అమరావతి: సినిమా థియేటర్ల టిక్కెట్ల ధరలపై ముగిసిన భేటీ

ABN , First Publish Date - 2021-12-31T21:17:15+05:30 IST

సినిమా థియేటర్ల టిక్కెట్ల ధరల వ్యవహారంపై ప్రభుత్వం నియమించిన కమిటీ సమావేశం ముగిసింది.

అమరావతి: సినిమా థియేటర్ల టిక్కెట్ల ధరలపై ముగిసిన భేటీ

 అమరావతి: సినిమా థియేటర్ల టిక్కెట్ల ధరల వ్యవహారంపై ప్రభుత్వం నియమించిన కమిటీ సమావేశం ముగిసింది. హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ నేతృత్వంలో ఈ భేటీ జూమ్‌లో జరిగింది. థియేటర్లు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లకు సంబంధించి ప్రతినిధులు తదితరులు ఈ సమావేశంలో పాల్గొని సమస్యలను వివరించారు. సీ క్లాస్‌ సెంటర్లలో టికెట్ ధరలు రూ.10గా నిర్ణయించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సీ క్లాస్ సెంటర్లలో టిక్కెట్ రేట్లు తగ్గించడంవల్ల థియేటర్లు మూతపడుతున్నాయని, ఇది సినీ పరిశ్రమలో తీవ్ర ఆందోళనకరమైన అంశమని అన్నారు. కరెంట్ ఖర్చులు కూడా రావని ప్రతినిధులు పేర్కొన్నారు.


కరెంట్ బిల్లులు, జీఎస్టీ ఛార్జీలు, నిర్వహణ ఖర్చులు భరించలేకనే.. 11 జిల్లాల్లో థియేటర్లు మూసివేశారని ప్రతినిధులు తెలిపారు. దీంతో వారం రోజుల్లో మరో సమావేశం నిర్వహిస్తామని హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పారు. వచ్చే సమావేశానికి పూర్తి ప్రతిపాదనలతో రావాలని అధికారులు సూచించారు. థియేటర్ల మూసివేతను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ప్రిన్సిపల్ సెక్రటరీ అన్నారు. సమస్యలు పరిష్కరించేందుకు, టికెట్ ధరలను పునఃసమీక్షించేందుకే.. కమిటీ ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు.

Updated Date - 2021-12-31T21:17:15+05:30 IST