ఇప్పుడేమంటారు.. వీర్రాజా!

ABN , First Publish Date - 2021-02-26T07:16:02+05:30 IST

‘చిన్న ట్వీట్‌కే అంత రాద్ధాంతమా? విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ పెద్దలు చెప్పారా? పోనీ ఏదైనా అధికారిక ప్రకటన వచ్చిందా?’ - ఢిల్లీ పర్యటన నుంచి రాగానే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఉక్కు ఉద్యమకారులపై...

ఇప్పుడేమంటారు.. వీర్రాజా!

  • విశాఖ ఉక్కు ప్రైవేటీకరణే లేదన్నారు!
  • చిన్న ట్వీట్‌కే రాద్ధాంతమా అని ప్రశ్న
  • ఇప్పుడు ప్రధాని మాటల్లోనే స్పష్టత
  • ఇరకాటంలో రాష్ట్ర బీజేపీ నేతలు
  • అపాయింట్‌మెంట్‌ ఇవ్వని ప్రధాని
  • ‘ఉక్కు’తో మీకేం పని అన్న అమిత్‌షా!


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

‘చిన్న ట్వీట్‌కే అంత రాద్ధాంతమా? విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ పెద్దలు చెప్పారా? పోనీ ఏదైనా అధికారిక ప్రకటన వచ్చిందా?’ - ఢిల్లీ పర్యటన నుంచి రాగానే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఉక్కు ఉద్యమకారులపై ఇలా చిందులు తొక్కారు. తమను ప్రశ్నించేందుకు వచ్చిన వారిపై ఎదురుదాడికి దిగారు. ఇప్పుడు... సోము వీర్రాజుతో సహా రాష్ట్ర బీజేపీ నేతలంతా విశాఖ ఉక్కుపై పూర్తి ఆత్మరక్షణలో పడ్డారు. ‘‘వ్యాపారం చేయడం ప్రభుత్వం పని కాదు. నాలుగు వ్యూహాత్మక రంగాలకు సంబంధించినవి మినహా... మిగిలిన ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ విక్రయిస్తాం’’ అని ప్రధాని మోదీ బుధవారం తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. 100 ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరిస్తామని వెల్లడించారు. వెరసి... విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపైనా వెనక్కి తగ్గేది లేదని పరోక్షంగా చెప్పేశారు. మరోవైపు... నీతి ఆయోగ్‌ ట్వీట్‌తో వెలుగులోకి వచ్చిన విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. బుధవారమే కేంద్ర ప్రభుత్వం ఉక్కు విక్రయం కోసం ప్రత్యేక కమిటీని కూడా నియమించింది.


ఇరకాటంలో బీజేపీ... 

విశాఖ ఉక్కు పరిరక్షణకు పార్టీలు, ప్రజా సంఘాలు రోడ్డెక్కి ఉద్యమిస్తున్నాయి. బీజేపీ మాత్రం ఏమీ చెప్పలేని, చేయలేని నిస్సహాయ స్థితిలో పడింది. ఇటీవల సోము వీర్రాజు నేతృత్వంలోని బృందం హడావుడిగా ఢిల్లీ వెళ్లింది. ప్రధాని మోదీకి మూడు ప్రతిపాదనలు సమర్పించేందుకు సోము ప్రయత్నించారు. కానీ మూడు రోజులు వేచి చూసినా ప్రధాని అపాయింట్‌మెంట్‌ లభించలేదు. చివరికి కేంద్ర హోం మంత్రి అమిత్‌షా మూడంటే మూడు నిమిషాలు అవకాశమిచ్చారు. ఆయనకు సమస్య వివరించేందుకు ప్రయత్నించగా.. ‘‘అవన్నీ ఎంపీలు చూసుకుంటారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరుగుతుంటే ఇక్కడికెందుకు వచ్చారు?’ అని షా అడగడంతో సోము వీర్రాజు షాకయ్యారు. మరోవైపు... ‘పార్టీకి సంబంధించిన విషయాలపైనే నాతో మాట్లాడండి. ఇతర అంశాలతై సంబంధిత మంత్రులతోనే మాట్లాడుకోండి’ అని బీజేపీ అధ్యక్షుడు నడ్డా సూటిగా తేల్చిచెప్పారు. దీంతో... సోము వీర్రాజు బృందం ఢిల్లీకి వెళ్లి... ఉత్తిచేతులతో తిరిగి వచ్చింది. ఆ తర్వాత సోము వీర్రాజు ఉత్తరప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు ఎన్నికైన జీవీఎల్‌ నరసింహారావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. అసలు విషయం చెప్పకుండా.. ‘‘చిన్న ట్వీట్‌కే అంత రాద్ధాంతమా..? విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తున్నట్లు ప్రభుత్వ పెద్దలు చెప్పారా? పోనీ ఏదైనా అధికారిక ప్రకటన వచ్చిందా’ అంటూ ఆందోళనకారులపై ఎదురుదాడికి దిగారు. రాష్ట్రంలోని పార్టీలు ఉద్దేశపూర్వకంగానే విశాఖ ఉక్కు కార్మికులను పక్కదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. అసలు స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణే లేదన్నట్లుగా మాట్లాడారు. వారం తిరక్కుండానే ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు వీర్రాజుతోపాటు ఆయనతో పాటు ఉన్నవారిని ఇరకాటంలో పడేశాయి.


సోషల్‌ మీడియాలో చెడుగుడు

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో రాష్ట్ర బీజేపీ నేతలపై  నెటిజన్లు సోషల్‌ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇంకెన్నాళ్లు అబద్ధాలు చెబుతారని నిలదీస్తున్నారు. అమరావతి, ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్‌తో మొదలుకుని ఇప్పుడు విశాఖ ఉక్కుపైనా ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడుతున్నారు.


Updated Date - 2021-02-26T07:16:02+05:30 IST