MP Vijayasai కి నల్గొండ SP స్ట్రాంగ్ కౌంటర్..!

ABN , First Publish Date - 2021-10-29T08:25:48+05:30 IST

MP Vijayasai కి నల్గొండ SP స్ట్రాంగ్ కౌంటర్..!

MP Vijayasai కి నల్గొండ SP స్ట్రాంగ్ కౌంటర్..!

  • గంజాయి ఆపరేషన్‌పై అసత్య ప్రచారం తగదు
  • విజయసాయికి నల్గొండ ఎస్పీ రంగనాథ్‌ హితవు

నల్లగొండ, అక్టోబరు 28: (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఆంధ్రా-ఒడిసా సరిహద్దులో తాము చేపట్టిన గంజాయ్‌ ఆపరేషన్‌పై అసత్య ప్రచారం తగదని ఏపీ ఎంపీ విజయసాయి రెడ్డికి నల్లగొండ ఎస్పీ ఏవీ రంగనాథ్‌ హితవు పలికారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పోలీసు విధులను రాజకీయాలతో ముడిపెట్టవద్దని కోరారు. తెలంగాణ సీఎం ఆదేశాలతో గంజాయి విక్రయాలపై స్పెషల్‌డ్రైవ్‌లు చేపడుతున్నామన్నారు. ఏవోబీ నుంచి రవాణా అవుతున్న గంజాయిపై నల్లగొండ జిల్లాల్లో జరిపిన తనిఖీల సందర్భంగా 35 కేసులు నమోదు చేశామని గుర్తుచేశారు. వీటి దర్యాప్తులో భాగంగా.. 17 బృందాలతో ‘ఆపరేషన్‌ గాంజా’ చేపట్టామన్నారు.


ఏవోబీలో ఆపరేషన్‌పై విశాఖ రూరల్‌ జిల్లా ఎస్పీ కృష్ణారావు, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌ బాబుతో మాట్లాడామని వివరించారు. నల్లగొండ బృందాలు రెండు రోజులపాటు వైజాగ్‌ రూరల్‌ జిల్లాలోని పోలీసు గెస్ట్‌హౌ్‌సలోనే ఉన్నాయన్నారు. ఏపీ పోలీసుల పూర్తి సహకారంతోనే ఈ ఆపరేషన్‌ను చేపట్టామన్నారు. ‘‘నల్లగొండ జిల్లా పోలీసులు ప్రాణాలకు తెగించి ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు.


ఈ నెల 17న చింతపల్లి పీఎస్‌ పరిధిలోని లంబసింగిలో గంజాయి ముఠాల దాడి నుంచి తప్పించుకునేందుకు ఆత్మరక్షణకు కాల్పులు జరిపాం. వెయ్యి కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నాం’’ అని వెల్లడించారు. ఏపీలోని రాజకీయ పార్టీలు వాటి స్వార్థం కోసం పోలీసులను, తనను లాగడం సరికాదన్నారు. తమపరిధిలోని కేసుల్లో గంజాయి స్మగ్లర్లు ఏవోబీలో ఉన్నా.. జమ్మూకశ్మీర్‌లో ఉన్నా.. పట్టుకుని చట్టం ముందు దోషులుగా నిలబెడతామని స్పష్టం చేశారు.

Updated Date - 2021-10-29T08:25:48+05:30 IST