రుషికొండలో పర్యావరణ విధ్వంసం

ABN , First Publish Date - 2021-10-28T08:38:11+05:30 IST

రుషికొండలో పర్యావరణ విధ్వంసం

రుషికొండలో పర్యావరణ విధ్వంసం

తెలుగుదేశం పార్టీ ఆగ్రహం.. భారీ అందోళన


విశాఖపట్నం, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): ‘‘రుషికొండలో మంచి ఆదాయం తెస్తున్న హరిత రిసార్ట్స్‌ను కూల్చివేసి ఎవరి కోసం భారీ నిర్మాణాలు చేపడుతున్నారో ప్రకటించాలి. దాని సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను ప్రజలకు అందుబాటులో ఉంచాలి’’ అని తెలుగుదేశం పార్టీ డిమాండ్‌ చేసింది. పర్యాటకం పేరుతో అనుమతులు లేకుండా పనులు చేపట్టడం, గ్రీన్‌బెల్ట్‌ ధ్వంసం, బస్టాపుల కూల్చివేత తదితర అంశాలపై రుషికొండలో బుధవారం ఆ పార్టీ నేతలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు పల్లా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణమూర్తి,  పీలా గోవింద్‌ మాట్లాడారు. ‘‘కేంద్ర పర్యావరణ శాఖ, గనుల శాఖ అనుమతులు లేకుండా ప్రభుత్వం పనులు చేపడుతోంది. సీఎం కార్యాలయం కోసమే నిర్మాణాలు చేపడుతున్నారన్న అనుమానాలను నివృత్తి చేయాలి. అంతవరకు పనులు నిలిపివేయాలి. ఎంపీ నిధులతో నిర్మించిన బస్టా్‌పను కూల్చివేయడం సరికాదు. విశాఖపట్నాన్ని ధ్వంసం చేయడమే ధ్యేయంగా జగన్‌ ప్రభుత్వం పనిచేస్తోంది. హరిత రిసార్ట్స్‌ను కూల్చివేసి, సీఎం కోసం క్యాంపు కార్యాలయం, గెస్ట్‌హౌస్‌, విజయసాయిరెడ్డి కుమార్తెకు బహుమతిగా క్రూయిజ్‌ టెర్మినల్‌ నిర్మించడానికి యుద్ధప్రాతిపదికన పనులు చేస్తున్నారు. విశాఖ జిల్లాలో దేవుడి భూములను కూడా అధికార పార్టీ నేతలు కాజేస్తున్నారు’’ అని వారు ఆరోపించారు. ఈ ఆందోళనలో పాల్గొనకుండా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబును హౌస్‌ అరెస్ట్‌ చేశారు. టీడీపీ ఆందోళనను అడ్డుకోవడానికి పోలీసులు భారీగా మొహరించారు.

Updated Date - 2021-10-28T08:38:11+05:30 IST