ఆర్యవైశ్యులకే సత్రాల నిర్వహణ బాధ్యతలు

ABN , First Publish Date - 2021-10-29T08:18:55+05:30 IST

ఆర్యవైశ్యులకే సత్రాల నిర్వహణ బాధ్యతలు

ఆర్యవైశ్యులకే సత్రాల నిర్వహణ బాధ్యతలు

నిర్ణయం తీసుకున్న కేబినెట్‌: మంత్రి వెలంపల్లి


అమరావతి, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): దేవదాయ శాఖ అధీనంలో ఉన్న శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరీ అమ్మవారి సత్రాలు, అన్నదాన సత్రాలను ఆర్యవైశ్య సంఘాలకే అప్పగించనున్నట్లు మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ చెప్పారు. ఈ మేరకు మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. గురువారం అమరావతి సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో వైఎస్సార్‌ హయాంలో ఈ సత్రాలకు కొన్ని మినహాయింపులు ఇచ్చారని, ఇప్పుడు వాటి అమ్మకం మినహా మిగిలిన అన్ని మినహాయింపులతో ఆర్యవైశ్యులకే సత్రాల నిర్వహణ బాధ్యతలు అప్పగించేలా జగన్‌ నిర్ణయం తీసుకున్నారని వివరించారు. సొంత నిధులతో నిర్మించుకున్న దేవాలయాలు, సత్రాల నిర్వహణను వారికే అప్పగించడం సమంజసమనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. హిందూ ధర్మాన్ని కాపాడటానికే విశాఖ శారదా పీఠానికి భూ కేటాయింపులు చేశారని, అనంతపురంలో గణపతి సచ్చిదానందస్వామి ఆశ్రమానికి 17ఎకరాలు కేటాయించనున్నట్లు మంత్రి తెలిపారు. గతంలో చినజీయర్‌ స్వామికి కూడా భూములు కేటాయించామన్నారు. ధార్మిక, ధర్మ ప్రచార సంస్థలకు భూములివ్వడంపై అపార్థాలు తీయడం తగదని మంత్రి సూచించారు. 

Updated Date - 2021-10-29T08:18:55+05:30 IST