సుప్రీం కోర్టు చెప్పినా..

ABN , First Publish Date - 2021-05-18T07:38:24+05:30 IST

నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు విషయంలో నాలుగు రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు సోమవారం సాయంత్రం తెరపడింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆయనను సికింద్రాబాద్‌ ఆర్మీ ఆస్పత్రికి...

సుప్రీం కోర్టు చెప్పినా..

  • జైలు నుంచి ఆర్మీ ఆస్పత్రికి రఘురామ తరలింపులో జాప్యం
  • ఐదుగంటలకుపైగా తీవ్ర ఉత్కంఠ.. మధ్యాహ్నమే సుప్రీం ఆదేశాలు
  • వాటితో జైలువద్దకు లాయర్లు.. భిన్నంగా అక్కడి అధికారుల తీరు
  • ఆందోళనతో సీఎస్‌కు ఎంపీ భార్య ఫోన్‌.. నాన్చి..నాన్చి 6.30గం.లకు బయటకు
  • తుఫాన్‌ వాహనంలో తరలించే యత్నం.. బంధువుల అభ్యంతరం
  • చివరికి సొంత కారులోనే సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆస్పత్రికి
  • జ్యుడీషియల్‌ అధికారి సమక్షంలో పరీక్షలు!

గుంటూరు, మే 17 : నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు విషయంలో నాలుగు రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు సోమవారం సాయంత్రం తెరపడింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆయనను సికింద్రాబాద్‌ ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. అయితే, సుప్రీంకోర్టు ఆదేశాలు మధ్యాహ్నమే అందినా..నాన్చి నాన్చి సాయంత్రంగానీ రాష్ట్ర ప్రభుత్వం వాటిని అమలుచేయలేదు. గుంటూరు జిల్లా జైలు నుంచి 6.30 గంటలకు ఎస్కార్ట్‌ నడుమ బయలుదేరిన రఘురామ వాహనం రాత్రి 11 గంటల సమయంలో సికింద్రాబాద్‌ ఆర్మీ ఆస్పత్రికి చేరుకుంది. జ్యుడీషియల్‌ అధికారి సమక్షంలో రఘురామకు వైద్యపరీక్షలు మొదలయినట్టు సమాచారం. నిజానికి... సుప్రీంకోర్టు ఆదేశాలు మధ్యాహ్నం 1.30 నుంచి 2 గంటల మధ్య ఏపీ సీఎస్‌, తెలంగాణ హైకోర్టు రిజిస్ర్టార్‌, ఎంపీ తరపు న్యాయవాదులకు అందాయి. వాటిని తీసుకొని న్యాయవాదులు.. రాఘురామ బంధువులు, అభిమానులు పెద్ద సంఖ్యలో గుంటూరు జిల్లా జైలు వద్దకు తరలివచ్చారు. అయితే గంటలు గడుస్తున్నా ప్రభుత్వం వైపు నుంచి స్పందన కనిపించలేదు. సుప్రీం కోర్టు ఆదేశించినా నిర్లక్ష్యం ఏమిటని వారంతా విస్మయం వ్యక్తం చేశారు.  ఈ క్రమంలో ఎంపీ తరపు న్యాయవాది ఓలేటి లక్ష్మీనారాయణ.. ఏపీ సీఎస్‌ ఆదిత్యనాధ్‌దా్‌సతో ఫోనులో మాట్లాడారు. తాము సుప్రీం కోర్టు ఆదేశాలను పాటిస్తామని సాయంత్రం లోగా రఘురామకృష్ణరాజును హైదరాబాద్‌కు తరలిస్తామని సీఎస్‌ తెలిపారు.


మరోవైపు ఎంపీ సతీమణి రమాదేవి కూడా సీఎ్‌సతో మాట్లాడారు. తన భర్తకు జైలులో ప్రాణ హాని ఉందని, సుప్రీంకోర్టులో సీఐడీకి వ్యతిరేకంగా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఆయనను ఒక్క క్షణం కూడా గుంటూరు జైలులో ఉంచటం మంచిదికాదని, తక్షణం సికింద్రాబాద్‌ ఆర్మీ ఆస్పత్రికి తరలించాలని కోరారు. మరో గంటలో ఆయనను ప్రత్యేక ఎస్కార్ట్‌తో హైదరాబాద్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆమెకు సీఎస్‌ తెలిపారు. అప్పుడు సమయం సాయంత్రం సుమారు 5 గంటలు. ఆ తర్వాత ఒక గంటకు జైలు వద్ద పోలీసుల హడావుడి కనిపించింది. ఎస్కార్ట్‌ వాహనంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. వై కేటగిరి భద్రతను కూడా రఘురామకు అనుమతించాలన్న సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో.. వారిని వెంట ఉండనిచ్చారు. ఎంపీని తరలించేందుకు తొలుత తుఫాన్‌ వాహనం సిద్ధంచేశారు. ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకోవాలన్న ఎంపీ తరఫు వారి విజ్ఞప్తి మేరకు రఘురామను ఆయన వాహనంలోనే తరలించేందుకు పోలీసులు అంగీకరించారు.  




మీసం మెలేసిన రఘురామ

గుంటూరు జిల్లా జైలు నుంచి బయటకు రాగానే... బయట రఘురామ రాజు చేతులు ఊపుతూ అభివాదం చేశారు. వ్యక్తిగత భద్రతా సిబ్బంది సహాయంతో అతి కష్టం మీద నడుస్తూ రఘురామ కారు వద్దకు వచ్చారు. కారు జిల్లా జైలు ప్రాంగణం నుంచి ఆయన తరలింపు దృశ్యాలను చిత్రీకరిస్తున్న మీడియా వారిని చూసి రఘురామ కారులో నుంచే మీసం తిప్పారు. పాదాలకు అయిన గాయాలను చూపించారు.మరోవైపు... రఘురామను జీజీహెచ్‌తోపాటు రమేశ్‌ ఆస్పత్రికి కూడా తరలించి వైద్య పరీక్షలు చేయించాలని సీఐడీ కోర్టు ఇచ్చిన ఆదేశాలను ధిక్కరించారంటూ ఎంపీ తరపు న్యాయవాదులు కోర్టులో క్రిమినల్‌ కేసు ఫైల్‌ చేశారు. ఇదిలావుంటే హైకోర్టు ఆదేశాల ప్రకారం సీఐడీ కోర్టు రమేశ్‌ ఆస్పత్రికి తరలించాలని ఇచ్చిన ఉత్తర్వులను సవరించాలంటూ సీఐడీ తరపు న్యాయవాదులు కూడా మరో పిటిషన్‌ దాఖలు చేశారు. 




గాబరా పెడుతున్న ‘గాయాలు’ 

అనేక మలుపులు తిరిగి చివరకు సికింద్రాబాద్‌ ఆర్మీ ఆస్పత్రికి చేరిన ఎంపీ రఘురామరాజు వ్యవహారంపై ఏపీ పోలీసు వర్గాల్లో హై టెన్షన్‌ నెలకొంది. విచారణ పేరుతో సీఐడీ అధికారులు తనను లాఠీలతో కొట్టారని ఎంపీ గుంటూరు సీఐడీ కోర్టులో మెజిస్ర్టేటుకు ఫిర్యాదు చేశారు. దీనిపై జీజీహెచ్‌ వైద్యులు పరీక్షించిన అనంతరం ఇచ్చిన నివేదిక.. కర్ర విరగకూడదు... పాము చావకూడదు అన్న రీతిన సాగింది. అయితే, ఎంపీ కాళ్లు వాచాయని, కాళ్లు రంగు మారాయని ఆ నివేదికా పేర్కొంది. అయితే అవి లాఠీ దెబ్బలని చెప్పలేమంటూ మధ్యస్థంగా నివేదికలో పేర్కొన్నప్పటికీ ప్రస్తుతం ఈ వ్యవహారం పోలీసు వర్గాలను ఆందోళనకు గురి చేస్తోంది. ఎంపీ ఫిర్యాదుపై తొలుత సీఐడీ అధికారులు ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. వైసీపీ వర్గీయులు, పలువురు మంత్రులు మాత్రం ఆయనపై సీఐడీ అధికారులు థర్డ్‌ డిగ్రీ ప్రయోగించలేదని, సోరియాసిస్‌ వల్ల కాళ్లు రంగుమారి ఉంటాయని ప్రకటన చేశారు. అయితే హైదరాబాద్‌లో సీఐడీ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకోవటానికి ముందే ఆయనకు ఆ పరిస్థితి ఉంటే, అదే విషయం కోర్టుకు అప్పుడే చెప్పి ఉండేవారని ఎంపీ తరపు న్యాయవాదులతోపాటు ఆయన అభిమానులు పేర్కొంటున్నారు. ఆయనపై లాఠీ ప్రయోగం జరిగి ఉంటుందని వారంతా అనుమానిస్తున్నారు. సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నేడో, రేపో ఆర్మీ ఆస్పత్రి వైద్యులు ఆయన ఒంటిపై గాయాలపై నివేదిక రూపొందించనున్న నేపథ్యంలో ఈ వ్యవహారం తీవ్ర ఉత్కంఠ కలిగిస్తోంది. వైద్య పరీక్షల్లో ఆయనపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించినట్టు తేలితే సీఐడీ అధికారులు భారీ మూల్యం చెల్లించుకునే పరిస్థితి తప్పదని న్యాయవాదులేకాక పోలీసు అధికారులు సైతం అంటున్నారు. ఓ ఎంపీపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వారంటున్నారు. 


Updated Date - 2021-05-18T07:38:24+05:30 IST