భారత్‌ విశ్వగురువు

ABN , First Publish Date - 2021-10-29T08:20:10+05:30 IST

భారత్‌ విశ్వగురువు

భారత్‌ విశ్వగురువు

సామాన్యులకు వేదవిజ్ఞాన ఫలాలు అందాలి

ఆ బాధ్యత వేద విశ్వవిద్యాలయం తీసుకోవాలి

శ్రీవేంకటేశ్వర వేద వర్సిటీ స్నాతకోత్సవంలో గవర్నర్‌


అమరావతి, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): సామాజిక పరిస్థితులు, జ్ఞానం, బోధనల ఫలితంగా మనదేశం ప్రపంచ వేదికపై విశ్వగురువుగా గౌరవం పొందుతోందని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ అన్నారు. అలాగే గొప్ప వారసత్వం, సహజ వనరులు, సైనిక బలం వల్ల ప్రపంచంలో సూపర్‌ పవర్‌గా ఆవిర్భవించిందని పేర్కొన్నారు. తిరుపతి వేదికగా శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం 6వ స్నాతకోత్సవంలో గురువారం విజయవాడలోని రాజ్‌భవన్‌ నుంచి వెబినార్‌ విధానంలో గవర్నర్‌ పాల్గొన్నారు. భారతీయులు ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జనకు ప్రాధాన్యం ఇస్తూ వచ్చారని, ప్రాపంచిక వ్యవహారాల పట్ల ఆసక్తి చూపలేదని వివరించారు. భారతీయ వేదాలు అంతర్జాతీయ సౌభ్రాతృత్వం, సమానత్వం, సంపద సమ పంపిణీని ప్రబోధించాయన్నారు. గతంలో భారతావని గణితం, జ్యోతిష్యం, వాణిజ్యం, ఆర్థిక శాస్త్రం, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతో ముందంజలో ఉండేదని చెప్పారు. అనేక శతాబ్ధాల తర్వాత ఇప్పటికి కౌశిక సూత్రం, వరాహమిహిరుని బృహత్‌ సంహిత, భరద్వాజ విమాన శాస్త్ర గ్రంథాలు మనకు గర్వకారణంగా నిలిచాయన్నారు. సాంస్కృతిక వారసత్వ సంపదకు సంరక్షకులుగా విశ్వవిద్యాలయాలు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ప్రత్యేకించి ప్రపంచ సంక్షేమానికి నాంది పలుకుతూ, మహిమాన్వితమైన భారతీయ సాహిత్యం, సంస్కృతిని ప్రతిష్టించే వేద విశ్వవిద్యాలయంలో ఉత్తీర్ణులైన వారంతా తమ బాధ్యతలు గుర్తించుకుని వ్యవహరించాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో వేదాలు, సంబంధిత సాహిత్యం ఔచిత్వాన్ని నొక్కి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. వైదిక విశ్వవిద్యాలయం ఈ రంగంలో సాధించిన అఖండమైన ఆలంబనతో వినూత్న ఆవిష్కరణలకు మార్గం చూపవచ్చన్నారు. విజ్ఞానం ‘మౌఖిక ప్రసారం’ భారతదేశ సంప్రదాయం ప్రత్యేక లక్షణమన్నారు. వేద విశ్వవిద్యాలయం ఈ సంప్రదాయాన్ని కాపాడుతూ, మౌఖిక జ్ఞాన ప్రసార వ్యవస్థను పటిష్టం చేయడం అభినందనీయమన్నారు. ఈ పరిణామం ఫలితంగానే కొన్ని వేద గ్రంథాలు సజీవంగా ఉన్నాయన్నారు. వేద విజ్ఞాన ఫలాలు సామాన్యులకు అందించే బాధ్యతను వేద విశ్వవిద్యాలయం తీసుకోవాలని గవర్నర్‌ పిలుపునిచ్చారు. విశ్వవిద్యాలయం సాంప్రదాయ గ్రంథాలతో పాటు గణితం వంటి వేదశాస్త్రాలను తమ పాఠ్యాశాల్లో చేర్చడం శుభపరిణామమన్నారు. పరిశోధకులు డాక్టరేట్‌ డిగ్రీల కోసం వేదశాస్త్రాల అంశాలను ఎంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాజ్‌భవన్‌ నుంచి గవర్నర్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌పీ సిసోడియా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-29T08:20:10+05:30 IST