రీ సర్వేలో మరో గందరగోళం
ABN , First Publish Date - 2021-12-30T08:53:26+05:30 IST
భూముల రీ సర్వే ప్రక్రియలో మరో గందరగోళానికి తెరలేచింది. తొలినుంచి అనేక అంశాల్లో అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటూ తీవ్రగందరగోళం సృష్టిస్తున్న సర్కారు..

- అప్పీల్స్ పరిష్కారానికి డీటీల నేతృత్వాన మొబైల్ మేజిస్ట్రేట్ టీమ్‌లు
- జూన్‌లోనే జీవో 530 జారీ చేసిన న్యాయశాఖ
- అందుకు భిన్నంగా రెవెన్యూ శాఖ జీవో 368
- పంచాయతీరాజ్, పురపాలక అధికారులు కూడా అప్పీల్స్ వింటారంటూ సవరణలు
- ఏ జీవోను అనుసరించాలన్నదే అసలు సమస్య
(అమరావతి-ఆంధ్రజ్యోతి): భూముల రీ సర్వే ప్రక్రియలో మరో గందరగోళానికి తెరలేచింది. తొలినుంచి అనేక అంశాల్లో అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటూ తీవ్రగందరగోళం సృష్టిస్తున్న సర్కారు.. ఇప్పుడు మరో పెద్ద అయోమయానికి గురిచేసే ఉత్తర్వు ఇచ్చింది. రీ సర్వేలో రైతుల అప్పీల్స్ (ఫిర్యాదులు)ను ఎవరు పరిష్కరించాలన్న కీలక విషయంలోనూ పరస్పరం పూర్తి విరుద్ధమైన ఉత్తర్వులు ఇచ్చింది.
డీ టీలకు ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అధికారాలు
రాష్ట్రంలో భూముల సమగ్ర సర్వే జరుగుతోన్న సంగతి తెలిసిందే. సర్వే సరిహద్దుల చట్టంలో సెక్షన్ 9(2) కింద నోటీసులిచ్చి సర్వే పూర్తిచేశాక రైతుల నుంచి ఏమైనా అభ్యంతరాలు వస్తే వాటిని పరిష్కరిస్తూ సెక్షన్ 11 కింద ఉత్తర్వులు ఇస్తారు. ఇందుకోసం డిప్యూటి తహసిల్దార్‌కు స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ర్టేట్ అధికారాలు కల్పిస్తూ జూన్ ఏడో తేదీన న్యాయ శాఖ ఉత్తర్వు (జీవో 530) జారీ చేసింది.
భూముల రీ సర్వే కోసం ఆంధ్రప్రదేశ్ సర్వే, సరిహద్దుల చట్టం-1923లో సవరణలు తీసుకొచ్చి రూల్స్‌ను మార్చారు. గ్రామ సర్వేయర్లను రూల్స్ పరిధిలోకి తీసుకువచ్చారు. అప్పీల్స్ పరిష్కారం విషయంలో గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీరాజ్‌శాఖ, పట్టణ ప్రాంతాల్లో పురపాలక శాఖ అధికారులకు బాధ్యతలు కల్పించారు. పంచాయతీరాజ్ శాఖలో డివిజనల్ లెవల్ పంచాయతీ అధికారి, రూరల్ డెవల్‌పమెంట్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్, పంచాయతీ కార్యదర్శి, ఇంకా సర్వే కమిషనర్ నిర్ధేశించే అధికారులు సర్వే, సరిహద్దుల చట్టంలోని సెక్షన్ 9(1), 10(1)పై ఇచ్చే ఉత్తర్వులపై వచ్చే అప్పీల్స్‌ను పరిష్కరిస్తారు. ఇక, పట్టణ ప్రాంతాల్లో పురపాలక రెవెన్యూ అధికారి, జిల్లా టౌన్, కంట్రీ అధికారి, టౌన్ సర్వేయర్, వార్డ్ ప్లానింగ్ కార్యదర్శి, సర్వే కమిషనర్ నిర్ధేశించే ఇతర అధికారులు అప్పీల్స్‌ను పరిష్కరిస్తారని జీవో 368లో పేర్కొన్నారు. సర్వే, సరిహద్దుల చట్టం రూల్స్‌లో సవరణలు చేస్తూ జారీ చేసిన తుది నోటిఫికేషన్‌కు సంబంధించిన జీవో ఇది.
ఏది ఆచరించాలి?
న్యాయ, రెవెన్యూ శాఖలు జారీ చేసిన 530, 368 జీవోల్లో దేన్ని ప్రామాణికంగా తీసుకోవాలనే సందేహం ప్రస్తుతం అధికారులకు ఎదురవుతోంది. డిప్యూటి తహసిల్దార్‌కు ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అధికారాలు ఇచ్చాక, వారి నేతృత్వంలో మొబైల్ మేజిస్ట్రేట్ టీమ్‌లు రైతుల అప్పీల్స్‌ను పరిష్కరిస్తాయని ఊరూరా ప్రచారం చేశారు. ఇప్పుడు రెవెన్యూశాఖ కొత్తగా జీవో 368 ఇస్తూ, పురపాలక, పంచాయతీరాజ్ అధికారులు కూడా అప్పీల్స్ పరిష్కరిస్తారని పేర్కొనడంతో తీవ్ర అయోమయం, గందరగోళం నెలకొంది. ఇప్పటికే న్యాయశాఖ ఇచ్చిన ఉత్తర్వు అమల్లో ఉండగా, దాన్ని తోసిరాజనేలా రెవెన్యూ శాఖ కొత్త ఉత్తర్వు ఇవ్వడం తీవ్ర గందరగోళానికి దారితీసేలా ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.