కల్లబొల్లి కబుర్లతో కోట్లు కొట్టేశారు
ABN , First Publish Date - 2021-10-25T08:49:15+05:30 IST
కల్లబొల్లి కబుర్లతో కోట్లు కొట్టేశారు

‘వర్ధన్’ సొసైటీ ఘరానా మోసం
కర్నూలులో 20 కోట్లకు పైగా టోకరా
ఆత్మకూరు కేంద్రంగా వసూళ్లు
పోలీసుల వద్దకు బాధితులు క్యూ
నిర్వాహకులకు అధికార పార్టీ నేతల అండ
జగనన్న అంబులెన్స్‌లకు 10 లక్షల విరాళం
ప్రారంభోత్సవంలో ఇది ‘శిల్పా బ్యాంక్’ అన్న ఎమ్మెల్యే
మీ సొమ్ము డిపాజిట్ చేస్తే ఏడాదిలో రెట్టింపు ఇస్తాం.. బైకులు, కార్ల కొనుగోలుపై 50 శాతం సబ్సిడీ రుణాలు ఇస్తాం.. అంటూ ఆశ చూపారు. వారికి మద్దతుగా అధికార పార్టీ నాయకులూ ఆర్భాటంగా ప్రచారం చేశారు. దీంతో నిజమేనని నమ్మిన ప్రజలు.. రూపాయి, రూపాయి పోగేసి దాచుకున్న సొమ్మును వారి చేతుల్లో పెట్టారు. డిపాజిట్ చేయడమే కానీ వెనక్కి వచ్చింది లేదు. ఆ సొమ్ము ఎటు పోయిందో తెలియదు. కర్నూలు జిల్లా ప్రజలు నిలువునా మోసపోయారు. నిర్వాహకులు దాదాపు రూ.20 కోట్లకు పైగా టోకరా వేసినట్టు సమాచారం.
(కర్నూలు-ఆంధ్రజ్యోతి)
గుంటూరు జిల్లా తాడేపల్లిలో ప్రధాన కార్యాలయం ఉన్న వర్ధన్ మల్టీ స్టేట్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్.. గతేడాది నవంబరు 7న కర్నూలు జిల్లా ఆత్మకూరులో బ్రాంచ్‌ను ప్రారంభించారు. ఈ బ్రాంచ్‌కు మహేశ్ కుమార్ అలియాస్ జాషువా ప్రధాన నిర్వాహకుడిగా వ్యవహరించారు. అధికార పార్టీ నంద్యాల పార్లమెంటు నియోజకవర్గ ఎస్సీ సెల్ ప్రధాన నాయకుడు బాలన్న సహకారంతో ఈ బ్రాంచ్‌ను ఏర్పాటు చేశారు. శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఈ సొసైటీని ప్రారంభించారు. బాలన్నకు ఉన్న పరిచయాల కొద్దీ సొసైటీ స్థాపనకు ఎమ్మెల్యే పూర్తి సహకారం అందించారు. బాలన్న కూతురు సంస్థ బ్రాంచ్ మేనేజర్‌గా పనిచేసినట్లు తెలుస్తోంది. ఆమె ప్రస్తుతం సివిల్ సప్లయ్స్ రాష్ట్ర కార్పొరేషన్‌కు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆ బ్రాంచ్ ప్రారంభోత్సవ సమయంలో అది ఎమ్మెల్యేదే అనే స్థాయిలో ప్రచారం చేశారు. దీంతో జిల్లా వాసులు నమ్మారు. ఆ రోజు నుంచి జిల్లాలోని డోన్, వెలుగోడు, పత్తికొండ, నంద్యాల, ఆత్మకూరు, పెసరవాయి తదితర ప్రాంతాల్లో ఏజెంట్ల ద్వారా ఒక్కొక్కరి నుంచి రూ.లక్షల్లో డిపాజిట్లు వసూలు చేశారు. శ్రీశైలం నియోజకవర్గ పరిధిలోని ఆత్మకూరు కేంద్రంగా కొన్ని నెలలుగా ఈ తతంతంగా సాగింది. గ్యారెంటీగా డిపాజిటర్లకు చెక్కులను ఇచ్చారు. రెండు, మూడు నెలల్లోనే రూ.20 కోట్లకు పైగా వసూలు చేసి ఉండొచ్చని అంచనా.
76 మంది బాధితుల ఫిర్యాదు
ఆ తర్వాత రాను రాను సొసైటీ మోసాలు వెలుగులోకి వచ్చాయి. డిపాజిట్ చేసిన వారు సొసైటీ ఇచ్చిన చెక్‌లు బ్యాంకులో వేయగా.. సదరు సంస్థ అకౌంట్లో డబ్బు లేవని అధికారులు చెప్పారు. సొసైటీ ఉద్యోగులను అడిగితే.. ఇదిగో, అదిగో అంటూ కాలయాపన చేశారు. దీంతో తాము మోసపోయామని బాధితులు గ్రహించారు. అధికార పార్టీ నాయకుల బెదిరింపులకు భయపడి ఫిర్యాదు చేయడానికి వెనుకంజ వేశారు. చావు తప్ప గత్యంతరం లేదనుకున్న కొందరు ఇటీవల ఎస్పీ సుధీర్‌కుమార్ రెడ్డిని కలిసి వరుస ఫిర్యాదులు చేయడంతో మోసాలు బయటపడుతున్నాయి. డిపాజిటర్లలో స్థానిక పోలీసు అధికారి, మహానందికి చెందిన ఓ కానిస్టేబుల్ కూడా ఉన్నారు. ప్రస్తుతం 76 మంది డిపాజిటర్లు ఆత్మకూరు పోలీసులను ఆశ్రయించారు. ఈ 76 మందికి చెందిన డిపాజిట్ల విలువ రూ.1.50 కోట్ల నుంచి రూ.2 కోట్ల దాకా ఉంటుందని తెలిసింది. కేసు నమోదు చేసిన అధికారులు రహస్యంగా విచారణ చేస్తున్నారు. మూడు రోజుల క్రితం కొందరు ప్రధాన నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కాగా పలువురు బడా నాయకులు, పోలీసులు ఈ వ్యవహారం వెలుగులోకి రాకుండా కప్పిపుచ్చుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
గతంలోనూ ఇదే తరహాలో మోసం
వర్ధన్ కో-ఆపరేటివ్ సొసైటీ ప్రధాన నిర్వాహకుడిగా వ్యవహరించిన మహేశ్ కుమార్ గతంలో కూడా పలు ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడు. అనంతపురం జిల్లా గుంతకల్లులో మాయ మాటలు చెప్పి నిరుద్యోగులు, రైతుల నుంచి రూ.60 లక్షలకు పైగా వసూలు చేశాడు. కేంద్ర ప్రభుత్వ పథకం పేరిట అక్కడ స్వర్ణ భారత్ మల్టీ పర్పస్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ పేరిట ఆఫీస్ తెరిచి, విస్తృత ప్రచారం చేయించాడు. గేదె పాలు ఉత్పత్తి చేసే రైతులు రూ.70 వేలు చెల్లిస్తే నెల వ్యవధిలోనే కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా రూ.3.50 లక్షలు ఇస్తుందని నమ్మబలికాడు. దీంతో 200 మందికి పైగా రైతులు డబ్బులు కట్టారు. అలాగే ఉద్యోగాల పేరిట నిరుద్యోగుల నుంచి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకూ వసూలు చేశాడని తెలుస్తోంది. ఈ వ్యవహారంలో గుంతకల్లు టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ నకిలీ పీటీ వారెంట్ కేసులోనూ మహేశ్ నిందితుడని తెలుస్తోంది. ఆత్మకూరులోనూ అదే తరహాలో సొసైటీ ఏర్పాటు చేసి భారీగా డిపాజిట్లు వసూలు చేశాడు. ఇదిలావుండగా, జగనన్న అంబులెన్సు లకు రూ.10 లక్షల విరాళం ఇచ్చాడు.
7 లక్షలు చెల్లించాను.. న్యాయం చేయండి
చెల్లించిన సొమ్ము సంవత్సరంలో రెట్టింపు చేస్తామని, బైకులు, కార్ల కొనుగోలుపై ఏకంగా 50 శాతం సబ్సిడీ రుణాలు ఇస్తామంటూ చెప్పారు. వారి మాటలు నమ్మి గతేడాది నవంబరు 19న రూ.3 లక్షలు, నవంబరు 23, 24న మరో రూ.4 లక్షలు వర్ధన్ సొసైటీ బ్రాంచ్ మేనేజర్ డేరంగుల పుప్పేంద్రకు చెల్లించాను. గ్యారెంటీగా నాకు చెక్‌లు ఇచ్చారు. అవి బౌన్స్ అయ్యాయి. మోసపోయానని తెలుసుకున్నాను. దయచేసి నాకు న్యాయం చేయండి.
- కర్నూలు ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డికి
ఓ వ్యక్తి చేసిన ఫిర్యాదు ఇది.
ఇది శిల్పా బ్యాంకు
ఇది శిల్పా బ్యాంక్. వర్ధన్ బ్యాంక్ అంటే శిల్పా బ్యాంక్. శిల్పా బ్యాంక్ అంటే వర్ధన్ బ్యాంక్. అక్క చెల్లెమ్మలు ఎప్పటి నుంచో ఒక బ్యాంక్ పెట్టాలని అడుగుతున్నారు. ఇదే ఆ బ్యాంక్.
- సొసైటీ ప్రా రంభోత్సవ సభలో
ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి

