షాపింగ్ కాంప్లెక్స్‌కు ఆస్పత్రి స్థలమా?
ABN , First Publish Date - 2021-04-09T09:40:47+05:30 IST
మంగళగిరి ప్రభుత్వ ఆస్పత్రి స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించేందుకు ఎకరం భూమిని మంగళగిరి మున్సిపాలిటీకి కేటాయిస్తూ ప్రభుత్వం జారీచేసిన జీవోను హైకోర్టు సస్పెండ్ చేసింది...
- కేటాయింపుపై హైకోర్టు అభ్యంతరం.. జీవో సస్పెండ్
- మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల తదితరులకు నోటీసులు
అమరావతి, ఏప్రిల్ 8(ఆంధ్రజ్యోతి): మంగళగిరి ప్రభుత్వ ఆస్పత్రి స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించేందుకు ఎకరం భూమిని మంగళగిరి మున్సిపాలిటీకి కేటాయిస్తూ ప్రభుత్వం జారీచేసిన జీవోను హైకోర్టు సస్పెండ్ చేసింది. వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, పురపాలక ముఖ్యకార్యదర్శి, వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి, గుంటూరు జిల్లా కలెక్టర్, మంగళగిరి మున్సిపల్ కమిషనర్‌లకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ..విచారణను నాలుగు వారాలు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూ్‌పకుమార్ గోస్వామి, జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్‌తో కూడిన ధార్మసనం గురువారం ఆదేశాలిచ్చింది. మంగళగిరి ప్రభుత్వ ఆస్పత్రి భూమిలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి అనుమతిస్తూ ప్రభుత్వం గతేడాది జూలైలో జారీ చేసిన జీవో 79ను సవాల్ చేస్తూ సామాజిక కార్యకర్త ఎస్.శ్రీనివాస్ చెంగయ్య హైకోర్టులో వాజ్యం వేశారు. పిటిషనర్ తరఫు న్యాయవాది నర్రా శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ...స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఒత్తిడి మేరకు ఆస్పత్రి స్థలాన్ని షాపింగ్ కాంప్లెక్స్‌కు కేటాయించారన్నారు. దీంతో ఆస్పత్రి స్థలాన్ని షాపింగ్ కాంప్లెక్స్ కోసం కేటాయించడంపై ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. సంబంధిత జీవోను సస్పెండ్ చేసింది.