ఏపీఎస్‌డీసీ అప్పులకు గ్యారెంటీ ఇవ్వాల్సిందే

ABN , First Publish Date - 2021-07-24T08:11:05+05:30 IST

‘‘ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అభివృద్ధి సంస్థ (ఏపీఎ డీసీ) చేసే అప్పులకు గ్యారెంటీ ఇవ్వాల్సిన అవసరం లేదని ఆర్థిక మంత్రి బుగ్గన చెప్పడం రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టించడమే

ఏపీఎస్‌డీసీ అప్పులకు గ్యారెంటీ ఇవ్వాల్సిందే

రుణాలకు కేంద్రం అనుమతి అవసరం

బుగ్గన ప్రకటన ప్రజలను తప్పుదారి పట్టించడమే

జగన్‌ అసమర్థ పాలనతో రాష్ట్రం దివాలా తీస్తోంది: యనమల


అమరావతి, జూలై 23(ఆంధ్రజ్యోతి): ‘‘ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌డీసీ) చేసే అప్పులకు గ్యారెంటీ ఇవ్వాల్సిన అవసరం లేదని ఆర్థిక మంత్రి బుగ్గన చెప్పడం రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టించడమే. అప్పులకు కేంద్రం అనుమతి కూడా అవసరం లేదని చెప్పడం విడ్డూరంగా ఉంది’’ అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. ఈ  మేరకు శుక్రవారం ఆయన ఓ ప్రకటన చేశారు. బడ్జెట్‌ అప్పులకు ఆర్టికల్‌ 293(3) కింద రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా కేంద్రం నుంచి అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. అదే సమయంలో ఎఫ్‌ఆర్‌బీఎం పరిధి (3 శాతం) దాటకూడదన్నారు. కానీ మరో 2 శాతం అదనపు రుణాల కోసం కేంద్రం కొన్ని షరతులతో అనుమతించిన మాట వాస్తవమో? కాదో? ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరారు. ‘‘ఏ కార్పొరేషన్‌ ద్వారా అయినా రుణాలు తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా గ్యారెంటీ ఇవ్వాల్సిందే. అలా ఇచ్చే గ్యారెంటీలు రాష్ట్ర ఆదాయంలో 90 శాతం మించకూడదు. కానీ మన రాష్ట్రంలో అప్పులు, వాటికిచ్చే గ్యారెంటీలు బోర్డర్‌లో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్‌ లోన్స్‌ కంటే ఆఫ్‌ బడ్జెట్‌ లోన్స్‌ చాలా ఎక్కువగా తీసుకుంది. 2019-20లో రూ.77,700 కోట్లు, 2020-21లో రూ.91,000 కోట్ల బడ్జెట్‌ రుణాల గురించి కేంద్ర ప్రభుత్వానికి చెప్పకపోవడం చాలా పెద్ద తప్పిదం. గ్యారంటీ అవసరమే లేదన్న రాష్ట్ర ప్రభుత్వం ఎస్ర్కో ఒప్పందం ఎందుకు చేసుకున్నట్టు? ఆఫ్‌ బడ్జెట్‌ లోన్స్‌ను సంక్షేమానికి ఖర్చు పెడితే కార్పొరేషన్స్‌కి రికవరీ ఎక్కడి నుంచి వస్తుందో చెప్పాలి’’ అని డిమాండ్‌ చేశారు. రికవరీ లేకపోవడంతో కార్పొరేషన్లు ఆర్థికంగా నష్టాల సుడిగుండంలో చిక్కుకుంటాయని, అంతిమంగా ఆ భారం రాష్ట్ర ప్రభుత్వంపై పడుతుందని వివరించారు. సంక్షేమం కోసం ఖర్చుచేసే వినిమయ బడ్జెట్‌తో బడుగు, బలహీన వర్గాల ఆర్థిక అభివృద్ధి ఎలా సాధ్యమౌతుందని నిలదీశారు.


రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేసే ప్రతి సెస్‌ ట్రెజరీకి జమ కావాల్సిందేనని స్పష్టం చేశారు. అందుకు భిన్నంగా సెస్‌ ద్వారా వసూలైన నిధుల్ని ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుందో ఆర్థిక మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికే డెట్‌ సర్వీస్‌ రూ.లక్ష కోట్లకు చేరుకుందన్నారు. భవిష్యత్‌లో అన్ని ఆదాయాలూ, ఖర్చులకు సరిపోతే... అభివృద్ధి, సంక్షేమానికి తావెక్కడని ప్రశ్నించారు. ‘‘జగన్‌ రెడ్డి ప్రభుత్వం ఆర్టికల్‌ 202 (3) ప్రకారం లెజిస్లేచర్‌ చట్టం చేస్తే, ఆ మేరకు నిధులు ఖర్చు చేయాలి. అలా కాకుండా ఇష్టానుసారంగా చేస్తున్న ఖర్చులతో రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించారు. జగన్‌ అసమర్థ పాలనా విధానాలతో రాష్ట్రం దివాళా తీసే స్థితికి చేరుకుంది. రెండేళ్ల పాలనలో ప్రజల ఆదాయం పెంచేలా ఒక్క ప్రణాళికా వేయలేదు’’ అని యనమల విమర్శించారు.

Updated Date - 2021-07-24T08:11:05+05:30 IST