చట్టాలు మట్టిపాలు!

ABN , First Publish Date - 2021-10-14T08:24:43+05:30 IST

చట్టాలు మట్టిపాలు!

చట్టాలు మట్టిపాలు!

‘గప్‌చుప్‌గా భూయజ్ఞం’లో తూట్లు

చెలరేగుతున్న అధికారం.. నిద్రపోతున్న యంత్రాంగం

భూ వినియోగ మార్పిడి లేదు.. ‘వాల్టా’ వదిలేసి చెట్ల నరికివేత

అనుమతి లేకుండా గ్రావెల్‌ తరలింపు.. కొండలూ పట్టా భూములేనట

‘ఆంధ్రజ్యోతి’ కథనంతో సంచలనం.. విచారణకు  విశాఖ కలెక్టర్‌ ఆదేశం


‘అధికారం’ చెలరేగిపోతోంది! అధికార యంత్రాంగం నిద్రపోతోంది! లేదా... నిద్రపోతున్నట్లు నటిస్తోంది. విశాఖ జిల్లాలో ఇదే జరుగుతోంది. కశింకోట మండలం విస్సన్నపేట భూముల్లో గప్‌చు్‌పగా సాగుతున్న భూయజ్ఞంపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనం సంచలనం సృష్టించింది. దీనిపై జిల్లా కలెక్టర్‌ విచారణకు ఆదేశించడంతో... ఆర్డీవో రంగంలోకి దిగారు. క్షేత్రస్థాయిలోకి వెళితే... అనేక చట్టాలకు, నిబంధనలకు నిలువునా పాతరేస్తున్న సంగతి మరింత స్పష్టంగా బయటపడింది. 


(విశాఖపట్నం/కశింకోట - ఆంధ్రజ్యోతి)

ఒక ప్రజా ప్రతినిధి, మరో కార్పొరేషన్‌ చైర్మన్‌... ఇద్దరూ కలిశారు.  అనకాపల్లి సమీపంలోని కశింకోట మండలం విస్సన్నపేట, జమాదులపాలెం గ్రామాల మధ్య రెండు నెలలుగా పదుల సంఖ్యలో జేసీబీలు, బుల్డోజర్లతో వందలాది ఎకరాల భూములు చదును చేస్తున్నారు. ఈ క్రమంలో చట్టాలు, నిబంధనలు చాపలో చుట్టి మట్టి కింద కప్పేస్తున్నారు. వ్యవసాయ భూములను ఇతర అవసరాలకు వినియోగించాలనుకుంటే విధిగా భూ వినియోగ మార్పిడి చేసుకోవాలి. ఇందుకు గ్రామ పంచాయతీలో తీర్మానం జరగాలి. అక్కడ నుంచి రెవెన్యూకు దరఖాస్తు చేయాలి. ఆ తర్వాత వీఎంఆర్‌డీఏకు పంపి ఆమోదం తీసుకోవాలి. ఇందుకు భారీగా ఫీజులు చెల్లించాలి. కానీ... విస్సన్నపేట, జమాదులపాలెం వద్ద భూములు చదును చేస్తున్న వ్యక్తులు  ఇప్పటివరకు భూ వినియోగ మార్పిడికి దరఖాస్తు చేయలేదు. ఈ విషయాన్ని కశింకోట తహసీల్దార్‌ ధ్రువీకరించారు. అయితే...  నోటీస్‌ ఇవ్వాలన్న ఆలోచన  మాత్రం ఆయనకు రాలేదు. ఆయా పంచాయతీల గ్రామ సచివాలయాల్లో ఉన్న సెక్రటరీలు, వీఆర్వోలు, సర్వేయర్‌లు కూడా దీనిపై స్పందించలేదు. పై అధికారులకు సమాచారం పంపలేదు. 


వాల్టా చట్టానికి తూట్లు

సొంత తోటలో చెట్లు కొట్టాలన్నా వాల్టా చట్టం ప్రకారం  అనుమతి తీసుకోవాలి. ఇందుకోసం  దరఖాస్తు చేసుకోవాలి. కానీ విస్సన్నపేట, జమాదులపాలెం గ్రామాల్లో వందలాది ఎకరాలు చదును చేయిస్తున్న అధికార పార్టీ పెద్దలు చెట్లు కొట్టేందుకు ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. మొత్తం 600 ఎకరాల విస్తీర్ణంలో జీడి మామిడి, ఇతర చెట్లు కొట్టేశారు. కొన్నింటిని అక్కడే గోతుల్లో పూడ్చారు. వంటచెరుకు, కలపకు పనికొస్తుందనుకునే వాటిని మాత్రం బయటకు తరలించారు. అయినా... ఎవ్వరూ, ఏ స్థాయి అధికారులూ పట్టించుకోలేదు.


గనుల శాఖ గప్‌చుప్‌

అంతా ఇంతా కాదు! అక్కడ 600 ఎకరాల విస్తీర్ణంలో భూములు చదును చేస్తున్నారు. కొండలు తవ్వుతున్నారు. కొద్దిరోజులుగా రేయింబవళ్లు పది నుంచి 20 టిప్పర్ల ద్వారా గ్రావెల్‌, రాయి ఫార్మాసిటీకి రవాణా అవుతోంది. ఒక ప్రాంతం నుంచి గ్రావెల్‌, మట్టి, రాయి తవ్వి తరలించాలంటే తప్పకుండా గనుల శాఖ అనుమతి తీసుకోవాలి. స్థానిక తహసీల్దార్‌ నుంచి ఎన్‌వోసీ తీసుకుని గనుల శాఖకు దరఖాస్తు చేస్తే... క్షేత్రస్థాయిలో పరిశీలించి అనుమతులు మంజూరు చేస్తారు. క్యూబిక్‌ మీటరుకు రూ.45 చెల్లించి పర్మిట్లు తీసుకోవాలి. ఆ తర్వాతే లారీల్లో గ్రావెల్‌, మట్టి, రాయి తరలించాలి. కానీ... విస్సన్నపేట- జమాదులపాలెం మధ్య భూమి చదును చేస్తున్న నేతలు గనుల శాఖకు దరఖాస్తు చేసుకోలేదు. మట్టి, రాయి తరలిస్తూనే ఉన్నారు. అయినా, అనకాపల్లి గనుల శాఖ ఏడీ కార్యాలయం అధికారులు కనీసం పట్టించుకోలేదు.


కొండకూ పట్టాలే!

కశింకోట మండల భూముల్లో కొండలకూ పట్టాలు పుట్టించేశారు. చుట్టూ పొలాలు ఉన్నప్పటికీ... కొండలు, గుట్టలు ప్రభుత్వానికే దక్కుతాయి. అయినా సరే... ఏకంగా 73 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కొండలను కూడా పట్టా భూములను చేసేశారు. విచిత్రంగా... బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపిన ఆర్డీవో కూడా ఆ కొండకు పట్టా ఉందని, కృష్ణా జిల్లా హనుమాన్‌ జంక్షన్‌ ప్రాంతానికి చెందిన కనుమూరి ప్రసాద్‌రాజు తదితరులు ఈ భూములను కొనుగోలు చేశారని చెప్పడం విశేషం. 


సామాన్యులైతే వదిలేస్తారా?

స్థానిక ప్రజా ప్రతినిధులు కశింకోట మండలంలో వెయ్యి ఎకరాలను సేకరించే లక్ష్యంతో పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో సుమారు 200 ఎకరాలకు రిజిస్ట్రేషన్‌ పూర్తయింది. మరో 400 ఎకరాలకు సేల్‌ డీడ్‌లు పూర్తయినట్లు సమాచారం. భూములు విక్రయించేందుకు అంగీకరించని వారిని బెదిరించి... వారి భూములున్న సర్వే నంబర్లను ‘నిషేధిత’ జాబితాలో పెడుతున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. ఇదంతా తెరవెనుక జరుగుతున్న తతంగం. దీనిని పక్కనపెడితే... వందల ఎకరాలను చదును చేస్తున్నా, భూ వినియోగ మార్పిడి జరుగుతున్నా, కొండలనూ పిండి చేస్తున్నా అధికార యంత్రాంగం ‘ఏమీ తెలియనట్లు’గా ఉండటం గమనార్హం. సామాన్యులు చిన్న ఉల్లంఘనకు పాల్పడినా మీదపడిపోయే అధికారులు ఇక్కడ ఎందుకు మౌనంగా ఉన్నారు? తెరవెనుక పెద్దలు ఉండటమే కారణమా?


సమగ్ర విచారణ: ఆర్డీవో

‘గప్‌చు్‌పగా భూ యజ్ఞం’ అనే శీర్షికతో బుధవారం ‘ఆంధ్రజ్యోతి’ ప్రధాన సంచికలో ప్రచురితమైన కథనంపై జిల్లా కలెక్టర్‌ స్పందించారు. దీనిపై వాస్తవాలు తెలుసుకోవాలని ఆదేశించడంతో రెవెన్యూ సిబ్బందితో కలిసి అనకాపల్లి ఆర్డీవో జె.సీతారామారావు   బయ్యవరం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 195/2లో భూములను (విస్సన్నపేట - జమాదులపాలెం)  పరిశీలించారు. డి-ఫామ్‌ భూములు, వాగులు, గెడ్డలు, పంటకాలువలు ఏమైనా కలుపుకొన్నారా? అన్న అంశంపై ఆరా తీశారు. అనంతరం ఆర్డీవో మాట్లాడుతూ, భూములపై సమగ్ర విచారణ జరిపి నివేదికను కలెక్టర్‌కు సమర్పిస్తామన్నారు. ఇందులో 73 ఎకరాల విస్తీర్ణంలో కొండలు ఉన్నాయని... అవీ పట్టా భూములే అని తెలిపారు. అయితే, కొండలు తవ్వేందుకు అనుమతి ఉందో లేదో మైనింగ్‌ అధికారులను అడిగి తెలుసుకుంటామన్నారు. కొండ ఎగువ ప్రాంతాల నుంచి రంగబోలు గెడ్డ రిజర్వాయర్‌లోకి నీరు వెళ్లే కాలువలు జిరాయితీ భూముల్లో ఉన్నాయని, అయినప్పటికీ ఆ కాలువలను పూడ్చేందుకు వీల్లేదని స్పష్టం చేశారు.

Updated Date - 2021-10-14T08:24:43+05:30 IST