సబ్సిడీ నిధులివ్వకుంటే చంపేస్తా!
ABN , First Publish Date - 2021-10-28T07:58:19+05:30 IST
సబ్సిడీ నిధులివ్వకుంటే చంపేస్తా!

పరిశ్రమల శాఖ జీఎంపై ఆ శాఖ సలహాదారు దౌర్జన్యం
కడప జిల్లా అధికార వర్గాల్లో కలకలం
కడప, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): కడప జిల్లా పరిశ్రమల శాఖ జీఎం చాంద్‌బాషాను ఆ శాఖ సలహాదారుడు రాజోలి వీరారెడ్డి చంపుతానంటూ బెదిరించిన ఘటన అధికార వర్గాల్లో కలకలం రేపుతోంది. ఓ పరిశ్రమకు సంబంధిం చి సబ్సిడీ చెల్లింపులో ఈ వివాదం జరిగినట్లు తెలిసింది. 2018 ఏప్రిల్ 2న ఎన్.కృష్ణారెడ్డి అనే వ్యక్తి రూ.8.17 కోట్ల వ్యయంతో భార తీ ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్‌ను కడప ఇండస్ర్టియల్ ఎస్టేట్‌లో ఏర్పాటు చేశారు. ఈ పరిశ్రమకు సబ్సిడీ రూపేణా రూ.54,53,654 రావాల్సి ఉంది. ఈ నిధుల కోసం కృష్ణారెడ్డి పలుమార్లు జీఎం కార్యాలయానికి వచ్చారు. ఈ నిధుల విషయమై పరిశ్రమల శాఖ సలహాదారుడు రాజోలి వీరారెడ్డి బుధవారం కడపలోని పరిశ్రమల శాఖ కార్యాలయానికి వెళ్లారు. ‘సబ్సిడీ నిధుల విడుదలలో ఎందుకు జా ప్యం చేస్తున్నావు. మాకు డబ్బులు వద్దూ.. ఏమీ వద్దూ... నిన్ను ఏసేస్తాం.. చంపుతాం’ అంటూ దౌర్జన్యానికి దిగినట్లు జీఎం చాంద్‌బాషా ‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.
సీఎంను కించపరిచారు: వీరారెడ్డి
ఎస్టేట్‌లో ఎన్.కృష్ణారెడ్డి భారతీ ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. అతడికి ప్రభుత్వం నుంచి సుమారు రూ.60 లక్షలు సబ్సిడీ రావాలి. దీనికోసం జీఎం రూ.4 లక్ష లు లంచం అడిగారు. తొలివిడతగా కృష్ణారెడ్డి రూ.లక్ష ఇచ్చారు. అయినా ప్రభుత్వానికి తప్పుడు నివేదిక పంపించారు. దీనిపై అడిగేందుకు వెళ్లగా ‘జగన్ దగ్గర డబ్బులేమీ లేవు. సబ్సిడీ ఎప్పుడిస్తారేంటి?’ అంటూ సీఎంను కించపరిచేలా మాట్లాడారు. దీంతో నేను గట్టిగా అరిచా. అంతేతప్ప చంపుతానని బెదిరించలేదు’ అని వీరారెడ్డి చెప్పారు.