కొవిడ్‌తో అసమానతలు పెరిగాయి
ABN , First Publish Date - 2021-10-29T10:00:46+05:30 IST
కొవిడ్‌తో అసమానతలు పెరిగాయి
140 మంది బిలియనీర్ల ఆదాయం 22 శాతం పెరిగింది
రాఘవాచారి స్మారకోపన్యాసంలో పాలగుమ్మి
విజయవాడ కల్చరల్, అక్టోబరు 28: ‘‘కొవిడ్ నేపథ్యంలో దేశంలో అసమానతలు పెరిగాయి. భారత్ బిలియనీర్ల సంపద 22 శాతం పెరిగినప్పటికీ దేశ జీడీపీ 7 శాతం కిందకు పడిపోవడం దారుణం. కొవిడ్ వల్ల 12 కోట్ల మంది భారతీయులు నిరుద్యోగులుగా మారారు’’ అని రామన్ మెగసెసె అవార్డు గ్రహీత, ప్రముఖ పాత్రికేయుడు పాలగుమ్మి సాయినాఽథ్ తెలిపారు. గురువారం శ్రీరాఘవాచారి స్మారక ఉపన్యాసం కార్యక్రమంలో ‘కొవిడ్ నేపథ్యంలో ప్రసార మాధ్యమాలు, అసమానతలు’ అనే అంశంపై ఆయన ప్రసంగించారు. కోట్లాది మంది నిరుద్యోగులుగా మారి ఆకలి బాధలు పెరిగి, జీవన ప్రమాణాలు తగ్గిపోయినా... దేశంలోని 140మంది బిలియనీర్లకు మాత్రమే 22 శాతం ఆదాయం పెరగడం, జీడీపీ పడిపోవడంపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఆకలితో అలమటించే పేదవారు అధిక శాతం ఉన్నారని సుప్రీం కోర్టు చెప్పిన మాటలను కొట్టిపారేసిన కేంద్రం... 54 కోట్ల మందికి 5 కేజీల చొప్పున బియ్యం ఇస్తామని ఎందుకు ప్రకటించిందని ప్రశ్నించారు. గ్రామీణులు తమకొచ్చే ఆదాయమంతా వెచ్చించినా వారికి పౌష్టికాహారం 66 శాతం మాత్రమే అందుతోందన్నారు. రైతుల ఆందోళనను సుప్రీంకోర్టు సమర్థించిందన్నారు. కాని ప్రభుత్వాలు మాత్రం రైతుల నిరసనకు అడ్డుతగులుతూ, బుల్డోజర్లతో రోడ్లు బ్లాక్‌చేసి అవి రైతులే చేసినట్టుగా ఆరోపణలు చేయటంపై బాధాకరమన్నారు. కొవిడ్ మరణాల సంఖ్యను ప్రపంచానికి తక్కువగా చూపి తప్పుడు సంకేతాన్ని ఇస్తోందన్నారు. భారతదేశం ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకోవటమే కాని ప్రధాన మంత్రి మోదీ ఒక్కసారైనా ప్రెస్‌మీట్ పెట్టకపోవటం విశేషమన్నారు. బహుశా రెండు సంవత్సరాల తరువాత మోదీ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేయవచ్చునని, అప్పటికి కార్పొరేట్ మీడియా పెరిగి ఉన్న కాస్త జర్నలిస్టులు తగ్గిపోతారని అన్నారు. విశాలాంధ్ర సంపాదకులు ఆర్.వి.రామారావు సభాధ్యక్షత వహించగా, విశ్రాంత అధ్యాపకులు ఎన్.అంజయ్య, రాఘవాచారి సతీమణి జ్యోత్న్స పాల్గొన్నారు.