వైఎస్‌ఆర్ పురస్కారాల ప్రదానోత్సవానికి రండి
ABN , First Publish Date - 2021-10-29T08:17:15+05:30 IST
వైఎస్‌ఆర్ పురస్కారాల ప్రదానోత్సవానికి రండి
గవర్నర్ దంపతులకు జగన్ దంపతుల ఆహ్వానం
విశ్వభూషణ్‌కు దీపావళి శుభాకాంక్షలు
అమరావతి, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా నవంబరు ఒకటోతేదీన తలపెట్టిన వైఎ్‌సఆర్ జీవన సాఫల్య పురస్కారాల ప్రదానానికి ముఖ్యఅతిథిగా హాజరు కావాలని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ దంపతులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి దంపతులు ఆహ్వానించారు. ఇందుకు గవర్నర్ సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. గురువారం రాజ్‌భవన్‌లో గవర్నర్ దంపతులను సీఎం దంపతులు కలిశారు. వచ్చే నెల 4వ తేదీన దీపావళి పర్వదినం సందర్భంగా ముందస్తుగా శుభాకాంక్షలు తెలియజేశారు. వైఎ్‌సఆర్ జీవన సాఫల్య పురస్కారాల ప్రదానోత్సవానికి రావాలని కోరగా.. సదరు అవార్డుల ఎంపిక విధానంపై గవర్నర్ ఈ సందర్భంగా ఆరా తీశారని రాజ్‌భవన్ ఓ ప్రకటనలో వెల్లడించింది. కాగా.. రాష్ట్రంలో చోటు చేసుకున్న తాజా పరిణామాల నేపథ్యంలోనే గవర్నర్‌ను జగన్ కలిశారని ప్రచారం జరిగింది. గంజాయి, మాదక ద్రవ్యాల నిరోధానికి ప్రభుత్వం కృషి చేస్తోందని.. ఇందుకు సంబంధించి ఇటీవల జాతీయ స్థాయిలో వెల్లడించిన నివేదికలను గురించి సీఎం వివరించినట్లు తెలిసింది. అదేవిధంగా టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి చేసిన వ్యాఖ్యలు.. దానికి ప్రతిస్పందనగా టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ అభిమానుల దాడి గురించీ వివరణ ఇచ్చినట్లు చెబుతున్నారు. నవంబరులో శాసనసభ సమావేశాలు నిర్వహించాలని అనుకుంటున్నామని గవర్నర్‌కు సీఎం తెలియజేశారు.