ఏపీలో పాలన ఉందా?

ABN , First Publish Date - 2021-10-28T08:10:15+05:30 IST

ఏపీలో పాలన ఉందా?

ఏపీలో పాలన ఉందా?

ఒక్క పథకమైనా ప్రజలకు చేరుతోందా?

మద్యం రేట్లు పెంచితే తాగేవారు తగ్గుతారా?

పెన్షన్‌ డబ్బులన్నీ మందు షాపులకే

అసలెన్ని రాజధానులున్నాయి?

కేంద్రం నిధులు రాకుంటే.. సీఎం కారు పెట్రోలుకు కూడా నిధుల్లేవు

సర్కారుపై టీ-బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ ధ్వజం


బద్వేలు, అక్టోబరు 27: ‘రాష్ట్రంలో రాజధాని ఎక్కడ ఉందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. రాజధాని ఒకటా, రెండా, మూడా.. కడపనే కొత్త రాజధాని చేస్తారా.. తెలియడం లేదు’ అని తెలంగాణ దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. కేంద్రం నిధులు రాకుంటే సీఎం జగన్‌ కారుకు పెట్రోలుకు కూడా ఈ ప్రభుత్వం దగ్గర నిధులు లేవని ఎద్దేవాచేశారు. బద్వేలు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి తరఫున ప్రచారానికి వచ్చిన ఆయన.. మంగళవారం రాత్రి రాజుపాళెం - అప్పరాజుపేట మార్గంలో రోడ్‌షోలో మాట్లాడారు. జగన్‌పై విమర్శలు గుప్పించారు. ‘అధికారంలోకి తెస్తే ఆ దేవుని కొడుకుగా సంపూర్ణ మద్యనిషేధం చేస్తామని చెప్పాడు. సంపూర్ణ మద్యనిషేధం చేస్తామని చెప్పి.. రూ.100 ఉన్న బీరును 200 చేశాడు. మద్యం రేటు పెరిగితే తాగే వాళ్లు మానుకుంటారని చెప్పడం అవివేకం. వచ్చే పెన్షన్‌ డబ్బులు కూడా మద్యం షాపులకే పోతున్నాయి. ఊరిలో ఏం దొరుకుతాయో దొరకవో తెలియదు కానీ ఇక్కడ మాత్రం ఎక్కడ చూసినా చిన్న సీసాలు, పెద్ద సీసాలు దొరుకుతున్నాయి. ఇదేనా దేవుడి పాలన అంటే. ఈయనో జీవో తెస్తాడు.. అది కోర్టు కొట్టేస్తుంది. ఈయనో మాట చెబుతాడు. ఎవరో కోర్టుకు పోతారు. అక్కడ కొట్టేస్తారు. అసలిక్కడ పరిపాలన అనేది ఉందా? నీకు సలహాదార్లు ఉన్నారా? నీవు తెచ్చిన ఒక్క పథకమైనా ప్రజలకు చేరుతోందా? ఒక్కసారి గుండెల మీద చేయి వేసుకుని ఆలోచించాలి. కేంద్రం ఉపాధి హామీ పథకం కింద ఇచ్చే నిధులతో రాష్ట్ర ప్రభుత్వం సోకులు చేసుకుంటోంది. సొమ్ములు కేంద్రానివి, ప్రచారం చేసుకునేది జగన్‌. ప్రతిపక్షంలో ఉన్నపుడు కోడికత్తులు కనిపించిన జగన్‌కు అధికారంలోకి రాగానే ఏ కత్తులు కనిపించాయో కానీ ప్రజలకు మాత్రం బాగా దూరమయ్యాడు. ప్రజలను కలవడు, ఎమ్మెల్యేలను కలవడు, మంత్రులను కలవడు, రాష్ట్ర కేబినెట్‌లో ఏం జరుగుతోందో ఎవరికీ తెలియదు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బీజేపీ నాయకులను, కార్యకర్తలను ఎత్తుకుని పోవాలని చూడడం బాధాకరమైన విషయం. మీలాగా మేమూ బెదిరించాలనుకుంటే మీ దగ్గర 13 జిల్లాల పోలీసులు మాత్రమే ఉన్నారు. మా దగ్గర స్పెషల్‌ పోలీసులు, సీఆర్‌పీఎఫ్‌ 30 రకాల పోలీసులున్నారు. జగన్మోహన్‌రెడ్డీ గుర్తు పెట్టుకో.. బెదిరిస్తే భయపడే వారెవరూ లేరు’ అని స్పష్టం చేశారు.

Updated Date - 2021-10-28T08:10:15+05:30 IST