ఇది న్యాయస్థానాలను మరింత కించపర్చడమే
ABN , First Publish Date - 2021-10-29T09:56:12+05:30 IST
ఇది న్యాయస్థానాలను మరింత కించపర్చడమే
ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శిపై బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన హైకోర్టు
జీపీ క్షమాపణలు కోరడంతో ఉపసంహరణ
అమరావతి, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): కోర్టు ధిక్కరణ కేసులో నోటీసులు ఇచ్చినా విచారణకు హాజరుకాకపోతే ఎంతపెద్ద అధికారిపై అయినా నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని హైకోర్టు హెచ్చరించింది. నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడం న్యాయస్థానాలను మరింత కించపర్చడమేనని వ్యాఖ్యానించింది. కోర్టు ధిక్కరణ వ్యాజ్యంలో నోటీసులు అందుకున్నప్పటికీ విచారణకు హాజరుకాకపోవడం, న్యాయవాదిని నియమించుకోకపోవడంపై ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌ఎ్‌స.రావత్‌పై బెయిలబుల్ వారెంట్ జారీచేస్తూ రూ.5లక్షల పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. అయితే మధ్యాహ్నం భోజన విరామానికి ముందు ప్రభుత్వ న్యాయవాది (జీపీ ఫర్ సర్వీసెస్) అశ్వద్ధనారాయణ ధర్మాసనం ముందు హాజరై... ఇతర కోర్టు లో కేసు విచారణ జరుగుతున్నందున హాజరు కాలేకపోయానని వివరణ ఇచ్చారు. ధర్మాసనాన్ని క్షమాపణలు కోరారు. దీంతో ధర్మాసనం తన ఆదేశాలను ఉపసంహరించింది. వ్యాజ్యంలో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, జస్టిస్ కె.లలితతో కూడిన ధర్మాసనం గురువారం ఆదేశాలిచ్చింది. ఏపీ పరిపాలన ట్రైబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ జూనియర్ అసిస్టెంట్ జి.రాంబాబు హైకోర్టులో కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేశారు.