అటెండర్‌పై సబ్‌రిజిస్ట్రార్ లైంగిక వేధింపులు
ABN , First Publish Date - 2021-10-25T09:14:42+05:30 IST
అటెండర్‌పై సబ్‌రిజిస్ట్రార్ లైంగిక వేధింపులు

దిశ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు.. కేసు నమోదు
ఏలూరు క్రైం, అక్టోబరు 24: మహిళా అటెండర్‌పై సబ్ రిజిస్ట్రార్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆయన వేధింపులు భరించలేక ఆ బాధితురాలు దిశ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో సబ్ రిజిస్ట్రార్‌పై కేసు నమోదు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఆర్‌ఆర్ పేటకు చెందిన మహిళ (37)కు కారుణ్య నియామకంలో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో అటెండర్‌గా ఉద్యోగం వచ్చింది. ఆమె కొవ్వూరు సబ్ డివిజన్ కార్యాలయంలో పనిచేస్తోంది. సాధారణ బదిలీల్లో భాగంగా ఏడాది జూన్ నెలలో సబ్ రిజిస్ట్రార్ డి.జయరాజు ఏలూరు జిల్లా రిజిస్ట్రా ర్ కార్యాలయానికి వచ్చాడు. బాధిత మహిళ డిప్యుటేషన్‌పై ఇదే కార్యాలయంలో అటెండర్‌గా పనిచేస్తోంది. భర్తలేని ఆమెను తన కోరిక తీర్చాలంటూ జయరాజు కొన్నాళ్లుగా లైంగికంగా వేధిస్తున్నాడు. తన మాట వినకపోతే డిప్యుటేషన్ రద్దు చేయిస్తానని బెదిస్తున్నాడు. దీనిపై ఆమె ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో బాధితురాలు ఏలూరులోని దిశ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దిశ డీఎస్పీ కేవీ సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు వెంటనే సబ్ రిజిస్ట్రార్ జయరాజుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.