అమ్మ ఒడి కోసం... కొడుకు బడి బలిపీఠంపైకా..?

ABN , First Publish Date - 2021-10-29T09:40:20+05:30 IST

అమ్మ ఒడి కోసం... కొడుకు బడి బలిపీఠంపైకా..?

అమ్మ ఒడి కోసం... కొడుకు బడి బలిపీఠంపైకా..?

ఎయిడెడ్‌ ఆస్తుల కోసం ప్రభుత్వం కుట్ర ఇది: లోకేశ్‌


అమరావతి, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): ‘‘జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత, మూర్ఖపు నిర్ణయాలతో ఎయిడెడ్‌ స్కూళ్లు చచ్చిపోతున్నాయి. ఇది లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు మరణశాసనం. విద్యావ్యవస్థపై జగన్‌ చేస్తోన్న దాడి చూస్తుంటే అన్ని వ్యవస్థల ధ్వంసానికి తెగబడుతున్నట్లే కనిపిస్తోంది. అమ్మ ఒడి ఇవ్వడానికి, కొడుకు బడిని బలిపీఠంపై ఎక్కించడం భావ్యమేనా?’’ అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ప్రశ్నించారు. ఈమేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి ఆయన గురువారం ఒక లేఖ రాశారు. అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్ర ప్రభుత్వం ఎయిడెడ్‌ ఆస్తులపై కన్నేసిందని ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మొన్న వైజాగ్‌, నిన్న కాకినాడ, నేడు గుంటూరు... ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఎయిడెడ్‌ పాఠశాలల మూసివేత కు వ్యతిరేకంగా విద్యార్థులు, తల్లిదండ్రులు రోడ్లెక్కి నిరసన తెలుపుతున్నారని పేర్కొన్నారు. అయినా ప్రభుత్వం తన మూర్ఖపు నిర్ణయాన్ని సమర్థించుకోవడం శోచనీయమన్నారు. ‘‘రాష్ట్రవ్యాప్తంగా 2,203 పాఠశాలల్లో 1,96,313 మంది విద్యార్థులు, 182 జూనియర్‌ కళాశాలల్లో 71,035 మంది విద్యార్థులు, 116 డిగ్రీ కళాశాలల్లో 2.50 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్‌ ప్రశ్నార్థకమైంది. ప్రభుత్వానికి ఆస్తులు-సిబ్బందిని అప్పగించని యాజమాన్యాలు ఇలా మూసివేత ప్రకటనలు చేస్తుంటే అటు విద్యార్థులు, ఇటు సిబ్బంది పరిస్థితి కూడా అగమ్యగోచరంగా మారింది’’ అని లోకేశ్‌ పేర్కొన్నారు. ఏ ఒక్క పేద విద్యార్థికి ప్రభుత్వం చదువును దూరం చేసి, నష్టపరిచినా చూస్తూ ఊరుకోమని లోకేశ్‌ హెచ్చరించారు. 

Updated Date - 2021-10-29T09:40:20+05:30 IST