పోకిరివి.. నీతో పెళ్లా అన్నందుకే!
ABN , First Publish Date - 2021-10-28T08:47:03+05:30 IST
పోకిరివి.. నీతో పెళ్లా అన్నందుకే!

- ప్రియుడి ఆగ్రహం.. ప్రేయసిని గొంతుకోసి హత్య
- పథకం ప్రకారం ఆమె నిద్రలో ఉండగా ఘాతుకం
- స్టాఫ్‌నర్స్ నాగచైతన్య హత్య కేసులో నిందితుడి అరెస్టు
హైదరాబాద్ సిటీ, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): స్టాఫ్‌నర్స్ నాగచైతన్య అనుమానాస్పద మృతికేసు మిస్టరీ దాదా పు వీడింది. అనుమానించినట్లుగానే ప్రియుడు కొట్టిరెడ్డే నిందితుడు అని తేలింది. తాను పెళ్లికి నిరాకరించడంతో ఆమె క్షణికావేశంలో గొంతు కోసుకొని చనిపోయిందని పోలీసుల ఎదుట అతడు చెప్పింది కట్టుకథ అని విచారణలో తేలిపోయింది. రెండ్రోజులు ఆమెతో కలిసి లాడ్జి గదిలో ఉన్న అతడే ఆమెను దారుణంగా హత్యచేశాడని తేలింది. తనతో పెళ్లికి ఆమె నిరాకరించడంతోనే మెడపై కొత్తితో పొడిచి చంపినట్లు విచారణలో కోటిరెడ్డి చెప్పాడు. ‘పనీపాటా లేకుండా పోకిరీగా తిరుగుతున్నావు.. నిన్ను పెళ్లి చేసుకోను. ఏదైనా పని చేసుకో. అప్పుడు ఆలోచిస్తా’ అని ఆమె తేల్చి చెప్పడంతో ఆగ్రహానికి గురై అతడు ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు విచారణలో తేల్చారు.
ఏపీలోని ప్రకాశంజిల్లా కరవాడి ప్రాంతానికి చెందిన నాగచైతన్యకు తల్లిదండ్రులు చనిపోయారు. సవతి తల్లి సంరక్షణలో ఉంది. హైదరాబాద్‌లోని నల్లగండ్ల సిటిజన్ ఆస్పత్రిలో ఆంకాలజీ విభాగంలో ఆమె స్టాప్‌నర్సుగా పనిచేస్తోంది. గుంటూరు జిల్లాకు చెందిన కోటిరెడ్డి ఒంగోలులో మెడికల్ రిప్రెజెంటేటివ్‌గా పనిచేసేవాడు. హైదరాబాద్‌కు రాక ముందు నాగచైతన్య అదే ప్రాంతంలో స్టాఫ్‌నర్సుగా పనిచేయడంతో కోటిరెడ్డితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఇది ప్రేమగా మారింది. నాగచైతన్య హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత కోటిరెడ్డి ఉద్యోగం వదిలేసి హైదరాబాద్‌కు మకాం మార్చాడు.
ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఖాళీగా తిరుగుతున్నాడు. వీలున్నప్పుడల్లా సిటిజన్ ఆస్పత్రికి వచ్చి నాగచైతన్య వద్ద పెళ్లి ప్రస్తావన తెచ్చేవాడు. నువ్వు ఏదైనా ఉద్యోగం చూసుకో లేదంటే పెళ్లి చేసుకోను అంటూ నాగచైతన్య తెగేసి చెప్పేది. దీంతో ఆమెను పెళ్లికి ఒప్పించాలి లేదంటే చంపేయాలనే పథకంతో కోటిరెడ్డి ఈనెల 23న సిటిజన్ ఆస్పత్రికి వెళ్లాడు. నమ్మకంగా మాట్లాడి నాగచైతన్యను నల్లగండ్లలోని ఓ లాడ్జికి తీసుకెళ్లాడు. రెండ్రోజులు ఇద్దరూ అక్కడే ఉన్నారు. పథకంలో భాగంగా సూపర్ మార్కెట్‌లో కత్తిని కొనుగోలు చేసి ఆమెకు తెలియకుండా గదిలో ఉంచాడు. రెండ్రోజుల తర్వాత రాత్రి మందు తాగి, బిర్యానీ తిన్నాక ఇద్దరి మధ్య పెళ్లి విషయం చర్చకు వచ్చింది. కోటిరెడ్డిని పెళ్లి చేసుకోవడానికి నాగచైతన్య ఒప్పుకోలేదు.
‘నువ్వు వేరే వాళ్లతో చనువుగా ఉంటున్నావు.. అందుకే నాతో పెళ్లి వద్దంటున్నావు’ అంటూ ఆమెతో కోటిరెడ్డి వాగ్వాదానికి దిగాడు. ‘నువ్వు పోకిరీగా తిరుగుతున్నావ్ అందుకే చేసుకోను’ అని నాగచైతన్య, చీవాట్లు పెట్టింది. అప్పటికి కూల్‌గా ఉన్న కోటిరెడ్డి, ఆమె నిద్రలోకి జారుకున్నాక తెల్లవారుజామున 3 గంటలకు కత్తితో నాగచైతన్యను గొంతుకోసి హత్య చేశాడు. ఆ తర్వాత గదిలోనే ఉరేసుకోవాలని లేదంటే పొడుచుకోవాలని ప్రయత్నించాడు. ధైర్యం సరిపోక కడుపులో, మెడ బాగంలో కొద్దిగా పొడుచుకున్నాడు. మధ్యాహ్నం 12 గంటలకు మెడకు టవల్ చుట్టుకొని గదికి తాళం వేసి ఒంగోలుకు పారిపోయాడు.