టీడీపీ ఆఫీస్ విధ్వంసం కేసులో ఆరుగురి గుర్తింపు
ABN , First Publish Date - 2021-10-25T08:28:19+05:30 IST
టీడీపీ ఆఫీస్ విధ్వంసం కేసులో ఆరుగురి గుర్తింపు

వైసీపీ కార్పొరేటర్ సహా ఆరుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
గుంటూరు, అక్టోబరు 24: తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై ఈ నెల 19న జరిగిన విధ్వంసం కేసులో పోలీసులు మరో ఆరుగురిని గుర్తించారు. వారిలో గుంటూరుకు చెందిన వైసీపీ కార్పొరేటర్ కూడా ఉన్నారు. ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. వారిలో విజయవాడ కృష్ణలంకలోని ఆయిల్ షాపు బజారుకు చెందిన జోగా రాజు, కృష్ణలంకలోని రామాలయం ప్రాంతానికి చెందిన షేక్ బాబు, రాణీగారితోటకు చెందిన షేక్ సైదాతోపాటు పాతగుంటూరులోని బాలాజీనగర్ 6వ లైనుకు చెందిన బంకా సూర్య సురేశ్ అలియాస్ సూర్య, ఆర్ అగ్రహారం చేపల మార్కెట్‌కు సెంటరుకు చెందిన తల్లా మోహన్ కృష్ణారెడ్డి, కేవీపీ కాలనీకి చెందిన వైసీపీ కార్పొరేటర్ కాండ్రగుంట గురవయ్య తదితరులు ఉన్నారు. ఈ కేసులో మిగిలిన నిందితులను అరెస్టు చేసేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ఆదివారం తెలిపారు. సీసీ ఫుటేజ్‌లతోపాటు వివిధ కోణాల్లో దర్యాప్తు చేసి మిగిలిన నిందితులను త్వరలోనే గుర్తిస్తామన్నారు.