స్వగ్రామంలో మిజోరాం గవర్నర్ హరిబాబు
ABN , First Publish Date - 2021-10-29T09:22:40+05:30 IST
స్వగ్రామంలో మిజోరాం గవర్నర్ హరిబాబు
చీరాల, పొన్నూరు, అక్టోబరు 28: మిజోరాం రాష్ట్ర గవర్నర్ కంభంపాటి హరిబాబు గురువారం తన స్వగ్రామమైన ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం తిమ్మసముద్రం వచ్చారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ స్వగ్రామానికి రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధితో దేశానికి ప్రయోజనం చేకూరుతుందని ప్రధాని మోదీ భావిస్తున్నారని చెప్పారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో పనిచేస్తోందని, దీనిలో తన వంతు బాధ్యత నిర్వర్తిస్తున్నానని చెప్పారు. కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, ఎస్పీ మల్లిక గర్గ్ గవర్నర్‌కు స్వాగతం పలికారు.
పొన్నూరులో శివప్రదాదేవికి పరామర్శ
గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణం నిడుబ్రోలులోనూ కంభంపాటి హరిబాబు దంపతులు పర్యటించారు. దివంగత కేంద్ర మాజీ మంత్రి పాములపాటి అంకినీడు ప్రసాదరావు స్వగృహనికి విచ్చేసిన గవర్నరు హరిబాబు దంపతులు ప్రసాదరావు సతీమణి శివప్రదాదేవిని పరామర్శించారు. హరిబాబుకు శివప్రదాదేవి స్వయానా అత్తగారు. వారి కుటుంబ సభ్యుల క్షేమ సమాచారాన్ని గవర్నరు దంపతులు అడిగితెలుసుకున్నారు.