయడం, డబ్బుల కోసం వేలం వేసి ప్రైవేటు కంపెనీలకు అమ్మేయడం, ఇంకా అస్మదీయులకు అడ్డగోలుగా కేటాయించడంపై అనేక పరిశోధనాత్మక వార్తలను ప్రచురించింది. ఈ కథనాలపై నాటి కిరణ్‌ కుమార్‌ రెడ్డి సర్కారు అసెంబ్లీ సమావేశాల్లోనే స్పందించింది. అప్పటి రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. అప్పటి సీసీఎల్‌ఏ సత్యనారాయణ నేతృత్వంలో అధికారులతో నిపుణుల కమిటీని నియమించింది. సుదీర్ఘ కసరత్తు అనంతరం సమగ్ర విధానాన్ని తీసుకొచ్చింది. 


అప్పట్లో ఎందుకు తెచ్చారంటే..

1) భూమి కేటాయింపుల విషయంలో అందరికీ వర్తించే ఒకే రకమైన మార్గదర్శకాలు లేవు.

2) భూమి కేటాయించిన తర్వాత... భూమి ఇచ్చిన ప్రయోజనం నెరవేరిందా, లేదా అని తనిఖీ చేసే వ్యవస్థ ఏదీ లేకుండా పోయింది. 

3) ప్రభుత్వ భూములను వనరుల (నిధుల) సమీకరణకోసం వేలంలో అమ్ముతున్నారు. ఇదే కొనసాగితే భవిష్యత్తు అవసరాలకు భూమి కొరత ఏర్పడుతుంది. ఇకపై ఇది కొనసాగ డానికి వీల్లేదు.Updated Date - 2021-10-31T07:59:17+05:30 IST