ఉక్కు పరిరక్షణకు మహిళా గర్జన
ABN , First Publish Date - 2021-10-28T08:30:52+05:30 IST
ఉక్కు పరిరక్షణకు మహిళా గర్జన

భారీ ర్యాలీ.. వందలాదిగా పాల్గొన్న మహిళలు
హాజరైన వివిధ సంఘాల ప్రతినిధులు
ఉక్కుటౌన్‌షిప్ (విశాఖపట్నం), అక్టోబరు 27: స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ మహిళా విభాగం ఆఽధ్వర్యంలో బుధవా రం వందలాది మందితో మహిళా గర్జన నిర్వహించారు. స్టీల్‌ప్లాంట్‌లోని తెలుగుతల్లి విగ్రహం నుంచి పరిపాలన భవనం వరకు మహిళలు ర్యాలీ జరిపి... ‘సేవ్ స్టీల్‌ప్లాంట్’, ‘విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’ నినాదాలతో హోరెత్తించారు. ప్లాంట్‌ను ప్రైవేటీకరించరాదని, ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. తెలుగుతల్లి విగ్రహం వద్ద ర్యాలీని గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ప్రారంభించారు.
‘కార్పొరేట్ల ప్రయోజనాల కోసమే’
ఈ ర్యాలీలో పాల్గొన్న ఐద్వా రాష్ట్ర నాయకురాలు ప్రభావతి మాట్లాడుతూ.. దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా కార్పొరేట్లకు అప్పగించేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. బంగారు బాతు లాంటి విశాఖ స్టీల్‌ప్లాంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. టీడీపీ విశాఖ పార్లమెంట్ కమిటీ మహిళా అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దిగొచ్చేవరకు పోరాటాలు కొనసాగిస్తామని స్పష్టంచేశారు.