విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై మరో పిల్‌

ABN , First Publish Date - 2021-07-09T08:54:47+05:30 IST

విశాఖ ఉక్కు కర్మాగారం(ఆర్‌ఐఎన్‌ఎల్‌) ప్రైవేటీకరణపై కేంద్ర కేబినెట్‌ కమిటీ ఈ ఏడాది జనవరి 27న తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం హైకోర్టులో గురువారం విచారణకు వచ్చింది

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై మరో పిల్‌

అమరావతి, జూలై 8(ఆంధ్రజ్యోతి): విశాఖ ఉక్కు కర్మాగారం(ఆర్‌ఐఎన్‌ఎల్‌) ప్రైవేటీకరణపై కేంద్ర కేబినెట్‌ కమిటీ ఈ ఏడాది జనవరి 27న తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం హైకోర్టులో గురువారం విచారణకు వచ్చింది. వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న కేంద్ర ఆర్థికశాఖ, ఉక్కుశాఖ, ఖనిజశాఖ కార్యదర్శులతోపాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్‌ఐఎన్‌ఎల్‌ చైర్మన్‌, విశాఖ జిల్లా కలెక్టర్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇదే అంశంపై మాజీ ఐపీఎస్‌ అధికారి జేడీ లక్ష్మీనారాయణ దాఖలు చేసిన వ్యాజ్యంతో ప్రస్తుత వ్యాజ్యాన్ని జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అరూ్‌పకుమార్‌ గోస్వామి, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన ధర్మాసనం గురువారం ఆదేశాలిచ్చింది. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై కేంద్ర కేబినెట్‌ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ సొసైటీ ఫర్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ స్కాలర్‌షిప్‌ హోల్డర్స్‌ అధ్యక్షుడు డి.సువర్ణరాజు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషనర్‌ తరఫున న్యాయవాది ఎస్‌.సురేంద్రకుమార్‌ వాదనలు వినిపిస్తూ... విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరిగితే నియామకాల్లో రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ పాటించే అవకాశం లేకుండా పోతుందన్నారు. దీనివల్ల బలహీనవర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోతారన్నారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై దాఖలైన వ్యాజ్యంతో కలిపి ప్రస్తుత వ్యాజ్యాన్ని విచారించాలని కోరారు.

Updated Date - 2021-07-09T08:54:47+05:30 IST