‘అమర్‌రాజా’పై మధ్యంతర ఉత్తర్వుల పొడిగింపు

ABN , First Publish Date - 2021-10-29T10:04:23+05:30 IST

‘అమర్‌రాజా’పై మధ్యంతర ఉత్తర్వుల పొడిగింపు

‘అమర్‌రాజా’పై మధ్యంతర ఉత్తర్వుల పొడిగింపు

తదుపరి విచారణ నవంబరు 9కి వాయిదా


అమరావతి, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): అమర్‌రాజా బ్యాటరీస్‌ మూసివేతకు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) ఇచ్చిన ఉత్తర్వుల అమలును నిలుపుదల చేస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు పొడిగించింది. తదుపరి విచారణను నవంబరు 9కి వాయిదావేసింది. ఈ మేరకు జస్టిస్‌ అహసనుద్దీన్‌ అమానుల్లా, జస్టిస్‌ బి కృష్ణమోహన్‌తో కూడిన ధర్మాసనం గురువారం ఆదేశాలిచ్చింది. పర్యావరణ నిబంధనలను పాటించలేదంటూ పరిశ్రమ మూసివేతకు పీసీబీ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌చేస్తూ అమర్‌రాజా బ్యాటరీస్‌ లిమిటెడ్‌ అధీకృత అధికారి నాగుల గోపీనాథ్‌రావు హైకోర్టులో రెండు వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలు గురువారం విచారణకు వచ్చాయి. నివేదిక కోర్టు ముందు లేకపోవడంతో ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. ఈ సందర్భంగా ఉద్యోగుల రక్తంలో సీసం (లెడ్‌) శాతం ఎక్కువ ఉన్నట్లు రికార్డులోని వివరాలు పరిశీలించింది. ఉద్యోగుల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించరా అని ప్రశ్నించింది. డబ్బు సంపాదన కంటే మనుషుల జీవితాలు ముఖ్యమని వ్యాఖ్యానించింది. అమర్‌రాజా తరపున సీనియర్‌ న్యాయవాది బి.ఆదినారాయణరావు స్పందిస్తూ.. పీసీబీ తరపు న్యాయవాది వాదనలు విని విచారణ వాయిదా వేసిన నేపథ్యంలో వివరాలను కోర్టు ముందుంచడానికి వీల్లేకుండా పోయిందన్నారు. తదుపరి విచారణలో అన్ని వివరాలను కోర్టు ముందు ఉంచుతామని తెలిపారు.

Updated Date - 2021-10-29T10:04:23+05:30 IST