అమూల్‌కు ఏపీ డెయిరీ ఆస్తులు

ABN , First Publish Date - 2021-05-05T08:24:53+05:30 IST

ఏపీ డెయిరీ డెవల్‌పమెంట్‌ సంస్థకు చెందిన ఆస్తులను అమూల్‌ సంస్థకు లీజుకు ఇవ్వాలని రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయించింది. పూజారులు, ఇమామ్‌ల గౌరవ వేతనాలను పెంచుతూ నిర్ణయం తీసుకొంది

అమూల్‌కు ఏపీ డెయిరీ ఆస్తులు

లీజుగా అప్పగించాలని కేబినెట్‌ నిర్ణయం

పూజారులు, ఇమామ్‌ల వేతనాలు పెంపు

సెవెన్త్‌ నుంచి పాఠశాలల్లో సీబీఎ్‌సఈ

13న తొలి విడత భరోసా సొమ్ము జమ

బీసీ రిజర్వేషన్ల గడువు మరో పదేళ్లు పెంపు


అమరావతి, మే 4 (ఆంధ్రజ్యోతి): ఏపీ డెయిరీ డెవల్‌పమెంట్‌ సంస్థకు చెందిన ఆస్తులను అమూల్‌ సంస్థకు లీజుకు ఇవ్వాలని రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయించింది. పూజారులు, ఇమామ్‌ల గౌరవ వేతనాలను పెంచుతూ నిర్ణయం తీసుకొంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన మంగళవారం వెలగపూడి సచివాలయంలో  మంత్రివర్గ సమావేశం జరిగింది. ఆ వివరాలను ప్రజాసంబంధాలు, సమాచార, రవాణాశాఖ మంత్రి మీడియాకు వెల్లడించారు. వెనుకబడిన కులాలకు కేటాయించిన రిజర్వేషన్లు మరో పదేళ్లకు పెంచాలని నిర్ణయించారు. ప్రకాశంజిల్లా పాల ఉత్పత్తి సంస్థ అప్పులు తీర్చి పునరుద్ధరించేందుకు రూ.69 కోట్లు  మంజూరు చేశారు.  176 మండలాల్లో పీహెచ్‌సీలు ఏర్పాటు చేసేందుకు రూ.511 కోట్లు మంజూరు చేసిన కేబినెట్‌.. ప్రతి మండలంలోనూ నలుగురు డాక్టర్లతో కూడిన రెండు పీహెచ్‌సీలు ఉండేలా చర్యలు తీసుకోవాలని, ప్రతీ పీహెచ్‌సీకి 104ని అనుసంధానించాలని నిర్ణయించింది. కడపలో వైఎ్‌సఆర్‌ స్టీల్‌ ప్లాంట్‌ను ‘లిబర్టీ’కి బదులు ‘ఎస్సార్‌ స్టీల్స్‌’కు అప్పగిస్తూ తీర్మానం చేసింది. కృష్ణపట్నం పోర్టులో మౌలిక వసతుల కోసం రూ.1,448 కోట్లు మంజూరు చేసింది. విశాఖ కైలాసగిరి-భోగాపురం పరిధిలోని 19 కిలోమీటర్ల ప్రాంతం అభివృద్ధి సహా  ఆరు నుంచి ఎనిమిది వరుసల రోడ్లు,  ఐదు ఎకరాల్లో స్కై టవర్లు, 11 బీచ్‌ల అభివృద్ధికి తీర్మానించింది. ఇంకా...


రైతులు, మత్స్యకారులకు ‘భరోసా’

మే 13న 54 లక్షల మందికి లబ్ధి చేకూరేలా రైతు భరోసా మొదటి విడత రూ.7500 జమ. ఆర్‌వోఎ్‌ఫఆర్‌, దేవస్థానం భూములు, ఎస్సీ,ఎస్టీ, బీసీ వాస్తవ కౌలు దారులు ఈ పథకానికి అర్హులు.  ఈ నెల 8వ తేదీన 2020 ఖరీఫ్‌ ఉచిత పంట బీమా జమ. ఈ నెల 18న వైఎ్‌సఆర్‌ మత్స్యకార భరోసా కింద ఒక్కో కుటుంబానికి పదివేల రూపాయలుజమ. ఇందుకోసం 130 కోట్లు జమ చేయాలని నిర్ణయం. నాటు పడవలు, తెప్పలతో వేటచేసే మత్స్యకారులంతా అర్హులు. 


ప్రైవేటు వర్సిటీ చట్టంలో మార్పులు..

7వ తరగతి విద్యార్థులకు సీబీఎ్‌సఈ అమలు కోసం సీబీఎ్‌సఈతో విద్యాశాఖ ఒప్పందం. రాష్ట్రంలో జగన్‌ సర్కారు వచ్చాక ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు 6.12 లక్షల మంది పెరిగితే .. ప్రైవేటు విద్యాసంస్థల్లో ఆ మేరకు విద్యార్ధులు తగ్గారని నిర్ధారణ. 2024 నాటికి పదో తరగతి పరీక్షలు సీబీఎ్‌సఈ విధానంలో రాసేలా 44,639 పాఠశాలల్లో సీబీఎ్‌సఈ సిలబస్‌. విద్యాశాఖ అభివృద్ధి క.ోసం రూ.1860 కోట్ల ప్రపంచ బ్యాంకు రుణం. ఎవరైనా అప్పగించేందుకు ముందుకొస్తే ఎయిడెడ్‌ పాఠశాలలు స్వాధీనం. ముందుకు రాకుంటే ప్రభుత్వపరిధిలోకి ఉపాధ్యాయులు. ప్రైవేటు వర్సిటీలో 35 శాతం సీట్లు కన్వీనరు కోటాలోకి తీసుకువస్తూ వర్సిటీ చట్టంలో మార్పు.


పూజారులు, ఇమామ్‌ల గౌరవ వేతనాలు పెంపు

ఏ కేటగిరి దేవాలయాల్లోని అర్చకుల గౌరవ వేతనం పది వేల రూపాయల నుంచి రూ.15,000కు పెంపు.  బీ  కేటగిరి దేవాలయాల్లో రూ.5,000 నుంచి రూ.10,000కు పెంపు. ఇమామ్‌లకు ఐదు వేల రూపాయల నుంచి పది వేల రూపాయలకు, మౌజమ్‌లకు మూడువేల రూపాయల నుంచి ఐదువేల రూపాయలకు, పాస్టర్లకు ఐదు వేల రూపాయలు గౌరవ వేతనం. 


పోలవరం వద్ద ఎత్తిపోతలకు నిధులు..

వైఎ్‌సఆర్‌ పల్నాడు కరువు నివారణ కోసం రూ.2,740 కోట్లు రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ సంస్థ నుంచి రుణం. హంద్రి-నీవా సుజల స్రవంతి ప్రధాన కాలువ 4.806 కిలోమీటర్ల నుంచి 216.300 కిలోమీటర్ల వరకూ 6,300 క్యూసెక్కులను తరలించేందుకు వీలుగా విస్తర ణ పనులు. అందుకు అవసరమైన అదనపు పంప్‌ హౌస్‌లను తొలిదశలో నిర్మించేందుకు రూ.6182.20 కో ట్లు వ్యయం చేసేందుకు ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలను సడలించి రుణం తీసుకునేందుకు జల వనరుల శాఖ కు అనుమతి. హెచ్‌ఎన్‌ఎ్‌సఎస్‌ మూడో అంచనా సవరణ కింద రూ.9318.14 కోట్లకు కేబినెట్‌ ఆమోదం. రెం డో అంచనాసవరణ రూ.7340.87 కోట్లను సవరించి.. రూ.1977.27 కోట్లను పెంచేందుకు ఆమోదం. పోలవరం వద్ద గోదావరి ఎత్తిపోతల కోసం రూ.912  కోట్ల మంజూరుకు సమ్మతి. యేలేరు-తాండవ రిజర్వాయరు అనుసంధానం కోసం రూ.7192.02 కోట్ల అంచనాకు ఆమోదం. వెలిగొండ నిర్మాణపనుల్లోరూ.37,22,58,139 కోట్లను అదనంగా చెల్లించేందుకు ఆమోదం.


24 గంటల్లోనే కొవిడ్‌ పరీక్షా ఫలితం..

కొవిడ్‌ బాధితులకు 24 గంటల్లోనే పరీక్ష ఫలితాన్ని ఇవ్వాలని నిర్ణయం. రాష్ట్రంలో ఆక్సిజన్‌ బెడ్లు 26000కు పెంపుదల. కొవిడ్‌ వల్ల ఎవరూ మరణించకుండా చర్యలు. సింగపూర్‌నుంచి 20 ఆక్సిజన్‌ ట్యాంకర్ల దిగుమతి. 


45ఏళ్లు పైబడ్డవారికే టీకా 

రాష్ట్రంలో 45 ఏళ్ల పైబడ్డవారికే ప్రాధాన్యమిస్తూ కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేస్తామని వెల్లడిస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం లేఖ రాయాలని కేబినెట్‌ నిర్ణయించింది. రాష్ట్రాలు సొంతంగా వ్యాక్సిన్‌ కొనుగోలు చేసేందుకు ఆమోదం తెలిపిన కేంద్రం .. వాటిని 18 నుంచి 45 ఏళ్లలోపు వయస్సున్న వారికే వేయాలన్న నిబంధన విధించింది. అయితే.. ఈ నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ 45 ఏళ్ల పైబడ్డవారికి ప్రాధాన్యమిస్తూ రెండు డోసులూ ముందుగా వేసేశాక.. 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సున్నవారికి తర్వాత వేయొచ్చని ప్రధాని మోదీకి ఆ లేఖలో జగన్‌ వెల్లడించనున్నారు. 

Updated Date - 2021-05-05T08:24:53+05:30 IST