కుప్పంలో దొంగ ఓట్లకు కుట్ర
ABN , First Publish Date - 2021-11-15T08:53:57+05:30 IST
కుప్పంలో దొంగ ఓట్లకు కుట్ర
రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు చంద్రబాబు లేఖ
అమరావతి, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): కుప్పంలో దొంగ ఓట్లు వేయించేందుకు బయటి ప్రాంతాల వారిని తీసుకొచ్చారని, వెంటనే వారందరినీ పంపించేసేలా చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ అఽధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. తప్పుచేసిన వారిని వదిలేసి తెలుగుదేశం కార్యకర్తలపైనే పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు చంద్రబాబు ఈ విషయంపై ఆదివారం లేఖ రాశారు. ‘‘కుప్పం మున్సిపాలిటీలో సోమవారం పోలింగ్ జరగనుంది. దానికి 48 గంటల ముందే ప్రచారం ఆపేయాలి. బయటి ప్రాంతాల వారు వెళ్లిపోవాలి. దీనికి భిన్నంగా వైసీపీ అక్కడ ప్రచారం నిర్వహించి డబ్బు పంపిణీ చేసింది. తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల్లో చేసినట్లు ఇక్కడ కూడా బయటివారిని తీసుకొచ్చి వారితో ఓట్లు వేయించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంది. పోలీసులకు పిర్యాదు చేస్తుంటే.. వారు తెలుగుదేశం నేతలపైనే కేసులు పెడుతున్నారు. కుప్పం మున్సిపాలిటీలోని 23, 24 వార్డుల్లో బయటివారు వచ్చి డబ్బులు పంపిణీ చేయడం చూసిన టీడీపీకి చెందిన నగర అధ్యక్షుడు రాజ్‌కుమార్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆయనపై వారు దాడి చేసి కులం పేరుతో తిట్టారు. ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్తే వైసీపీ నేతలు మీపై ఫిర్యాదు చేశారంటూ, కస్టడీలోకి తీసుకుంటున్నామని చెప్పారు. దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘం తగు చర్యలు తీసుకోవాలి. ఎన్నికల నిబంధనలు అమలు చేయాలి’’ అని చంద్రబాబు డిమాండ్ చేశారు. వైసీపీ నేత, మొదలియార్ కార్పొరేషన్ చైౖర్మన్ బుల్లెట్ సురేశ్ బయటి ప్రాంతం వారని, ఆయన బుల్లెట్ ఫ్రూఫ్కారు కుప్పంలోనే ఉందన్నారు.
అశోక్‌బాబు ఫిర్యాదు
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత కూడా కుప్పంలో బయట వ్యక్తులు తిష్ట వేశారంటూ టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై కుప్పం ఎన్నికల రిటర్నింగ్ అధికారికి టీడీపీ ఎమ్మెల్సీ పి.అశోక్‌బాబు ఆదివారం లేఖ రాశారు. వివిధ వార్డుల్లో అధికార పార్టీకి అనుకూలంగా దొంగ ఓట్లు వేసేందుకు ఇతర నియోజకవర్గాల నుంచి డ్వామా ఫీల్డ్ అసిస్టెంట్లు, వెలుగు సిబ్బంది, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పెద్దసంఖ్యలో రాజాపార్క్లోని కమ్యూనిటీ హాలు, మార్కెట్ యార్డు, సీఎల్ఆర్సీలో ఆశ్రయం పొందారని ఆర్వో దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులే బయట వ్యక్తులను కుప్పంలోకి తీసుకెళ్తున్నట్లు కన్పిస్తున్న ఫోటోలను ఫిర్యాదుకు జత చేశారు. ఓటరు స్లిప్పుతో పాటు ఓటుకు 3 నుంచి 5 వేల వరకు ఇస్తున్న వీడియో క్లిప్పింగ్‌ను పంపారు. తక్షణం బయటి వ్యక్తులను పంపేయాలని కోరారు.